రాష్ట్రపతితో చంద్రబాబు భేటీ గేమ్ ప్లాన్

గుంటూరు, 20 మే 2013:

పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీల కుమ్మక్కుకు తాజా ఉదాహరణే మంత్రుల రాజీనామాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరులో సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిని మరింత కాలం జైల్లో ఉంచేందుకే ఆ రెండు పార్టీలు పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిగారి మీద ఉన్నటువంటి  ఆరోపణలనే ఎదుర్కొంటున్న మంత్రులమీద చర్యలు చేపట్టాలని ఏడాది నుంచి డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. వారి రాజీనామాలు స్వీకరించి తొలగించాలని కోరుతున్నామన్నారు. ముఖ్యంగా ధర్మాన ప్రసాదరావుగారు కిందటేడాదే ముఖ్యమంత్రిగారికి రాజీనామా సమర్పించారన్నారు. నెలరోజుల క్రితం సబితా ఇంద్రారెడ్డి గారిమీద చార్జి షీటు వేశారన్నారు. ఏడాది క్రితం నుంచి ధర్మానను తొలగించకపోగా.. కొనసాగాల్సిందిగా బుజ్జగిస్తూ వచ్చారన్నారు. ఆయనేం తప్పు చేయలేదని స్పష్టంచేశారన్నారు.  
ఏడాదిగా మంత్రులను తొలగించాలని డిమాండ్ చేయని చంద్రబాబు ఈరోజు రాష్ట్రపతిని కలిసి కళంకిత మంత్రులను తొలగించాల్సిందిగా కోరారన్నారు. మంత్రులను తొలగించబోతున్నారు కాబట్టి తాను ప్రతిపక్షనేతగా వ్యవహరించానని ఆయన అనుకుంటున్నారన్నారు. ఇద్దరు మంత్రుల రాజీనామాలను ఆమోదిస్తూ హైకమాండ్ డ్రామా ఆడిందన్నారు. వారు ఆరోపణ ఎదుర్కొంటున్న వారే కానీ దోషులు కారనే విషయాన్ని గమనించాలన్నారు.  శ్రీ జగన్మోహన్ రెడ్డిని కూడా ఏ కోర్టు దోషి అనలేదని అంబటి పేర్కొన్నారు.  చంద్రబాబు అన్నాహజారే మాదిరిగా అవినీతి రహిత సమాజాన్ని చూడాలని తపించిపోతున్నట్లుగా మంత్రులను తొలగించాలని డిమాండ్ చేశారని చెప్పారు. ఈ డిమాండ్‌ను గౌరవించినట్లుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందన్నారు. ఏడాది పాటు వారిని ఎందుకు తొలగించలేదో తనకు అర్థం కావడం లేదని తెలిపారు.  ఈ క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడికే దక్కాలన్నట్లుగా వ్యవహరించారన్నారు. చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీల మధ్య పెద్ద తేడాలు ఏమీ లేవనడానికి మనం అనేక ఉదంతాలు చూశామని పేర్కొన్నారు.

అవిశ్వాసం తీర్మానం వీగిపోయేలా ఎన్ని ప్రయత్నాలు చేశారో చూశామన్నారు. దానివల్లే ప్రభుత్వం కొనసాగుతోందనే అంశం అందరికీ అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఏవిధంగా కలవబోతున్నాయనే అంశాన్ని గతంలో తాము అనేక సందర్భాలలో చెప్పిన విషయాన్ని అంబటి గుర్తుచేశారు. వీరిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని అజెండాగా పెట్టుకుని ఆయన పలుకుడిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సుధాకర్ అనే న్యాయవాది పిల్ వేసిన తర్వాత మాత్రమే మంత్రులను విచారించే దౌర్భాగ్య స్థితిలో సీబీఐ ఉందన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసుకోవాలనే గేమ్ ప్లాన్ పెట్టుకున్నారని చెప్పారు. ఆ గేమ్ మాత్రం వికటిస్తోందన్నారు. పిల్ పడిన తర్వాత ఆరుగురు మంత్రులను విచారించకపోతే.. జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఏ ఆరోపణ ఉండదు కాబట్టి ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. మోపిదేవి వెంకట రమణను జైల్లో పెడతారు.. ధర్మానను ఏడాదిగా కొనసాగించి తొలగిస్తారని చెప్పారు. తనకందిన సమాచారం మేరకు ధర్మాన, సబితా ఇంద్రారెడ్డిలను ముఖ్యమంత్రి ఆదివారం రాత్రి పిలిపించి అనేక రకాలుగా బెదిరించారని తెలిసిందన్నారు. కాంగ్రెస్ నుంచి బయటికెళ్ళిపోతేనో.. జగన్ మీద జరుగుతున్న కుట్రను వెల్లడిస్తేనో మిమ్మిల్ని జైల్లో పెట్టే పరిస్థితి వస్తుందని హైకమాండ్ మీకు చెప్పమందని చెప్పినట్లు తెలిసిందన్నారు.

 టీడీపీకి చెందిన 74 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సిగ్గు,ఎగ్గు లేకుండా మద్దతిస్తూ మ్యాచ్ ఫిక్సింగుకు పాల్పడుతున్నారని చెప్పారు. అవిశ్వాస తీర్మానం పెట్టినా పడగొట్టకుండా విప్ జారీ చేస్తారన్నారు. గవర్నరును.. రాష్ట్రపతిని కలుస్తూ వీధినాటకాలాడుతున్నారన్నారు.  చంద్రబాబు ఏ విధంగా భూములపై జీవోలు జారీ చేశారో 26 జీవోలు కూడా అదే రీతిలో జారీ అయ్యాయనీ, కానీ చంద్రబాబు సేఫ్‌గా ఉంటారని తెలిపారు. ఎమ్మార్ కు 5335ఎకరాలను 29 లక్షలకు అప్పనంగా ఇచ్చేసి కోటానుకోట్ల రూపాయలు బ్లాక్ మనీ తీసుకున్నప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు కాబట్టి సీబీఐ కన్నేయదని ఎద్దేవా చేశారు. నాలుగు మాసాల తర్వాత సీబీఐ చార్జి షీటు వేసిన తర్వాత మిగిలిన కన్నా లక్ష్మీనారాయణ, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలను నిందితులుగా చూపక తప్పదన్నారు. వారు కూడా ఇదేరకంగా రాజీనామాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే నాటకంలో మేం చెప్పినప్పుడు మాత్రమే మీరు రాజీనామా చేయాలి తప్ప వేరే కాదనే భావన కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

కోర్టులో శిక్ష పడిన మంత్రి పార్థసారథి మంత్రివర్గంలో కొనసాగుతున్నారు కాబట్టి నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అంబటి స్పష్టంచేశారు. జగన్మోహన్ రెడ్డిగారిని మరింత కాలం జైల్లో ఉంచేందుకు, ఆయన ప్రతిష్ఠని మసకబారేలా చేయడానికే ఈరోజు ఇద్దరు మంత్రులను సాగనంపారని వివరించారు. ఈ ఆరుగురు మంత్రులూ కూడా బిజినెస్ రూల్సుకు వ్యతిరేకంగా చేయలేదనీ, చట్టప్రకారం వ్యవహరించారనీ ఆయన పేర్కొన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీల కూటమి పాలన సాగుతోందన్నారు. చంద్రబాబు రాష్ట్రపతిని కలవడం గేమ్ ప్లాన్ లో భాగమని చెప్పారు.

Back to Top