ఒక్క అబద్ధం చెప్పి ఉంటే వైయస్‌ జగనే సీఎం–ఏ పార్టీకైనా సహకరిస్తామనడం తప్పా?
– ఏపీకి ప్రత్యేక హోదానే సంజీవని
– ప్రత్యేక హోదాకు టీడీపీ అనుకూలమా? వ్యతిరేకమా?
 – విలువలు, విశ్వసనీయతే మా నాయకుడి ఆయుధం

హైదరాబాద్‌: 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ఒక్క అబద్ధం చెప్పి ఉంటే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారని వైయస్‌ఆర్‌సీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. అలా అబద్ధాలు చెప్పే గుణం మా నాయకుడికి లేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగు దేశం పార్టీ ప్రత్యేక హోదాకు అనుకూలమా? వ్యతిరేకమా స్పష్టం చేయాలని ఆయన ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ హీజ్‌ నాట్‌ ఏ క్రిస్టియానిటి, ఈ హిజ్‌ కస్టోరియన్‌ అని మంత్రి ఆది పేర్కొన్నారని, అసలు ఈ భాష ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదని, ఏ డిక్షరీలో ఆ పదం లేదన్నారు. ఈ వ్యాఖ్యలకు ఆదినారాయణరెడ్డే సమాధానం చెప్పాలన్నారు. వైయస్‌ జగన్‌ ఓ కలుపు మొక్క అని, జైలు వెళ్తారనే భయంతోనే బీజేపీకి సహకరిస్తామని ఆరోపించడం ఆయన అవివేకమన్నారు. తాను సీనియర్‌ నాయకుడిని, ఓ ఫ్యాక్షనిస్టును అని ఆది పేర్కొన్నారని తెలిపారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి 2004, 2009లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారని, అయితే 30 సీట్లు తగ్గిపోవడానికి మహానేత కారణం అని ప్రాస కోసం ఇలాంటి మాట్లాడారని రాచమల్లు విమర్శించారు. తాను అనైతిక చర్యలకు పాల్పడినట్లు చివరిగా ఆదినారాయణరెడ్డి తన తప్పిదాన్ని ఒప్పుకున్నారని చెప్పారు. ఆదినారాయణరెడ్డి స్థాయికి మించి మాట్లాడుతున్నారని రాచమల్లు హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..2014లో ఎన్నికలు అయిపోగానే, కేంద్రంలో ప్రధాని బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోడీని తమ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ కలిసి రాష్ట్ర ప్రయోజనాల రీత్యా అంశాల వారిగా బీజేపీకి మద్దతిస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. ఈ రోజు కూడా అదే అంశాన్ని చెబుతున్నామని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం అంతా కూడా ప్రత్యేక హోదాపైనే ఆధారపడ్డాయని, హోదా ఎవరిస్తే వారికే మేం సహకరిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు గతంలో కేసీఆర్‌ ఇదే చెప్పారని గుర్తు చేశారు. కుష్టిరోగి అయినా, గొంగలి పురుగు అయినా కౌగిలించుకుంటామని నాడు కేసీఆర్‌ అన్నారని తెలిపారు. ఇది ఉద్యమ కారుడి లక్షణమని చెప్పారు. వైయస్‌ జగన్‌ చెప్పిన మాట కూడా అదే అని..అదే మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగులు, వ్యవసాయ దారులు అందరూ బాగుపడుతారన్నారు. గతంలో ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబితే, పదేళ్లు కావాలని బీజేపీ అన్నారు. కాదు..కాదు పదిహేను సంవత్సరాలు కావాలని చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పి..ఇప్పుడు ఆ హోదానే గాలికి వదిలి ప్యాకేజీ ముద్దు అనడం సమంజసమా?అన్నారు. ప్రతిపక్షపార్టీ అయిన వైయస్‌ఆర్‌సీపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నామని, హోదా ఇచ్చే పార్టీకి సహకరిస్తామని చెప్పడం తప్పా అని నిలదీశారు. దీన్ని చిలువలు, పలువలు చేసి తప్పు చేసినట్లు ఆరోపణలు చేయడం ఎంత వరకు న్యాయమన్నారు. వైయస్‌ జగన్‌ లక్ష అబద్ధాలు చెప్పారని ఆదినారాయణరెడ్డి చెప్పినదాంట్లో వాస్తవం ఉందా అన్నారు. ఒక్క అబద్ధం అడి ఉంటే వైయస్‌ జగన్‌ముఖ్యమంత్రి సీట్లో ఉండేవారన్నారు. ఇదే ఆదినారాయణరెడ్డి వైయస్‌ జగన్‌పై రుణమాఫీపై ఒక్క అబద్ధం చెప్పమని ఒత్తిడి చేస్తే ఆయన అబద్ధం ఆడలేదని గుర్తు చేశారు. విశ్వసనీయత, విలువల మీద రాజకీయాలు చేద్దామని ఆ నాడు వైయస్‌ జగన్‌ ఆదినారాయణరెడ్డికే చెప్పారన్నారు. 600 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చింది చంద్రబాబే అన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓడిపోతామని భయపడి రూ.200 కోట్లు ఖర్చు చేస్తే కూడా వైయస్‌ఆర్‌సీపీకి 70 వేల మంది నంద్యాల ఎన్నికల్లో ఓటు వేసి ధర్మం వైపు నిలబడ్డారన్నారు. వైయస్‌ జగన్‌ను ప్రజలు విశ్వసిస్తున్నారని, టీడీపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు.
 
Back to Top