ఛైర్ పర్సన్ శాంతికుమారి ధర్నా

నగరి (పుత్తూరు): పోలీసుల అరాచకాలకు నిరసనగా పుత్తూరు మునిసిపల్ ఛైర్ పర్సన్
శాంతికుమారి ధర్నాకు దిగారు. అక్రమంగా ఆమె భర్త, కుమారుడ్ని ఎత్తుకుపోయినందుకు
నిరసన తెలిపారు. 

 ఈ నెల 3వ తేదీన రంజాన్‌ తోఫా పంపిణీలో చోటు
చేసుకున్న ప్రోటోకాల్‌ వివాదంలో చైర్‌పర్సన్‌ కే శాంతి పై టీడీపీ గూండాలు దాడి
జరిగిన విషయం తెలిసిందే. ఆమె తీవ్రంగా గాయపడటంతో చెన్నై తీసుకొని వెళ్లి చికిత్స
చేయించుకొని తీసుకొని వచ్చారు. ఆమె ఇప్పుడిప్పుడే కోలుకొంటుండగా మరోసారి టీడీపీ
నేతలు ప్రతాపం చూపించారు.  కాగా అదే రోజు
పాత ఆస్పత్రి భవనం వద్ద శాంతికుమారి భర్త కేజే కుమార్, కుమారుడు మురళి తనను
అడ్డుకున్నారంటూ ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడు ఫిర్యాదు చేశారు. ఆ పిర్యాదుని
వెలికి తీసి,  10 రోజుల తరువాత బుధవారం ఉదయం నగరి పోలీసులు
ఉన్నపలంగా శాంతికుమారి భర్తను, ఆమె కుమారుడ్ని  స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేయడానికి
అత్యుత్సాహం చూపడం ఎందుకని స్నానం చేసి వస్తారంటూ  కుటుంబ సభ్యులు చెప్పినా
పోలీసులు పట్టించుకోలేదు. విచారణ పేరుతో స్టేషన్‌కు లాక్కెళ్లారు. ఎవరినీ లోపలకు
రానీయకుండా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. గేటు వద్ద ఉన్న
బందోబస్తు బలగాలు వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలను లోపలకు రాకుండా అడ్డుకున్నారు.
పైపెచ్చు స్టేషన్‌ ముందు కర్ఫ్యూ వాతావరణాన్ని కల్పించారు. తర్వాత రెండు వారాల
రిమాండ్ ఉత్తర్వులు తీసుకొని జైలుకి పంపించారు. 

స్టేషన్‌ వద్ద చైర్‌పర్సన్‌ నిరసన

 పోలీస్‌ స్టేషన్‌ వద్ద చైర్‌పర్సన్‌ కె.శాంతి
తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తన భర్త అరెస్టుకు ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడే
కారణమంటూ దుమ్మెత్తి పోశారు.. ఓటమిని ఇంకా జీర్ణించుకోలేని ఎమ్మెల్సీ తమపై
కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. ఆమెతో పాటు కౌన్సిలర్లు పుష్ప, గౌరీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేజే కుమార్, కేజే మురళి అరెస్టులను ఖండించారు. చిత్తూరు
జిల్లా పోలీసు యంత్రాంగం చంద్రబాబు తొత్తులుగా మారిపోయిందని మండిపడ్డారు.  

 

Back to Top