భూమా కుటుంబానికి ఎందుకు ఓటు వేయాలి

– నంద్యాల ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని భూమా నాగిరెడ్డి వంచించారు
– టీడీపీకి ఓటేయ్యడానికి ఒక్క కారణం టీడీపీ నేతలు చూపించగలరా?
– ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

నంద్యాల: ఉప ఎన్నికలో నంద్యాల ప్రజలు భూమా కుటుంబానికి ఎందుకు ఓటు వేయాలని పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు. మూడేళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశారని ఓటు వేయాలని నిలదీశారు. నంద్యాల ప్రజల మానసిక స్థితి తనకు తెలుసు అని, ధర్మానికి, న్యాయానికి ఓటు వేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు.  నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకి ఓటు వేయడానికి ఒక్క కారణమైనా చూపించగలరా అని అధికార పార్టీకి సవాల్‌ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చామని, మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పే దమ్మూ, ధైర్యం ఉందా అని నిలదీశారు. 2014 ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై గెలిచిన భూమా నాగిరెడ్డి నంద్యాల నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి, తక్కెట్లో తూకం వేసి అమ్ముకున్నందుకా?, మీ నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి బిడ్డకు మంత్రి పదవి  ఇప్పించుకున్నందుకు టీడీపీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. విశ్వాసాన్ని వంచించినందుకు ఓటు వేయాలా అని నిలదీశారు. నంద్యాల ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు పాదల వద్ద పెట్టి మంత్రి పదవి తెచ్చుకున్నందుకు భూమా కుటుంబానికి ఓటు వేయాలా అన్నారు. నంద్యాల నియోజకవర్గంలో ఒక్క ఇల్లు నిర్మించిన దాఖలాలు లేవన్నారు. రోడ్లు వెడల్పు చేయలేదని, తాగునీరు సరఫరా చేయలేదని విమర్శించారు. దోమలు నివారించలేదని, కేసీ కెనాల్‌కు నీళ్లు ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. ఆడబిడ్డల రుణాలు మాఫీ చేస్తానన్నావు, పెళ్లిలకు రూ.50 వేలు ఇస్తామన్నారు. బాలికలకు సైకిల్స్‌ ఇస్తామని ఇలా తప్పుడు వాగ్ధానాలతో ఓట్లు వేయించుకొని చంద్రబాబు గొంతు కోశారని మండిపడ్డారు. ఇన్ని హామీలు విస్మరించినందుకు, మోసం చేసినందుకు, వంచన చేసిన ఈ టీడీపీకి ఓటు వేయాల్సిన అవసరం ఉందా అని నంద్యాల ప్రజలు ఆలోచించాలన్నారు. రూ.30 కోట్లకు నంద్యాల ప్రజల నమ్మకాన్ని చంద్రబాబుకు అమ్ముకున్న భూమానాగిరెడ్డి వారసుడి అభ్యర్థిత్వాన్ని మీరు అంగీకరించి గెలిపించినట్లు అయితే..నన్ను కూడా పార్టీ మారమని సలహా ఇచ్చినట్లే కదా అని ప్రశ్నించారు. నీతిగా, నిజాయితీగా వైయస్‌ జగన్‌ వెంట ఉండి, మాఆస్తులు పోగొట్టుకొని అప్పుల పాలు అయినా కూడా ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని వంచించకూడదని, ఏ పార్టీ గుర్తుతో గెలిచామో ఆ పార్టీలో ఉన్నామన్నారు. బతికి ఉన్నంత కాలం, శ్వాస పీల్చినంతకాలం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రయాణం చేయాలని అనుకునే నాలాంటి యువ నాయకులను మీరు పార్టీ మారమని ప్రోత్సహిస్తారా?, లేక భూమా నాగిరెడ్డి కుటుంబాన్ని ఓడించి తస్మత్‌ జాగ్రత్త..ఇలాంటి నాయకులకు బుద్ధి చెబుతామని హెచ్చరిస్తారా అని నంద్యాల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మీరు హెచ్చరిస్తారో, ప్రోత్సహిస్తారో నంద్యాల నియోజకవర్గ ప్రజలపైనే ఆ బాధ్యత ఉందని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సూచించారు. ఈ ఎన్నిక గెలుపు ఓటములకు వైయస్‌ జగన్, చంద్రబాబు బాధ్యులు కారని, గెలుపు, ఓటములకు నంద్యాల ప్రజలే బాధ్యులన్నారు. నంద్యాల ప్రజలు ధర్మం వైపు, న్యాయం వైపు ఉంటారని నిరూపించుకోండని రాచమల్లు పిలుపునిచ్చారు. నూట ఒక్క శాతం అనైతిక వ్యవహారాలకు పాల్పడిన టీడీపీ నేతలను ఓడిస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Back to Top