ప్రతి ఒక్కరు ఓ ''సీతారామరాజు'' కావాలి

గిరిజనుల హక్కులు కాలరాస్తున్న చంద్రబాబు
అన్యాయాన్ని నిలదీస్తే కేసులు పెడతారా..?
బాక్సైట్ దోపిడీదారులను తరిమికొట్టండి

విశాఖపట్నంః  బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ప్రతి ఒక్కరు ఓ అల్లూరి సీతారామరాజు కావాలని వైఎస్సార్సీపీ సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర గిరిజనులకు పిలుపునిచ్చారు. గిరిజనుల చట్టాలను కాలరాస్తున్న టీడీపీ ప్రభుత్వంపై రాజన్నదొర నిప్పులు చెరిగారు.  మన్యం  సంపదను దోచుకునే అధికారం చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. గ్రామసభలు, గిరిజన సలహా మండలి తీర్మానం లేకుండా చంద్రబాబు ఆదివాసీల సంపదపై కన్నేయడం పట్ల భగ్గుమన్నారు.  బాక్సైట్ ను దోచుకునేందుకు వస్తున్న ముఖ్యమంత్రి, ఆయన మద్దతుదారులను తరిమికొట్టాలని రాజన్న దొర ఆదివాసీలకు సూచించారు. 

మన్యంలో మరో విప్లవ శంఖం పూరించేందుకు గిరిజనుల పక్షాన పోరాటానికి  ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి మన్యం ప్రజల కోసం ఏది కావాలంటే అది ఇచ్చారని రాజన్నదొర చెప్పారు.  పెన్షన్ , రేషన్, ఇళ్లు ఇలా ఎన్నో పథకాలతో ఆదుకున్నారన్నారు. గిరిజనుల కోసం పథకాలు పెట్టామని చెబుతున్న చంద్రబాబు ఒక్కటైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికీ 2 ఎకరాలు ఇస్తామన్నారు. ఒక్క ఎకరమైనా ఇచ్చారా అని నిలదీశారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి గిరిజన సలహా మండలి తీర్మానం చేశారంటూ ముఖ్యమంత్రి, మంత్రులు మహానేత మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజన ఎమ్మెల్యేలను భయపెట్టి మోసగించి తీర్మానం చేసింది చంద్రబాబేనన్నారు. చంద్రబాబు మాయమాటలు, మోసాలను ప్రజలు నమ్మవద్దన్నారు.  నేనున్నాను భయపడకండి అని చెప్పేందుకే  వైఎస్ జగన్ మీ ముందుకు వచ్చారని గిరిపుత్రులనుద్దేశించి రాజన్నదొర వ్యాఖ్యానించారు. 

రాజ్యాంగపరంగా గిరిజనుల కోసం చేసిన చట్టాలను ఉల్లంఘిస్తే చంద్రబాబుకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అన్యాయాన్ని నిలదీస్తే నక్సలైట్లు అంటూ ముద్ర వేసి కేసులు పెడుతున్నారని,  ఇదెక్కడి న్యాయమని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రజాభిప్రాయ సేకరణ కాదని, గిరిజనుల అభిప్రాయం సేకరించాలన్నారు. ఆదివాసీల గూడాల్లోని ప్రతి గుడిసెకెళ్లి అభిప్రాయం తీసుకోవాలన్నారు.  5వ షెడ్యూల్ ను పూర్తిగా తీసేసి మన్యాన్ని ఆక్రమించాలని చంద్రబాబు చూస్తున్నారని రాజన్నదొర విరుచుకుపడ్డారు.  ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఎవరొచ్చినా వారిపై తిరుగుబాట చేయాలన్నారు. గిరిజనులంతా కలిసికట్టుగా ఒకే మాటపై ఉండి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడాలన్నారు. 
Back to Top