'రాష్ట్ర రాజకీయాల్లో జగన్‌దే కీలకపాత్ర'

హైదరాబాద్, 14 ఫిబ్రవరి 2013: రాష్ట్ర రాజకీయాల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక పాత్ర పోషిస్తారని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు అన్నారు. కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై మహానేత డాక్టర్‌ వైయస్‌ కుటుంబాన్ని వేధిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో శ్రీ జగన్‌కు తాను అండగా ఉండాలని నిర్ణయించుకున్నానన్నారు. శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డితో తన భావాలను మనసు విప్పి పంచుకున్నట్లు భాస్కరరామారావు తెలిపారు. గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆయన చంచల్‌గూడ జైలుకు వెళ్ళి శ్రీ జగన్‌ను కలుసుకున్నారు. అనంతరం ఆయన జైలు వెలుపల కాసేపు మీడియాతో మాట్లాడారు.

తెలుగుదేశం పార్టీలో తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు స్వేచ్ఛ లేదని భాస్కరరామారావు విమర్శించారు. సమైక్యాంధ్ర విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వైఖరి తనకు నచ్చలేదని స్పష్టం చేశారు. అందుకే తాను ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేసినట్లు పేర్కొన్నారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగించడం శ్రీ జగన్‌కే సాధ్యం అని భాస్కరరామారావు చెప్పారు. మహానేత ప్రారంభించిన పథకాలు రాష్ట్రంలోని ప్రతి పేదవాని ఇంటికీ చేరాయని ఆయన అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పుడు చేరేదీ త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. భాస్కర రామారావు వెంట కాకినాడ అర్బన్ ‌ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కూడా ఉన్నారు.
Back to Top