భావిత‌రాల భ‌విష్య‌త్ కోస‌మే: గుడివాడ అమ‌ర్‌నాథ్‌

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం భావిత‌రాల భ‌విష్య‌త్ కోసం రైల్వేజోన్ సాధ‌నే ల‌క్ష్యంగా
అమ‌ర‌ణ నిరాహార‌దీక్ష‌కు పూనుకున్న‌ట్లు వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్య‌క్షుడు
గుడివాడ అమ‌ర్‌నాథ్ స్ప‌ష్టం చేశారు. కేంద్రం నుంచి జోన్‌పై సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో
ముందుగా ప్ర‌క‌టించిన‌ట్లుగా వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్‌నాథ్
గురువారం నిర‌వ‌ధిక నిరాహార దీక్ష చేప‌ట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్
అంబేద్క‌ర్ 125వ జ‌యంతి సంద‌ర్భంగా చేప‌ట్టిన ఈ దీక్ష‌ను
పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ, అంబ‌టి రాంబాబు సమక్షంలో అమర్ నాథ్ దీక్షను ప్రారంభించారు.రైల్వేజోన్
అంశం ఐదు ద‌శాబ్దాల క‌ల అన్నారు. అంత‌ర్జాతీయంగా విశాఖ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న
త‌రుణంలో ప్ర‌త్యేక రైల్వేజోన్ ద‌క్క‌క‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు. రైల్వే జోన్ వ‌స్తే
14 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు వ‌స్తాయ‌ని
ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ ప్రాంతంలో ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులు అధికంగా వ‌స్తాయ‌న్నారు.
ముంబాయి త‌ర‌హాలో విశాఖ అభివృద్ధి చెందుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. రైల్వే జోన్
సాధిస్తామ‌నే న‌మ్మ‌కంతోనే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్క‌ర్ 125వ జ‌యంతి సంద‌ర్భంగా దీక్ష చేప‌డుతున్న‌ట్లు
తెలిపారు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు తెన్నేటి విశ్వ‌నాథం స్ఫూర్తితో దీక్ష చేప‌డుతున్న‌ట్లు
అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని అమ‌ర్‌నాథ్ కోరారు. దీక్ష‌కు వామ‌ప‌క్ష
పార్టీల నేత‌లు,
వివిధ వ‌ర్గాల
ప్ర‌జ‌లు,
ప్ర‌జా, విద్యార్థి, జ‌ర్న‌లిస్టు, కార్మిక సంఘాల నాయ‌కులు సంఘీభావం తెలిపారు. 

Back to Top