రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు

బాపట్ల (గుంటూరు జిల్లా), 5 మే 2013: మహిళలకు మన రాష్ట్రంలో భద్రతా లేకుండాపోయిదని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా బాపట్లలో వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఆధ్వర్యంలో‌ ఆదివారం జరిగిన 'మహిళా నగారా' రాష్ట్ర స్థాయి మహిళా సదస్సులో ఆమె ప్రసంగించారు. మహిళలపై, వరకట్న, లైంగిక వేధింపులు ఎక్కువైపోయాయని శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తంచేశారు. మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో ఇలాంటి అరాచకాలు కూడా ఎక్కువైపోతున్నాయని ఆమె ఆరోపించారు. మహిళలకు సమాన హక్కులు ఉండాలన్నది బి.ఆర్. అంబేద్కర్‌ ఆశయం అని శ్రీమతి విజయమ్మ ప్రస్తావించారు. చట్ట సభలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ అమలు కావాలని అన్నారు. పురుషుల ఆలోచనలో మార్పు రావాలని ఆమె ఆకాంక్షించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కూడా చాలా అధ్వాన్నంగా మారిపోయిదని శ్రీమతి విజయమ్మ ప్రస్తావించారు. పేదల కడుపు కొడుతున్న మద్యపానాన్ని నియంత్రిస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పార్టీ మొదటి ప్లీనరీలోనే చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మహానేత వారసుడిగా శ్రీ జగన్‌ మహిళలకు న్యాయం చేస్తారని ఆమె హామీ ఇచ్చారు. బెల్టుషాపులను గుర్తించి తొలగించేందుకు, మహిళలకు రక్షణగా ఉండేందుకు మహిళా రక్షకభటులను నియమిస్తామని శ్రీ జగన్ చె‌ప్పారని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. ఆబ్కారీపై ఎంతో డబ్బు వస్తున్నా పేదలకు ఎలాంటి ఉపయోగమూ లేదని ఆమె విచారం వ్యక్తంచేశారు.

మహిళల సంక్షేమం కోసం మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి కేటాయించినన్ని నిధులు మరే ముఖ్యమంత్రీ కేటాయించలేదని శ్రీమతి విజయమ్మ తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన అనేక పథకాలకు రూపకల్పన చేసి అమలు చేశారని పేర్కొన్నారు. మహిళలపై కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉంటున్నాయని అన్నారు.

మహిళలను ఆయన అక్కయ్యా, చెల్లెమ్మా అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేవారని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్సుమెంట్ పథకం ప్రవేశపెట్టడంతో ఆడపిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకున్నారని తెలిపారు. మహానేత రాజశేఖరరెడ్డి తన కేబినెట్‌లోకి ఆరుగురు మహిళలను మంత్రులుగా తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా హొంశాఖ మంత్రిగా ఒక మహిళకే అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. శ్రీ జగన్ అధికారంలోకి వస్తే మహిళలకు అండగా ఉంటారని‌ శ్రీమతి విజయమ్మ హామీ ఇచ్చారు.

మహిళా నగారాకు హాజరైన అక్క చెల్లెళ్ళందరికీ హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నానంటూ శ్రీమతి విజయమ్మ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మహిళలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, సామాజికంగా, ఆర్థికంగా పూర్వకాలం నుంచి పలువురు మహనీయులు పోరాడారని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. మహిళలకు విద్య, ఉపాధి కల్పన కోసం వీరేశలింగం పంతులు కార్యక్రమాలు నిర్వహించారన్నారు. సతీ సహగమన దురాచారంపై రాజా రామమోహన్‌రాయ్ ముందుండి పోరాటం చేసిన వైనాన్ని గుర్తుచేశారు. అయినా ఇప్పటికీ మహిళలు ఎన్నో బాధలు పడుతున్నారని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రతి ఇంటిలోనూ అమ్మ అధికార బిందువుగా, కేంద్ర బిందువుగా ఉంటుందని శ్రీమతి విజయమ్మ అభివర్ణించారు. అలాంటి అమ్మకు, ఆడబిడ్డకు ఇప్పుడు రక్షణ లేకుండాపోయిందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. మహిళల్లో చైతన్యం రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మహిళలకు రక్షణ కల్పించాల్సి బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. అర్ధరాత్రి మహిళలు ఒంటరిగా తిరగ గలిగినప్పుడే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మహాత్మా గాంధీజీ మహిళలనే ప్రాతిపదికగా తీసుకున్నారని గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు అర్ధరాత్రి కాదుగదా పట్టపగలే అందరూ చూస్తుండగానే మహిళలపై అరాచకాలు జరిగిపోతున్నాయని శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తంచేశారు. తెనాలిలో దుర్మార్గుల చేతిలో బలవంతంగా మరణం పొందిన సునీల ఉదంతాన్ని ఆమె గుర్తుచేశారు. మహిళలపై ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నందుకు దేశం, రాష్ట్రం కూడా సిగ్గుపడాలన్నారు.

అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పి మహిళలు అర్ధరాత్రి తిరుగుతారా? అంటూ పిసిసి చీఫ్‌ బొత్స చేసిన వ్యాఖ్యలను శ్రీమతి విజయమ్మ తప్పుపట్టారు. మద్యం ఉత్పత్తి, అమ్మకాలు మరింతగా పెరగాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటనను ఆమె తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఆలోచనలు చేస్తున సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎలాంటి పరిస్థితులకు దారులు వేస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. మహిళలను వేధిస్తే, ఇబ్బంది పెడితే కఠినమైన శిక్షలు విధిస్తామంటూ మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే బలమైన సంకేతాలు పంపించిన వైనాన్ని ఆమె గుర్తుచేశారు.

రాష్ట్రంలోని యువత ఉన్నత విద్య అభ్యసించాలన్న లక్ష్యంతో మహానేత వైయస్‌ బిట్సు పిలానీ, ఐఐటి లాంటి అనేక విద్యా సంస్థలను తీసుకువచ్చారని శ్రీమతి విజయమ్మ ప్రస్తావించారు. ఆడపిల్లలు చదువుకోవాలని ఆయన ముఖ్యంగా ఫీజు రీయింబర్సుమెంట్‌ చేశారని తెలిపారు.

'మహిళకు చదువు, అధికారం, రక్షణ' అనే నినాదంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళుతోందని శ్రీమతి విజయమ్మ అన్నారు. ఇదే జగన్‌బాబు నినాదం కూడా అని తెలిపారు. మహిళలందరూ చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు.  మహిళలు బలహీనులు కాదని శ్రీమతి విజయమ్మ విశ్లేషించారు. రాజన్న రాజ్యంలో అమ్మకు అధికారంతో పాటు లాఠీలు కూడా ఇస్తామని జగన్‌బాబు చెప్పమన్నారని ఆమె తెలిపారు. ఆడబిడ్డలకు భద్రత కల్పిస్తామన్నారన్నారు. బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇస్తామని చెప్పారు. జగన్‌బాబు విజన్‌ కూడా ఇదే అన్నారు. మహిళలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ఏ రంగంలో ఏ విధంగా వెళ్ళాలన్నా అవసరం నేర్పిస్తుందని ఆమె విశ్లేషించారు. మహిళలు తమ హక్కులను పరిరక్షించుకోవడానికి చైతన్యవంతులు కావాలని శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు. జగన్‌బాబు ప్రభుత్వంలో, అధికారంలో మహిళలందరూ సాధికారత సాధించాలని శ్రీమతి విజయమ్మ ఆకాంక్షించారు.
Back to Top