ప్రత్యేక హోదాపై చంద్రబాబు నోరు విప్పాలి: రోజా

కదిరి(అనంతపురం జిల్లా): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక  హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. ‘హంద్రీ-నీవా’కు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి చేపట్టిన దీక్షలో పాల్గొనేందుకు ఉరవకొండ వెళ్తూ గురువారం మార్గం మధ్యలో అనంతపురం జిల్లా కదిరిలో స్థానిక ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పకనే చెప్పారని, దీనిపై ముఖ్యమంత్రి  కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె నిలదీశారు ‘‘మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విలువలకు, విశ్వసనీయతకు మారుపేరు. ఆయన మాటకు కట్టుబడే నేత. చంద్రబాబు లాగా పూటకో అబద్ధం చెప్పే నేత కాదు’’ అన్నారు. బాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల ఉసురు చంద్రబాబుకు తగలకతప్పదన్నారు.

హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి యుద్ధప్రాతిపదికన చేయించారని, మిగిలిన 10 శాతం పనులు చేయించడానికి ఇప్పటి సీఎం చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. చంద్రబాబుకు ఏం దోషముందో తెలియదు కానీ.. సంక్రాంతికి శనగలు పంపిణీ చేశారన్నారు. హెరిటేజ్ కంపెనీలో ఎన్నో రోజుల నుంచి ముగ్గిపోయిన నెయ్యిని ప్రజలకు అందివ్వడం సరికాదన్నారు. ఎలాంటి టెండర్ పిలవకుండా వాటిని పంపిణీ చేయడం మరో మోసమన్నారు. ముస్లిం మైనార్టీలు ఎప్పటికీ వైఎస్ కుటుంబానికి అండగా ఉంటారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేవలం ఎనిమిది నెలల్లోనే తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనబడుతోందన్నారు. ఈ విషయూన్ని ఆ పార్టీ నేతలే బహిరంగంగా ఒప్పుకుంటున్నారని చెప్పారు. 
Back to Top