చంద్రబాబును నిలదీయండి: షర్మిల పిలుపు

నంద్యాల, ప్రొద్దుటూరు 06 సెప్టెంబర్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం నాటికి 5వ రోజుకు చేరింది. కర్నూలు జిల్లా నంద్యాల, కడప జిల్లా ప్రొద్దుటూరులలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలపై నిప్పులు కురిపించారు. మహానేత హయాముకూ, ప్రస్తుత పరిపాలనకు తేడాను ఆమె సవివరంగా తెలియజేశారు. మహానేత అమలు చేసిన సంక్షేమ పథకాలు వాటిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నిర్వీర్యం చేసిందీ సోదాహరణంగా వివరించారు. శ్రీమతి షర్మిల ప్రసంగం ఆమె మాటల్లోనే...
మహానేత డాక్టర్ వైయస్ఆర్ దివంగతులైన నాలుగేళ్ళకే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరయ్యింది. అన్ని వర్గాలు ఏదో రకంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. ఆయన ప్రవేశ పెట్టిన అన్ని సంక్షేమ పథకాలనూ కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చేసింది. చివరకు 104, 108 సర్వీసులు కూడా మూలనపడ్డాయి. కొత్త రేషను కార్డు లేదు, ఇల్లు లేదు, ఒక విద్యార్థికి ఫీజు రీ యింబర్సుమెంటు లేదు. మహానేత ఉన్న సమయంలో ఒక్క రూపాయి ఏ చార్జీ పెరగలేదు. కరెంటు చార్జీలే కాకుండా వేల కోట్ల రూపాయల అదనపు చార్జీలను కూడా మోపుతున్నారు. ఇది చాలదన్నట్లు రాష్ట్ర విభజన పేరుతో ప్రజల మధ్య మంట పెట్టి కేంద్ర ప్రభుత్వం చలి కాచుకుంటోందన్నారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమో, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసమో కాంగ్రెస్ ఈ నాటకానికి తెరతీసింది.

మహారాష్ట్ర, కర్ణాటక తమ అవసరాలు తీరిన తర్వాత విడుదల చేసే నీటిపైనే మన రాష్ట్ర రైతాంగం భవిష్యత్తు ఆధార పడి ఉంది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నంద్యాల ప్రాంత రైతులు ఏడాదికి రెండు పంటలు వేసుకుంటున్నారని చెప్పారు. శ్రీశైలం కాల్వకు నీరు రాకపోతే.. కింది ప్రాంతాల రైతుల పరిస్తితి ఏమిటి? మిగులు జలాలపై ఆధారపడ్డ హంద్రీ-నీవా పరిస్థితి ఏమిటి?

చంద్రబాబు పుట్టుక తెలుగు తల్లికే అవమానం
చంద్రబాబునాయుడు తెలుగు గడ్డ మీద  పుట్టినందుకు... తెలుగు తల్లే  అవమానంతో  తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఆమె మండిపడ్డారు.  ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు బస్సు యాత్ర చేస్తున్నారో  ప్రజలు నిలదీయాలని ఆమె  పిలుపునిచ్చారు.  చంద్రబాబు పట్టపగలే సీమాంధ్రుల గొంతు కోశారని ఆమె ఆరోపించారు.  తొలుత ఆమె నంద్యాలలో పొట్టి శ్రీరాములు, డాక్టర్ వైయస్ఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో సమైక్య  శంఖారావ రథం దూసుకుపోతోంది. రాయలసీమ ప్రజలు తమ కాంక్ష సమైక్య రాష్ట్రమేనని నినదిస్తున్నారు. తిరుపతిలో ప్రారంభమైన సమైక్య శంఖారావం రాయలసీమ జిల్లాల్లో సమైక్య నినాదాన్ని వినిపిస్తూ ముందుకు సాగుతోంది.

చంద్రబాబు చెబుతున్నట్టు ఇటలీకి - ఇడుపులపాయకు లింకు ఉంటే జగనన్న ఈ పాటికే చిరంజీవిలా ఏ కేంద్ర మంత్రో, ముఖ్యమంత్రో అయ్యేవారు కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఐఎంజి, ఎమ్మార్‌ కేసులు విచారణ జరగకుండా చీకట్లో చిదంబరాన్ని కలిసి మేనేజ్‌ చేసుకుంది మీరు కాదా అన్నారు. ఎఫ్‌డిఐ బిల్లు సమయంలో కాంగ్రెస్‌ కుమ్మక్కైంది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. కుమ్మక్కు కాకపోయి ఉంటే మైనార్టీలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని చంద్రబాబు ఏ విధంగా కాపాడారని నిలదీశారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కైపోయి జగనన్నపై కుట్రలు చేసి, కేసులు బనాయించి 16 నెలలుగా జైలులో పెట్టించింది మీరు కాదా చంద్రబాబూ అని ప్రశ్నించారు.

తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని హైదరాబాద్‌ను రాజధానిగా చేయడానికి ఇదే కర్నూలు నగరం గొప్ప త్యాగం చేసిందన్నారు. ఇప్పుడు 60 ఏళ్ళుగా కష్టపడి నిర్మించుకున్న హైదరాబాద్‌ మీది కాదు, వెళ్ళిపొమ్మంటుంటే సీమాంధ్రులు ఏమి కావాలో కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలన్నారు.

జనంలో ఉన్నా, జైలులో ఉన్నా జగనన్న జన నేతే. బయట ఉన్నా కాంగ్రెస్‌, టిడిపి నాయకులు దొంగలే అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము కాంగ్రెస్, టిడిపిలకు లేదు కనుకే వెనుక నుంచి సిబిఐతో దాడి చేయించి జైలులో పెట్టారని విమర్శించారు. బోనులో ఉన్న సింహం సింహమే అన్నారు. త్వరలో జగనన్న వస్తారని రాజన్న రాజ్యం వైపు మనందరిని నడిపిస్తారని అన్నారు.

రాజశేఖరరెడ్డిగారు ఉన్నప్పుడు రాష్ట్రం ఏ విధంగా కళకళలాడిందో నేను మీకు చెప్పనక్కర్లేదు. వ్యవసాయానికి 7 గంటలు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన రోజులవి. విద్యార్థుల గురించి ఆయన ఒక కన్న తండ్రి స్థానంలో ఆలోచించి ఉన్నత చదువులు చదవడానికి ఫీజు రీయింబర్సుమెంటు పెట్టారన్నారు. పేదలు కూడా గొప్ప ఆస్పత్రికి వెళ్ళి గొప్ప వైద్యం చేయించుకోవాలని ఆరోగ్యశ్రీని తెచ్చారన్నారు. ఎన్నో పథకాలను రాజశేఖరరెడ్డిగారు అద్భుతంగా చేసి చూపించారన్నారు.

హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి చోటుచేసుకుందనీ, అంతా కష్టపడి అభివృద్ధి చేసుకున్న నగరమనీ ఆమె చెప్పారు. ఆ నగరాభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర లేదా అని ప్రశ్నించారు. కేవలం పదేళ్ళ వ్యవధిలో సీమాంధ్రకు మరో రాజధాని హైదరాబాద్ వంటిది నిర్మించుకోవడం ఎలా సాధ్యమని నిలదీశారు. ఈ అంశపైనే కాక, ఉద్యోగాలు, ఇతర అంశాలపై కాంగ్రెస్ సమాధానంచెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి ఇంత దుర్మార్గానికి ఆ పార్టీ పాల్పడుతోందన్నారు. ఇంత దారుణానికి కారణం ప్రతిపక్ష నేత చంద్రబాబేనని స్పష్టంచేశారు. పట్టపగలే హత్య చేసి, ఆ శవం మీద పడి వెక్కివెక్కి ఏడ్చినట్లుగా ఆయన వైఖరి ఉందని ఆమె దుయ్యబట్టారు. తెలంగాణకు అనుకూలంగా ఎవరినడిగి లేఖ ఇచ్చారని ఆయనను నిలదీయాలని కోరారు. రాజన్న బతికుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావని ప్రతి ఒక్కరూ చెబుతున్నారన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే.. తెలుగు గడ్డ రుణం తీర్చుకోవాలంటే తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుని, ఎమ్మెల్యేలు, ఎంపీలు తక్షణం రాజీనామాలు చేయాలి.

గత నాలుగేళ్లుగా రాష్ట్రం అభివృద్ధిలో ఒక్క అడుగు ముందుకు వేయలేకపోగా.. తిరిగి చూడలేనంత వెనక్కిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డిగారి ఘనత ఇది. ఢిల్లీ వెళ్ళి వస్తున్న కిరణ్ కుమార్ తోనే రాష్ట్ర విభజన సాగుతోందన్నారు. న్యాయం చేసే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేకపోతే... విభజించే హక్కు కూడా లేదన్నారు. న్యాయం చేయడం చేతకాని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. జగనన్న నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోదన్నారు. విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయలేక శ్రీ జగన్మోహన్ రెడ్డిని ఎదర్కోవడానికి కాంగ్రెస్, టీడీపీలు సీబీఐతో జైలులో పెట్టాయని శ్రీమతి షర్మిల ఆరోపించారు.

జై సమైక్యాంధ్ర, జోహార్ వైయస్ఆర్, జై జగన్ అనే నినాదాలతో ఆమె తన ప్రసంగం ముగించారు. సమైక్యాంధ్రకోసం ప్రొద్దుటూరులో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ ఉద్యోగి మునయ్య ఆత్మశాంతికి శ్రీమతి షర్మిల రెండు నిముషాలు మౌనం పాటించారు.

తాజా వీడియోలు

Back to Top