అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలి: వాసిరెడ్డి

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైతుల పాలిట పిడుగుపాటులా మారిన అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చిత్తశుద్ధితో ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వర్షాలతో నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన సాయం చేయాలని పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం స్థానిక పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆపార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు.
 
అకాల వర్షాలతో ఏపీలోని 13 జిల్లాల్లోనూ భారీ పంట నష్టం జరిగిందని వాసిరెడ్డి పద్మ అన్నారు. రాయలసీమలో వరి, మామిడి, సపోటా, తమలపాకు, పత్తి పంటలు ధ్వంసమయ్యాయన్నారు. రుణమాఫీ అమలుకాక ఇప్పటికే లబోదిబోమంటున్న రైతులకు ఈ వర్షాలు అశనిపాతంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క కర్నూలులోనే వెయ్యి ఎకరాల్లో వరి పంట నష్టం జరిగిందన్నారు. వాస్తవానికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను మినహాయిస్తే ఏపీ అంతటా గత ఖరీఫ్‌లో 36 శాతం లోటు వర్షపాతం నమోదైందని, ఫలితంగా 50 శాతం పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. పంటలు పోయి ఆర్థికంగా చితికి పోయిన రైతులకు చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలబడాలని వాసిరెడ్డి డిమాండ్ చేశారు.
Back to Top