రాబందుల రాజ్యమనడానికి ఇవే నిదర్శనాలు

ఉరవకొండ:

ఇది రాబందుల రాజ్యమనడానికి ఇవి చక్కని ఉదాహరణలని మహానేత వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల ధ్వజమెత్తారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైయస్ షర్మిల గూళ్యపాలెంలో షర్మిలకు స్థానికులు ఫిర్యాదు చేసినపుడు ఆమె ఈ వ్యాఖ్య చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తమ సమస్యలు విన్నవించారు. ఈ ప్రభుత్వ వైఖరితో విసిగిపోయామన్నారు. ఆల్లె బాషా అనే వికలాంగుడికి 2011 జులై వరకు పింఛను వచ్చిందనీ, కానీ 15 నెలలుగా పెన్షన్ రాలేదని ఆయన భార్య మొరపెట్టుకున్నారు. పింఛనుకు సంబంధించిన ఖాతా పుస్తకం చూపించి.. తమకు పింఛనే ఎంతో కొంత ఆధారమనీ, వచ్చేలా చూడాలనీ వేడుకున్నారు. ఓ విద్యార్థి మాట్లాడుతూ ‘గ్యాస్ ధర పెరిగిందని హాస్టల్లో మెనూ తగ్గించారు. జైల్లో ఖైదీకి రూ. 40 వెచ్చిస్తే.. మాకు రోజుకు రూ. 17 మెస్ చార్జీగా ఇస్తున్నారు. రాజన్న రాజ్యం రావాలి. మళ్లీ మాకు జగనన్న సీఎం కావాలి..’ అని అన్నారు. స్థానికులంతా తమకు నీళ్లు రావడం లేదని, కరెంటు ఉండడం లేదని, పావలా వడ్డీ కింద రుణాలు రావడం లేదని ఫిర్యాదు చేశారు.
'ఇందిరమ్మ' బిల్లు ఆగిపోయింది
ఇందిరమ్మ ఇల్లు మధ్యలో ఆగిపోయి బిల్లులు రాలేదని వాపోయారు. ఓ రైతు మాట్లాడుతూ ‘అదనులో విత్తనాలు సరఫరా చేయకుండా ఈప్రభుత్వం రైతులను దెబ్బతీస్తోంది. సబ్సిడీ విత్తనాలను దళారులు చేజిక్కించుకుని అమ్ముకుంటున్నారు. వైయస్ ఉన్నప్పుడు గ్రామం యూనిట్‌గా బీమా ఇస్తే.. ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది..’ అని పేర్కొన్నారు. ఓ విద్యార్థి మాట్లాడుతూ మాకు బస్ పాస్ ఉచితంగా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. మరో విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రతి పరీక్షకు ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేయగా.. షర్మిల స్పందిస్తూ ‘ఇది రాబందుల రాజ్యం అనడానికి ఇదే చక్కటి నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఫీజులు వసూలు చేస్తారు. కరెంటు ఇవ్వరు. గ్యాస్ ఇవ్వరు. రుణాలు ఇవ్వరు. ఉన్న పెన్షన్లు తీసేస్తారు. సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి. జగనన్న వచ్చాక రాజన్న కన్న ప్రతి కలనూ నెరవేరుస్తాడు. మీ కష్టాలన్నీ తీరుస్తాడు’ అని భరోసా ఇచ్చారు.

Back to Top