రైతు లేనిదే రాజ్యం లేదని గుర్తించిన రాజన్న

చిత్తూరు :

రైతన్న లేనిదే రాజ్యం లేదని గుర్తించింది మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు ఆర్.కె. రోజా సెల్వమణి పేర్కొన్నారు. అన్నదాతల కష్టాలను గుర్తించి వారిని ఆదుకున్నది వైయస్ ఒక్క‌రే అని రోజా గుర్తు చేశారు. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలంలోని లక్ష్మమ్మకండ్రిగలో ఆమె శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, రైతుల అభ్యున్నతి కోసం మహానేత వైయస్‌ ఎంతగానో కృషి చేశారన్నారు. రైతుల రుణాలను మాఫీ చేసి, ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం విద్యు‌త్‌ చార్జీలు పెంచలేదని, ప్రజలపై ఎలాంటి ఆర్థిక భారాలూ మోపలేదని చెప్పారు.

అయితే, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయని, కరెంటు బిల్లు చూస్తేనే షాక్ తగిలేలా ఉంద‌ని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదిలో ఐదుసార్లు డీజిల్‌, పెట్రోలు ధరలను పెంచిన ఘనతను యుపిఎ ప్రభుత్వం మూటకట్టుకుందని రోజా విమర్శించారు. అధికార పార్టీ ప్రజలలోకి వెళ్లే ధైర్యం లేకే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నదని ఎద్దేవా చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలాగైనా గెలవాలనే నీచ రాజకీయాలు చేస్తున్నదన్నారు. ఉన్న ఓట్లను తొలిగించడం, కొత్తవారిని చేర్చుకోకపోవడం చూస్తుంటే అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని అర్థమవుతోందన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజాబలం ఉన్న వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తిరుగులేని మెజారిటీతో విజయం సాధిస్తుందని రోజా ధీమా వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top