'రాజన్న రాజ్యం' లో బెల్టు షాపులుండవు

పల్లి (కృష్ణాజిల్లా) 11 ఏప్రిల్ 2013 : 'రాజన్న రాజ్యం'లో బెల్టు షాపులు ఉండవని శ్రీమతి వైయస్ షర్మిల హామీ ఇచ్చారు. ఉగాది సందర్భంగా జగనన్నమాటగా ఈ హామీ ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా గొల్లపల్లిలో గురువారం సాయంత్రం జరిగిన ఒక బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.

జగనన్న సీఎం అయ్యాక వచ్చే రాజన్న రాజ్యంలో మద్యం బెల్టు షాపులను తొలగిస్తారనీ, దాని వల్ల గ్రామాలు, కుటుంబాలు బాగుపడతాయనీ ఆమె అన్నారు. చెడు అలవాట్లకు ప్రజలు దూరమౌతారనీ, దాని వల్ల రాష్ట్రం బాగుపడుతుందనీ షర్మిల వ్యాఖ్యానించారు.

రాబోయే రాజన్నరాజ్యంలో రైతే రాజు అని ఆమె అన్నారు. రైతులకు, మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామనీ, పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువు మానే అవసరం ఉండదని, వృద్ధులకు 700 రూపాయలు, వికలాంగులకు 1000 పింఛన్‌ ఇస్తామనీ ఆమె హామీ ఇచ్చారు. అమ్మఒడి పథకం ద్వారా ప్రతి కుటుంబానికీ ఇద్దరు పిల్లల చదువుకు గాను పదవ తరగతి వరకు ఒకొక్కరికి రూ. 500 చొప్పున నేరుగా తల్లి ఖాతాలోనే జమ అవుతుందని ఆమె చెప్పారు. రాజన్న రాజ్యంలో ఆరోగ్య శ్రీ మళ్లీ అమలు అవుతుందనీ, గుడిసె అన్నదే లేకుండా అందరికీ పక్కా ఇళ్లు వస్తాయనీ ఆమె పేర్కొన్నారు.  కరెంట్ నిల్ బిల్ ఫుల్ అన్న చందంగా ప్రభుత్వం తీరు ఉందనీ, విద్యుత్ చార్జీల పేరుతో ఏకంగా రూ.32 వేల కోట్ల భారం వేసి ప్రజల రక్తం పిండాలనుకుంటున్నారనీ ఆమె విమర్శించారు.
"వ్యాట్ పేరుతో మరో రూ.10 వేల కోట్ల భారం వేశారు. ఈ ప్రభుత్వానికి ఎక్కువ ఆయుష్షు లేదు. మహా అయితే ఆరు నెలలో, సంవత్సరమో ఉంటుంది. వీరి పాపం పండింది. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెబుతారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని చంద్రబాబు నెత్తిన పెట్టుకుని కాపాడుతున్నారు" అని ఆమె దుయ్యబట్టారు. 

ప్రజలు అమాయకులు కారు!
ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన 'అమ్మహస్తం' పథకంలోని డొల్లతనాన్ని శ్రీమతి షర్మిల ఎండగట్టారు.
‘రాజశేఖరరెడ్డి బతికిఉంటే ఇప్పుడు ఇస్తున్న నెలకు 20 కిలోలకు బదులుగా 30 కిలోల బియ్యం ఇచ్చేవారనీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తున్నవి 20 కిలోలు మాత్రమేననీ జనం మరో పది కిలోల బియ్యం మార్కెట్లో కొనుక్కోవాల్సి వస్తోందనీ శ్రీమతి షర్మిల అన్నారు.
"మార్కెట్‌లో కిలో బియ్యం రూ. 30 వేసుకున్నా పదికిలోలు అంటే రూ.300 అవుతుంది. రాజశేఖరరెడ్డి బతికి ఉంటే మీకు నెలకు ఈ రూ.300 మిగిలేవి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి బియ్యం 20 కిలోల నుంచి 30 కిలోలకు పెంచకుండా.. ధరను రూ. 2 నుంచి రూ.1కి తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల మీకు మిగులుతున్నది కేవలం 20 రూపాయలే. అంటే ఏడాదికి రూ.240. ఇప్పుడు ఎన్నికల సంవత్సరం వస్తోంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడానికి ఇంకా ఒక ఏడాది మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఒక పథకం పెట్టింది. ఈ పథకంలో ఉప్పు, నూనె, కారం, పంచదార ఇస్తారట. ఆ ప్యాకెట్లపై ముఖ్యమంత్రి బొమ్మ కూడా వేసుకుంటారట. దీనివల్ల ఒక్కో కుటుంబానికీ నెలకు రూ.100 మిగులుతుందంట. అంటే అటు బియ్యంలో, ఇటు దీనిలో కలిపి కుటుంబానికి ఏడాదికి రూ.1500 మాత్రమే మిగులుతాయి. అదే రాజశేఖరరెడ్డి బతికి ఉంటే మీకు ఐదేళ్లలో కనీసం 20 వేల రూపాయలు మిగిలి ఉండేవి. ఈ ముఖ్యమంత్రి మిగిల్చింది 1500 మాత్రమే. ఇది చూసి ప్రజలు ఓటు వేయాలట. ప్రజల్ని ఆయన పిచ్చివాళ్లు అనుకుంటున్నారు. (ప్రజలనుద్దేశించి) ఏమ్మా మీరు పిచ్చివాళ్లా? మీరు అమాయకులా? నెలకు వంద రూపాయలు మిగిలితే సరిపోతుందా?" అని ఆమె ప్రశ్నించారు.

117వ రోజు పాదయాత్ర 13.5 కిలోమీటర్లు 
'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర 117వ రోజు గురువారం కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం సీతారామపురం నుంచి ప్రారంభమై. మర్రిబంధం, మీర్జాపురం, గొల్లపల్లి మీదుగా పోనసానపల్లి క్రాస్‌రోడ్స్ వరకు సాగింది. దారిలో రైతులతో మాట్లాడిన షర్మిల వారి సమస్యలు తెలుసుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 187వ జయంతి సందర్భంగా మర్రిబంధంలో ఆయన చిత్రపటానికి షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. పోనసానపల్ల్లిలో ఆమె రాత్రికి బస చేశారు.

పాదయాత్రలో గురువారం ఆమె 13.5 కిలోమీటర్లు మేర నడిచారు. దీంతో మొత్తం 1,586.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. కాగా పాదయాత్రలో ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, వైయస్ఆర్ సీపీ నాయకులు నాయకులు సామినేని ఉదయభాను, మేకా ప్రతాప అప్పారావు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, దుట్టా రామచంద్రరావు, గోసుల శివభరత్‌రెడ్డి, ముసునూరి రత్నబోస్, ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.Back to Top