మహానేత తనయకూ వరుణుడి ఆశీస్సులు

శ్రీమతి షర్మిల చేపట్టిన పాదయాత్రలో అక్కడక్కడా వరుణ దేవుడు తన దీవెనలను అందించాడు. ఉభయ గోదావరి జిల్లాల్లో కురిసిన వర్షపు జల్లులే దీనికి ఉదాహరణ..
పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి.. ఏడేళ్ళు దాటి ఒక్క రోజు... మండే ఎండనుంచి ఉపశమనంగానా అన్నట్లు దట్టమైన మబ్బులు కమ్మి వర్షం కురిసింది. వర్షం కురవడం సహజమే కానీ ఇందులో ఓ కొత్తదనం ఉంది. ఏడేళ్ళు వెనక్కి వెడితే... 2006 మే 31న మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ ముఖ్యమంత్రి హోదాలో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా పెరవ లి పరిసర గ్రామాలలో పర్యటించారు. అప్పటిదాకా నిప్పుల కొలిమిని తలపించిన ఆ ప్రాంతం ఒక్కసారిగా చల్లబడింది. చిరు జల్లులు కలిశాయి. ఏడేళ్ళ తర్వాత ఒక్కరోజు అంటే 2013 జూన్ 1వ తేదీన శ్రీమతి షర్మిల ఆ ప్రాంతంలో అడుగుపెట్టారు. అప్పుడూ భగభగమండే భానుడు ఉన్నట్టుండి కరుణించాడు. జలజలా వర్షం కురిసి వాతావరణం చల్లబడింది. ఆ ప్రాంతీయులు ఈ రెండు ఘటనలను బే రీజు వేసుకుని ‘వరుణ దేవుడు తమ పార్టీ సభ్యత్వం తీసుకున్నాడ’ని అప్పట్లో మహానేత చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు.
 
తూర్పు గోదావరి ముంగిట..
తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించడానికి ఉద్యుక్తులవుతున్న శ్రీమతి షర్మిల వెంట నడుస్తున్న అభిమాన సందోహం చేస్తున్న జయ జగన్నినాదాలకు ఆకాశం చిల్లు పడింది. భోరున వర్షం ప్రారంభమైంది. ఆ జడివానలోనే తడుస్తూ ఆమె రోడ్డు, రైలు వంతెనను దాటారు. గోదావరి పరవళ్ళను చూస్తూ 2003లో తండ్రి డాక్టర్ వైయస్‌ఆర్, 2011లో అన్న జగన్మోహన్ రెడ్డి ఇదే వంతెన మీదుగా తూ.గో జిల్లాలోకి ప్రవేశించిన అంశం గుర్తుకొచ్చి ఆమె అడుగులు భారమయ్యాయి. పశ్చిమ గోదావరి నేతలు వీడ్కోలు పలుకగా తూగో నేతల స్వాగతాన్ని అందుకుంటూ ఆమె అడుగులు ముందుకేశారు.
 
 తొలుత ఆమె కొవ్వూరు రేవులో పసుపు, కుంకుమ విడిచిపెట్టారు. అంతలోనే ఎవరో పిలిచినట్లు మబ్బులు కమ్ముకొచ్చాయి. జడివాన మొదలైంది. ఆ సన్నివేశంలో ఆమె ఉబికి వస్తున్న ఉద్వేగాన్ని బయటపడనీకుండా అభిమాన సంద్రానికి అభివాదం చేసుకుంటూ ముందుకు నడిచారు. ‘నాన్నగారు నడిచిన రోజున 50డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఈరోజున మేం అడుగుపెట్టగానే వర్షం కురిసింది. స్వయంగా నాన్నే నన్ను ఆశీర్వదించినట్లనిపించింది’ అంటూ శ్రీమతి షర్మిల అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఉద్వేగభరితంగా చెప్పారు.
 మహానేతను చూసినట్లే ఉంది..

 అమ్మా! నువ్వు నడుస్తూ చేయి ఊపుతుంటే మీ నాన్నను చూస్తున్నట్లే ఉంది బిడ్డా. .. మీ నాన్న ఉన్నన్ని రోజులూ పిలిస్తే వర్షం పలికేది. ఆయనతోనే అది వెళ్ళిపోయింది. నువ్వు పాదం పెట్టావు.. వర్షం మొదలైంది.. తొలకరి మొదలైనట్లే... రాజానగరం మండలం తోకాడ గ్రామంలో 172వ రోజున సభలో శ్రీమతి షర్మిలతో 75ఏళ్ళ వనజాక్షమ్మ అన్న మాటలివి.

తాజా ఫోటోలు

Back to Top