రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది

విజయవాడ, 30 మార్చి 2013:

మహానేత డాక్టర్ వైయస్ఆర్ కంటే ముందు, తర్వాత కూడా చాలామంది  రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా వ్యవహరించారనీ కానీ ఒక్క మహానేత హయాంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుందనడానికి ఆయన పాలనే ఉదాహరణన్నారు. వైయస్ఆర్ పాలనలో పిలిస్తే వర్షాలు పడ్డాయని చెప్పారు. వైయస్ రైతుల పక్షపాతనీ, కన్నతండ్రి స్థానంలో ఉండి రైతు, మహిళ, విద్యార్థులు, మైనార్టీలు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలను అర్థం చేసుకున్నారనీ వివరించారు. ఇప్పటి పాలకులకు రైతు సమస్యలే పట్టవని దుయ్యబట్టారు. జగనన్న తరపున ఒక్క మాట చెప్తున్నా. ఓపిక పట్టండి.. త్వరలోనే జగనన్న బయటికి వచ్చి,  రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చారు. శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం కార్యక్రమంలో ఆమె వివిధ ప్రాంతాలలో మాట్లాడుతూ ఈ అంశాన్ని చెప్పారు. శుక్రవారం నాటి ఆమె పాదయాత్ర.. ప్రజలతో ఆమె సంభాషణ వివరాలు ఇవి...

బాబు హయాంలో తొమ్మిదేళ్లూ కరవే
‘చంద్రబాబు నాయుడు హయాంలో వర్షాల్లేక.. పంటలు పండక తొమ్మిదేళ్ల కరువొచ్చింది. సాయం చేసే చేతులు లేక లక్షలాది మంది ఇళ్లను వదిలి పొట్టకూటి కోసం ఎక్కడెక్కడికో వలసలు పోయారు. కన్న బిడ్డలు ఉపాధి వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు వెళ్లిపోతే.. ఒంట్లో సత్తువ లేక నడిచే ఓపిక లేక ఎంతో మంది వృద్ధులు ఇంటి వద్దే ఉన్నారు. వాళ్లకు కనీసం వృద్ధాప్య పింఛన్ ఇవ్వలేదు. దేశం కాని దేశం పోయి ఎంతోకొంత సంపాదించి తమ ముసలి తల్లికి పంపిన సొమ్ము సకాలంలో అందక ఎంతోమంది వృద్ధులు ఆకలితో చనిపోయారు. అప్పుల బాధలు తట్టుకోలేక వేలాది మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంత భయంకరమైన రోజులవి. అదే పాడు పరిపాలన మళ్లీ వచ్చింది.. చంద్రబాబు పాలనకు కొనసాగింపుగా కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగుతోంద’ని శ్రీమతి  షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కృష్ణా జిల్లా విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల్లో సాగింది. కానూరు గ్రామంలో కొందరు వలస కూలీలు షర్మిలకు ఎదురుపడ్డారు. ‘అమ్మా.. మేం కొందరం విజయనగరం జిల్లా పార్వతీపురం, బొబ్బిలి, ఇంకొందరు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి వచ్చాం. ఊళ్లో పని దొరక్క రెండేళ్ల కిందట.. పిల్లలను ముసలోళ్ల దగ్గరే వదిలేసి విజయవాడకు వలస వచ్చాం. ఇక్కడ రోజుకు రూ.150 దాకా కూలీ పడుతుందమ్మా’ అని గాంధారి రామలీల, చంద్రగిరి భవాని అనే మహిళలు చెప్పారు. ఆమెకు బదులిస్తున్న సందర్భంలో శ్రీమతి షర్మిల పై విధంగా స్పందించారు. అనంతరం పెనమలూరులో మహిళలతో కలిసి రచ్చబండలో కొద్దిసేపు మాట్లాడారు.

పల్లెలను బాబు పీల్చి పిప్పి చేశారు..
చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్ల పాలనలో రైతులను పురుగులను చూసినట్లు చూశారని ఆరోపించారు.  వ్యవసాయం దండగన్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలు వేసి చెప్పారన్నారు. రూ.వేలకు వేలు కరెంటు బిల్లులు వేసి రైతులను, పల్లెలను పీల్చి పిప్పి చేసిన ఆయన.. ఇప్పుడు మళ్లీ ‘మీకోసం’ పాదయాత్ర అంటూ అవే పల్లెల వెంట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పాదయాత్ర చేస్తున్నాడు కదా.. ప్రజా సమస్యలు అర్థం చేసుకుని, రైతులకు, రైతు కూలీలకు అండగా నిలబడుతారనుకున్నామనీ, ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి కూలగొడతారనుకున్నామనీ ఆమె చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడుకు ప్రజా ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఆయనకు కావాల్సింది రాజకీయాలనీ,  ఏం చేసినా రాజకీయంగానే ఆలోచిస్తారనీ శ్రీమతి షర్మిల విమర్శించారు. ఎంతటి నీచానికైనా దిగజారుతారన్నారు.  రైతులు ఏమైపోయినా ఆయనకు పట్టదని మండిపడ్డారు. ఆరోజు అధికారం కోసం పిల్లనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచారనీ, ఈ రోజు తన అవినీతిపై సీబీఐ విచారణ తప్పించుకోవడానికి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారనీ వివరించారు. ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెడితే.. మద్దతిచ్చి ప్రజల పక్షాన నిలబడాల్సింది పోయి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణగా నిలబడ్డారని  చంద్రబాబు నైజాన్ని ఆమె కళ్ళకు కట్టారు. నమ్మక ద్రోహం, అధికారం కోసం అడ్డదారులు తొక్కడం ఆయన రక్తంలోనే ఉన్నాయని ఆయనకు పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్ గారే చెప్పిన విషయాన్ని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు.

శుక్రవారం 105వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పటమట లంక నుంచి ప్రారంభమైంది. ఎన్టీఆర్ సర్కిల్, ఆటోనగర్, కామయ్యతోపు మీదుగా పెనమలూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. శ్రీమతి షర్మిల నడిచినంత దూరం రోడ్డుకు ఇరువైపులా జనం కిక్కిరిసిపోయారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి, కరచాలనం చేయడానికి ఎగబడ్డారు. గోసాల గ్రామంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.30 గంటలకు ఆమె చేరుకున్నారు. శుక్రవారం 16.4 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,430.5 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యే కొడాలి నాని, జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధ, రత్న బోసు, జ్యేష్ట రమేష్, పార్టీ నాయకులు ఆర్కే, ఎంవీఎస్ నాగిరెడ్డి, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వరరావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, తాడి శకుంతల, డాక్టర్ హరికృష్ణ స్థానిక నాయకులు పటమట సురేష్‌బాబు, తాతినేని పద్మావతి తదితరులున్నారు.

Back to Top