వైయ‌స్‌ జగన్‌ ఛాంబర్‌లో మళ్లీ వర్షపు నీరు

 
 

 అమరావతి : కోట్లు ఖర్చుపెట్టి వెలగపూడిలో నిర్మించిన ఏపీ సచివాలయ డొల్లతనం మరోసారి బయటపడింది. మంగళవారం సచివాలయం పరిసరాల్లో కురిసిన భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో సచివాలయం చెరువును తలపిస్తోంది. అంతే కాకుండా సచివాలయం గేట్‌-2 వెయిటింగ్‌ హాల్‌ సైతం వర్షపు నీరు లీకేజీ అవుతోంది. దీనితో పాటు అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో మరోసారి వర్షపు నీరు లీకేజీ అవుతోంది. సీలింగ్‌ నుంచి నీరు కారుతోంది. గత ఏడాది జూన్‌ నెలలో కురిసిన భారీ వర్షానికి ఇదే తీరుగా ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో నీరు చేరింది. దీంతో వర్షం నీటిని బయటకు పంపించడానికి సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. అయితే దీనిపై వైయ‌స్ఆర్‌సీపీ తీవ్ర నిరసనలు చేపట్టడంతో స్పీకర్‌ విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన కమిటీ పైపులను కోసేశారంటూ నివేదిక ఇచ్చి చేతులు దులుపుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కురిసిన వర్షం కారణంగా మళ్లీ లీకేజీలు బయటపడ్డాయి. సచివాలయంలోని ప్రతిపక్షనేత ఛాంబర్‌తో పాటు పలు వెయిటింగ్‌ హల్లో నీరు చేరడంతో సచివాలయ నాణ్యతపై పలు సందేహాలు వెలువడుతున్నాయి.

 
Back to Top