రోహిత్‌ మృతికి కారకులను శిక్షించాలి

గుంటూరు:  హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్శిటీలో గతేడాది ఆత్మహత్యకు పాల్పడిన వేముల రోహిత్‌ వేముల మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్‌ చేశారు. రోహిత్‌ స్మృత్యర్ధం గుంటూరు నగరంలో మంగళవారం ప్రజా, విద్యార్ధి, పౌర, దళిత సంఘాలు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ‘‘ఐ యామ్‌ రోహిత్‌’’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ముఖాలకు రోహిత్‌ చిత్రంతో ఉన్న మాస్క్‌లను ధరించి ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కుల, మతాలకు అతీతంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ళతరువాత కూడా కులం, మతం పేరుతో మనషులను వేరే చేస్తూ మేధావులను తయారు చేయాల్సిన విశ్వ విద్యాలయాలను కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. మానసికంగా వేధించడం వలనే ప్రతిభావంతుడైన విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పటి వరకూ దోషులెవ్వరనేది తేల్చలేదని విమర్శించారు. యూనివర్శిటీలను రాజకీయాలకు వాడుకుంటూ కాషాయీకరణ చేస్తున్నారని ఆరోపించారు. కులం, మతం పేరుతో విద్యార్థుల మద్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రోహిత్‌ మృతికి కారకుడైన వీసీ అప్పారావుకు అవార్డు ఇవ్వడం, కుల వివక్షతను ప్రోత్సహించినట్లేనని అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top