'రాష్ట్ర రైతులపై కక్షకట్టిన కిరణ్‌ ప్రభుత్వం‌'

నిర్మల్ : రైతులపై ‌రాష్ట్ర ప్రభుత్వం కక్షకట్టిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎం.పి. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని కిరణ్‌ కుమార్‌రెడ్డి అస్సలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. విద్యుత్ కోతలు, చార్జీల పెంపు‌నకు నిరసనగా, రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబా‌ద్ జిల్లా నిర్మ‌ల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట‌ శుక్రవారం ఆయన 48 గంటల దీక్ష ప్రారంభించారు. అంతకు ముందు ఆయన తన నివాసం నుంచి పట్టణంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మహానేత డాక్టర్‌ వైయస్ చిత్రపటానికి పూలమాల వేసి‌, నివాళులు అర్పించి అల్లోల తన దీక్ష ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ, విద్యుత్ చార్జీలు పెంచి ప్రభుత్వం పేదల నడ్డి విరించిందని, ‌కరెంటు కోతలతో రాష్ర్టం అంధకారంగా మారిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్ ఇవ్వాలని‌ ఇంద్రకరణ్‌రెడ్డి డిమాండ్ చేశారు.

‌ఇంద్రకరణ్‌రెడ్డి దీక్షకు మద్దతు తెలిపిన పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బి. జనక్‌ప్రసాద్ మాట్లాడుతూ‌.. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష ‌టిడిపి కుమ్మక్కై ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శిం చారు. శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు సుపరిపాలన అందుతుందని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు సోయం బాపూరావు, కోనేరు కోనప్ప తదితరులు అల్లోల దీక్షకు మద్దతు తెలిపారు.
Back to Top