జేబులు నింపుకునేందుకే కమిటీలు

ప్రతిపక్ష పార్టీలపై కక్షసాధింపు
రుణాలు, రేషన్, పింఛన్ రాకుండా కుట్ర
పేదల పథకాలను టీడీపీ కార్యకర్తలకు ..
దోచిపెడుతున్న చంద్రబాబు

విజయనగరంః
వైఎస్సార్సీపీ సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ప్రభుత్వంపై మండిపడ్డారు.
టీడీపీ జన్మభూమి కమిటీలు జేబులు నింపుకునే కమిటీలుగా మారాయని ఆయన
ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీలపై కక్షగట్టి రేషన్ కార్డులు, రుణాలు,
పింఛన్లు రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీలు
నిజమైన అర్హులకు న్యాయం చేసేవిధంగా ఉండాలి గానీ, అన్యాయం చేసేవిధంగా
కాదన్నారు. చంద్రబాబు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయకుండా టీడీపీ
కార్యకర్తలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి
పనులు పేద ప్రజలకు అందేవిధంగా ఉండాలి కానీ, టీడీపీ నాయకులకు, కొంతమంది
అధికారులకు ఉపయోగపడేలా కాదని హితవు పలికారు. 

గతంలో
జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చిన దరఖాస్తులకు ఇంతవరకు
దిక్కుమొక్కులేకుండా పోయిందన్నారు. ఇంతవరకు  అధికారులు ఆన్ లైన్ చేయలేదని,
వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
జన్మభూమి కార్యక్రమం, కమిటీల వల్ల ఒరిగేది ఏమిటని ప్రశ్నించారు. ఇళ్ల
మంజూరు పేరుతో జన్మభూమి కమిటీ సభ్యులుగా ఉన్న టీడీపీ నేతలు  భారీగా
అక్రమాలకు పాల్పడుతున్నారని రాజన్నదొర విరుచుకుపడ్డారు. అక్రమార్కులపై
కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. 

ప్రభుత్వం
నియోజకవర్గానికి 500 ఇళ్లు మంజూరు చేసి, వాటిని అమ్ముకోవడం
దుర్మార్గమన్నారు. గతంలోని ఇళ్లకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని, ఇక
కొత్తగా ఇళ్లు మంజూరు అవుతాయో లేదోనని స్థానికులు ఆందోళన
చెందుతున్నారన్నారు. గతంలో అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్న వారిని ప్రభుత్వం
పట్టించుకోవడమే మానేసిందని దుయ్యబట్టారు. పింఛన్ రాలేదన్న బెంగతో
 ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని
మండిపడ్డారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు కళ్లు తెరిచి పేదలను
ఆదుకోవాలని, ఇలాంటి సంఘనటలు పునరావృత్తం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని
హెచ్చరించారు.
Back to Top