రాజన్న బిడ్డకు రంగారెడ్డిజిల్లా జన నీరాజనం

ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా): మహానేత రాజన్న కూతురు శ్రీమతి షర్మిల ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రకు రంగారెడ్డిజిల్లా జనం అడుగడుగునా నీరాజనాలు పట్టారు. ప్రజల నుంచి ఆమెకు అఖండ స్వాగతం లభించింది. మోకాలి గాయం కారణంగా జిల్లాలోని తుర్కయాంజాల్‌ వద్ద గత డిసెంబర్‌ 15న నిలిపిన పాదయాత్రను బుధవారం మళ్ళీ అక్కడి నుంచే శ్రీమతి షర్మిల ప్రారంభించారు. మహానేత‌ డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ‌రంగారెడ్డి జిల్లాపై చూపిన ప్రత్యేక అభిమానానికి కృతజ్ఞతగా వారు శ్రీమతి షర్మిలను అక్కున చేర్చుకున్నారు. ప్రతిచోట బాణసంచా కాలుస్తూ... సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆత్మీయంగా స్వాగతించారు. వృద్ధులు, మహిళలు, పెద్ద సంఖ్యలో కాలేజీ విద్యార్థులు శ్రీమతి షర్మిల వెంట యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

తుర్కయంజాల్‌లో మొదలై ఇబ్రహీంపట్నంలో ముగిసిన తొలిరోజు యాత్ర ఆద్యంతం ఉత్తేజభరితంగా సాగింది. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ, తనను అనుసరిస్తున్న వారిని ఉత్సాహపరుస్తూ శ్రీమతి షర్మిల పాదయాత్ర చేశారు. అడుగడుగునా ప్రజలతో ఆమె మమేకమైన తీరు స్థానికులను అబ్బురపరిచింది. తుర్కయంజాల్, శేరిగూడలో మహిళలతో నిర్వహించిన రచ్చబండకు ‌విశేష స్పందన వచ్చింది. తమ సమస్యలను చెప్పుకునేందుకు మహిళలు పోటీపడ్డారు. వారి కష్టాలను ఓపికగా విన్న శ్రీమతి షర్మిల త్వరలో రాజన్న రాజ్యం వస్తుందని, మీ బాధలన్నీ తొలగిపోతాయని అనడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

కాంగ్రెస్,‌ టిడిపిలపై విమర్శనాస్త్రాలు :
కాంగ్రెస్, ‌టిడిపి కుమ్మక్కు రాజకీయాలపై శ్రీమతి షర్మిల సంధించిన విమర్శనాస్త్రాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఇబ్రహీంపట్నంలో సాయంత్రం జరిగిన సభకు భారీ సంఖ్యలో హాజరైన జనం శ్రీమతి షర్మిల ప్రసంగానికి ముగ్ధులయ్యారు. చంద్రబాబు నీచ రాజకీయాలు.. అవిశ్వాసం పెట్టకుండా సాగిస్తున్న పాదయాత్రపై విసిరిన చెణుకులకు ఆహూతులు కరతాళ ధ్వనులతో ఆమోదం తెలిపారు. ఇబ్రహీంపట్నం సభలు చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో జనం పోటెత్తారు. శ్రీమతి షర్మిల చేసిన ప్రసంగం అన్ని వర్గాలను ఆకట్టుకుంది. పాదయాత్ర ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరిస్తూ చేసిన ఉపన్యాసానికి విశేష స్పందన లభించింది.

‘సింహం బోనులో ఉన్నా.. బయట ఉన్నా సింహం.. సింహమే.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు’ అంటూ శ్రీ జగనన్నను ఉద్దేశించి చేసిన శ్రీమతి షర్మిల వాఖ్యలకు ప్రజలు నుంచి ఈలలు, కేరింతలతో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. అన్ని వర్గాలను చంద్రబాబు దోచుకున్నారని, సిబిఐ కుట్రలు.. కిరణ్ ‌ప్రభుత్వం కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుతూ శ్రీమతి షర్మిల విసిరిన సవాళ్లు ప్రజలను కట్టిపడేశాయి.

షర్మిల పాదయాత్రతో పార్టీలో నూతనోత్తేజం :
శ్రీమతి షర్మిల పాదయాత్ర వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపింది. మోకాలికి గాయం కారణంగా డిసెంబర్ 15న అర్థంతరంగా యాత్ర ఆగిపోవడంతో నిరాశకు గురైన పార్టీ కార్యకర్తలకు ‘మరో ప్రజాప్రస్థానం’ పునఃప్రారంభం కొత్త ఉత్సాహన్ని తెచ్చింది. బలీయమైన శక్తిగా ఎదుగుతున్న పార్టీకి శ్రీమతి షర్మిల పాదయాత్ర మరింత జోరునిచ్చింది.
Back to Top