చంద్రబాబును నిలదీయండి: శోభా నాగిరెడ్డి పిలుపు

హైదరాబాద్, 2 సెప్టెంబర్ 2013:

తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినట్లు స్వయంగా అంగీకరించిన చంద్రబాబు నాయుడు ఆ లేఖను వెనక్కి తీసుకున్న తర్వాతే సీమాంధ్రలో పర్యటించాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకురాలు‌ భూమా శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూలం అని చెప్పిన చంద్రబాబు సమైక్యాంధ్ర కోసం జోరుగా ఉద్యమం కొనసాగుతున్న సీమాంధ్రలో ఎలా పర్యటిస్తారని శోభా నాగిరెడ్డి నిలదీశారు. ఊసరవెల్లి కన్నా దారుణంగా చంద్రబాబు నాయుడు రంగులు మారుస్తున్నారని ఆమె నిప్పులు చెరిగారు.

చంద్రబాబు చేస్తున్న బస్సు యాత్ర విజయవంతం అయితే సమైక్యాంధ్ర ఉద్యమం లేదన్న సంకేతాలు ఢిల్లీకి వెళ్తాయని, అందువల్ల సీమాంధ్ర జేఏసీ నాయకులు ముందుకొచ్చి, ఆయనను నిలదీయాలని శోభా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యమకారులంతా కూడా చంద్రబాబును సమైక్యాంధ్ర విషయంలో నిలదీయాలని ఆమె కోరారు. లేని పక్షంలో ఇక్కడ జరుగుతున్న ఉద్యమాన్ని ఢిల్లీ వర్గాలు అనుమానించే అవకాశం ఉందని శోభా నాగిరెడ్డి హెచ్చరించారు. చంద్రబాబుకు ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు. చంద్రబాబు తోక కత్తిరించడానికు సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

రాష్ట్రం ఇలా ముక్కలయ్యే పరిస్థితి వస్తుందని అనుకోలేదని వైయస్ఆర్‌‌ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. తెలుగు జాతిని దేవుడే రక్షించాలనే పరిస్థితి ఉందని పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. తెలుగు ప్రజల అభివృద్ధిని హర్షించలేక నిరోధించాలనే దురుద్దేశంతోనే ఢిల్లీ పెద్దలు మన రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన నిర్ణయం వెనుక రాజకీయ నేతలందరి తప్పులూ ఉన్నాయన్నారు. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలను విభజించమని లేఖ ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ ఆత్మగౌరవ యాత్ర చేయడమేమిటని ప్రశ్నించారు.

అనర్థాలన్నింటికీ చంద్రబాబే కారణం :
ఇడుపులపాయ : రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అనర్థాలన్నింటికీ చంద్రబాబు నాయుడే కారణమని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దుయ్యబట్టారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాసం పెట్టిన రోజునే ఈ ప్రజా కంటక ప్రభుత్వాన్ని పడగొట్టేసి ఉంటే ప్రస్తుత దుస్థితి దాపురించేది కాదన్నారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు ద్వారంపూడి, అమరనాథరెడ్డి సోమవారంనాడు ఇడుపులపాయ వచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. విద్యుత్‌ చార్జీలు పెరిగేవి కావు, తెలంగాణ విభజన సమస్య కూడా వచ్చి ఉండేది కాదన్నారు. తెలంగాణ ప్రక్రియలో ప్రథమ దోషి చంద్రబాబే అన్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ప్రధాన పాత్ర వహించారని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి అన్నారు. విభజన ప్రకటన వచ్చిన వెంటనే తన వల్లే తెలంగాణ వచ్చిందని టిడిపి అధికార ప్రతినిధి యనమల రామకృష్ణుడు ద్వారా చంద్రబాబు చెప్పించుకున్న వైనాన్ని ఆయన గుర్తుచేశారు. తెలుగువారి ఆత్మగౌరవం అంటే చంద్రబాబుకు తెలుసా? అని ఆయన ప్రశ్నించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top