రాజకీయ లబ్ధికోసమే ఆనం పాట్లు

హైదరాబాద్, 12 ఏప్రిల్ 2013:

రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆనంపై మండిపడ్డారు. మహానేత మరణానంతరం ఏర్పాటుచేసిన సంతాప సభలో ఆనం దాదాపు ఏడ్చినంత పని చేసిన విషయాన్ని ఆయన మరిచిప్పటికీ నెల్లూరు ప్రజలు మరువలేదని చెప్పారు. 2007లో శ్రీ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అరవై అడుగుల కటౌట్ పెట్టి భారీగా వేడుకలను నిర్వహించిన సంగతీ వారి గుర్తుందన్నారు. మహానేత మరణానంతరం శ్రీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయకపోతే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని వారు హెచ్చరించిన విషయమూ ఇంకా జ్ఞాపకముందన్నారు. డాక్టర్ వైయస్ఆర్ పెట్టిన రాజకీయ భిక్షతో మంత్రి అయిన ఆనం మహానేత కుటుంబాన్ని రాష్ట్రం నుంచి వెలివేయాలనడం ఎంతవరకూ సమంజసమో ఆయనే తేల్చుకోవాలన్నారు. రానున్న ఎన్నికలలో ఎవరిని నెల్లూరు ప్రజలు వెలివేస్తారో తేలుతుందని మేకపాటి హెచ్చరించారు. ఢిల్లీ కటాక్షం కోసమే ఆయనిలా మాట్లాడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

శుక్రవారం ఉదయం సుప్రీం కోర్టులో శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిలు కోసం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైన అనంతరం బెయిలును అడ్డుకునేందుకు ఇలా మాట్లాడి ఉండవచ్చని చెప్పారు. మంత్రి మోపిదేవిని అరెస్టుచేసినప్పుడు గానీ, ధర్మానపై అభియోగాలు వచ్చి కోర్టులో కేసు వేసినప్పడు గానీ, ఇప్పుడు హోంమంత్రి సబితపై సీబీఐ కేసు నమోదు చేసినపుడు గానీ ఆనం మాట్లాడలేదనీ, ఇప్పుడు మాట్లాడడం వెనుక బెయిలును అడ్డుకోవడమే వ్యూహమనీ మేకపాటి అభిప్రాయపడ్డారు. ఇలా చెప్పడం వెనుక ఢిల్లీ కటాక్ష ప్రాప్తికోసమనే అంశం కూడా ఉందన్నారు. రాజశేఖరరెడ్డిగారు అవకాశమివ్వడం బట్టే ఇంతవరకూ ఎదిగారనే విషయాన్ని ఆనం మరిచారని మండిపడ్డారు. ఏ నోటితో అయితే మహానేతను, జగన్మోహన్ రెడ్డిగారినీ, ఆయన కుటుంబాన్ని పొగిడిన వ్యక్తులు నేడు ఇంత కఠినంగా మాట్లాడడానికి కారణమేంటని ఆయన నిలదీశారు. బెయిలు పిటిషను వేసినప్పుడల్లా దాన్ని అడ్డుకుని జగన్మోహన్ రెడ్డిగారిని శాశ్వతంగా జైలులో ఉంచాలనుకుంటున్నారా అనే సందేహాన్ని ఆయన వ్యక్తంచేశారు.

నెల్లూరు పార్లమెంటు ఉప ఎన్నికలో ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బిరామిరెడ్డి తరఫున బాధ్యతలు తీసుకున్న విషయాన్ని ఎవరూ మరిచిపోలేదన్నారు. ఆత్మకూరులో దాదాపు 33 వేల మెజారిటీ వచ్చిందన్నారు. 2009 పార్లమెంటు ఎన్నికలలో కంటే తనకు ఉప ఎన్నికలో ఆరు రెట్లు ఎక్కువ మెజారిటీ వచ్చిన విషయాన్ని వారు మరిచిపోకూదని మేకపాటి హితవుపలికారు. ఇలాగే మాట్లాడితే ప్రజలలో మరింత చులకనవుతారనీ, తన ఆధిక్యత పదిరెట్లు పెరిగినా ఆశ్చర్యం లేదని చెప్పారు. మీ మాట తీరు చూస్తుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన ఆనం రామనారాయణరెడ్డిని హెచ్చరించారు. ఏడాది తర్వాత ఎవరు ఎవరిని వెలివేస్తారో చూద్దామనీ.. ఈ సవాలుకు అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. కృత్రిమంగానూ, రాజకీయ లబ్ధి పొందేవిధంగానూ మాట్లాడడం తగదన్నారు. విజయమ్మ గారి గురించి, షర్మిల గారి గురించి నీచంగా మాట్లాడడం వారి సంస్కృతికి అద్దం పడుతోందని మేకపాటి పేర్కొన్నారు. ఆనం సొంత సోదరుడు జయకుమార్ రెడ్డి తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారనీ ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

బయ్యారం గనులలో బ్రదర్ అనిల్ కుమార్ అవకతవకలకు పాల్పడ్డారని చెబుతున్నారనీ, ప్రభుత్వం మీదే కాబట్టి విచారణ చేపట్టి నిరూపించాలనీ ఆయన కోరారు. ఆర్థిక నేరాల గురించి సీబీఐ చార్జి షీట్లు వేస్తూనే ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డిగారు బయటకొస్తే రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోతుందని కాంగ్రెస్ పార్టీ భీతిల్లుతున్న అంశం అందరికీ బోధపడుతూనే ఉందన్నారు. సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేసిన తర్వాత ఇంత కఠినంగా మాట్లాడుతుండడం దీనిని మరోసారి రుజువుచేసిందన్నారు. భవిష్యత్తులో రాజశేఖరరెడ్డిగారి కుటుంబీకులకు ఏ చిన్న హానీ వాటిల్లినా మీరే బాధ్యులవుతారని మేకపాటి హెచ్చరించారు. ఆనం మాట్లాడిన భాషను రాష్ట్ర ప్రజలు సహించరని కూడా ఆయన హితవు పలికారు. ఆనం సోదరులు ఏంచేసినా రాజకీయ లబ్ధిని ఆశించే చేస్తున్నారని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

Back to Top