పయ్యావుల కేశవ్‌ను కఠినంగా శిక్షించాలి

‌హైదరాబాద్, 2 ఏప్రిల్ 2014:

దళితులపై దారుణంగా దాడులు చేయించిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను కఠినంగా శిక్షించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం డిమాండ్‌ చేసింది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో తమకు తాగునీటి సమస్యను పరిష్కరించమని అడిగిన దళితుడైన నాగన్నపైన, ఆయన కుటుంబం పైన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ వర్గీయులు దాడి చేయడం అమానుషం అని ఖండించింది. దళితులపై పయ్యావుల దాడి తగదని పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్‌ నల్లా సూర్యప్రకాశ్‌ హితవు పలికారు. మరోసారి ఇలాంటి దాడులు జరిగితే చూస్తూ ఊరుకోబోం అని హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడయా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అసహనానికి, అభద్రతకు గురవుతున్నట్లు ఉందని ఇలాంటి సంఘటనల ద్వారా తేటతెల్లం అవుతోందన్నారు.

దళితులపై దాడి చేసిన పయ్యావులను అరెస్టు చేయాల‌ని అనంతపురం జిల్లా దళిత సంఘం డిమాండ్ చేసింది. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమా‌ర్‌ను దళిత సంఘం నేతలు కలిసి పయ్యావులపై ఫిర్యాదు చేశారు. ఉరవకొండ ప్రాంతంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని వారన్నారు. పయ్యావుల నుంచి దళితులకు రక్షణ కల్పించాలని ఎస్పీకి విజ్క్షప్తి చేశారు. నాగన్న కుటుంబంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ‌మంచి నీటి సమస్య ఎందుకు తీర్చలేదంటూ ప్రశ్నించిన పాపానికి కూడేరు మండలం ‌చోళసముద్రం దళితులపై మంగళవారం టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరులు దళితులపై దాడికి పాల్పడ్డారు.

Back to Top