రావూరి భరద్వాజకు విజయమ్మ అభినందన

హైదరాబాద్, 17 ఏప్రిల్ 2013:

సుప్రసిద్ధ రచయిత రావూరి భరద్వాజకు దేశ అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ్ ప్రకటించడం పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ హర్షం వ్యక్తంచేశారు. తెలుగు సారస్వతాన్ని సుసంపన్నం చేసిన రావూరి సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి ఎదిగిన సాహితీమూర్తని కొనియాడారు. ఆయన ఆకాశవాణిలో చేసిన ప్రసంగాలు సామాజిక స్పృహతో నిండి ఒక ఒరవడిని సృష్టించాయని ఆమె వ్యాఖ్యానించారు.

పాకుడు రాళ్ళు నవలతో సినీ పరిశ్రమ వెలుగుల వెనుక చీకటి కోణాలను చూపడం, జీవన సమరం వ్యాస పరంపరతో సామాన్యుడి కష్టాలు, కన్నీళ్లను కళ్ళకు కట్టినట్లు చిత్రించడం భరద్వాజకే సాధ్యమని శ్రీమతి విజయమ్మ ప్రశంసించారు. వస్తు వైవిధ్యం, అభ్యుదయ ధోరణి, పీడిత జన పక్షపాతం ఆయన రచనలలో ప్రత్యేకతని పేర్కొన్నారు. పాత్రికేయునిగానూ, రేడియో ప్రయోక్తగానూ, అన్నింటికి మించి ఒక మహోన్నతమైన మనిషిగా రావూరిని ఆమె అభివర్ణించారు. ఆయనకు జ్ఞానపీఠ్ అవార్డు రావడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని చెబుతూ రావూరి ఆమె అభినందనలు తెలిపారు.

Back to Top