రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పోయింది: గడికోట

కడప, 20 ఫిబ్రవరి 2013: డిసిసిబి ఎన్నికల్లో గెలవలేక కాంగ్రెస్‌ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని రాయచోటి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.‌ ఎన్నికలు రద్దుచేసి న్యాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా జరిగి‌తే కాంగ్రె‌స్ గెలిచిన‌ 18 జిల్లాల్లోనూ వైయస్‌ఆర్‌సిపిమే గెలుస్తుందన్నారు.

రాష్ట్రంలో అత్యధిక సహకార సంఘాల ఎన్నికల్లో గెలిచామని, ప్రజలు తమ పక్షాన ఉన్నారని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు కడప సంఘటనతో సిగ్గుతో తలవంచుకోవాలని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ వారు ఎంత అప్రజాస్వామిక విధానాలు అవలంబించి సహకార సంఘాల ఎన్నికల్లో గెలిచారన్నది స్పష్టంగా వెల్లడయిందన్నారు. కడప డిసిసిబి సభ్యుల్లో మెజారిటీ వైయస్‌ఆర్‌సిపికి ఉన్నప్పటికీ ఎన్నిక నిర్వహించాల్సిన అధికారిని కిడ్నాప్‌ చేయించడం అంటే సిగ్గులేని చర్యలే అని ఆరోపించారు. మెజారిటీ లేనప్పుడు కాంగ్రెస్‌ వారు ఎందుకు వచ్చారో, బలప్రదర్శన చేయడం ఎందుకో, అధికారిని ఎందుకు కిడ్నాప్‌ చేశారో, ఇన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నప్పుడు వారిపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందని నిలదీశారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దౌర్జన్యాలకు పరాకాష్ట అని శ్రీకాంత్‌రెడ్డి అభివర్ణించారు. కాంగ్రెస్‌ దౌర్జన్యాలను తాము అడ్డుకోగలిగాం కాబట్టే తమ పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కాయన్నారు.
Back to Top