ప్రజలారా టీడీపీ దుర్మార్గపు పాలనను గ్రహించండి

టీడీపీ ఆంధ్రప్రదేశ్ ను ఆఫ్ఘనిస్తాన్ లా ..
ప్రజాస్వామ్య దేశాన్ని పాకిస్తాన్ లా మారుస్తోంది
కోర్టు తీర్పు అనుకూలంగా ఉంటే గౌరవిస్తాం..
వ్యతిరేకంగా వస్తే లెక్కచేయమనట్లు వ్యవహరిస్తోంది
న్యాయస్థానం తీర్పును అమలు చేయకపోవడం చట్టవ్యతిరేకం
ప్రజలు బాబు రెండు చెంపలు వాయించడం ఖాయంఃచెవిరెడ్డి

హైదరాబాద్ః న్యాయస్థానాల కన్నా మా తీర్పే అంతిమమంటూ ప్రభుత్వం తల బిరుసుతనం ప్రదర్శిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. న్యాయ‌స్థానాల తీర్పు మా తీర్పు ముందు నిల‌బ‌డ‌వని మాట్లాడతున్న అధికారపక్షం...కోర్టుకు ఎందుకు వెళ్లిందని చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి నిల‌దీశారు. కోర్టు తీర్పుపై గౌర‌వం లేన‌ప్పుడు కౌంట‌ర్‌ దాఖ‌లు చేయ‌కుండా ఉండాల‌ని, డివిజ‌న్ బెంచ్ కి ఎందుకు వెళ్తున్నార‌ని ప్ర‌శ్నించారు. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే గౌరవిస్తాం, లేకుంటే లెక్కచేయమన్న రీతిలో టీడీపీ తీరు ఉందని దుయ్యబట్టారు.  

జైలు కెళ్ల‌క త‌ప్ప‌దు..
కోర్టు తీర్పుకు వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తిస్తున్న చీఫ్ మార్ష‌ల్‌, అసెంబ్లీ సెక్ర‌ట‌రీలిద్ద‌రు జైలుకు వెళ్ల‌డం త‌ప్ప‌ద‌న్నారు. కోర్టు తీర్పును ధిక్క‌రిస్తే త‌దుప‌రి ప‌రిణామాలు ఎలా ఉంటాయో చీఫ్ మార్ష‌ల్‌, అసెంబ్లీ సెక్ర‌ట‌రీలు చూడ‌బోతున్నార‌న్నారు. దీనిపై అసెంబ్లీలో మాట్లాడుకోవచ్చు కదా అంటూ టీడీపీ ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యానించడంపై  చెవిరెడ్డి చురక అంటించారు. తమకు మైక్ ఇవ్వకుండా కట్ చేస్తుంటే ఎలా మాట్లాడుతారని, మైక్ ఇంటికి తీసుకెళ్లి మాట్లాడాలా అంటూ విరుచుకుపడ్డారు.  

ప్రజాపోరాటం కొనసాగిస్తాం..
టీడీపీ ఏవిధంగా న్యాయ‌స్థానం తీర్పును గౌర‌వించ‌డం లేదో... ఎలా ప్రజావ్య‌తిరేక పాల‌న చేస్తున్నారో... ఇచ్చిన హామీల‌ను ఎలా తుంగ‌లో తొక్కుతున్నారో... ఏర‌కంగా ప్ర‌జాభిమానానికి విలువనివ్వ‌డం లేదో... ఏవిధంగా అసెంబ్లీలో రూల్ 71ను ర‌ద్దు చేశారో దానిపై ప్ర‌జాపోరాటం కొన‌సాగుతుంద‌ని చెవిరెడ్డి బాస్క‌ర‌రెడ్డి తేల్చిచెప్పారు.  ఏ రూల్ అయినా రాజ్యాంగానికి లోబ‌డే అమ‌లవుతాయే త‌ప్ప‌, రాజ్యాంగానికి వ్య‌తిరేకంగా అమ‌లు కావ‌ని తెలిపారు. ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌తి దుశ్చ‌ర్య‌ను కోర్టు ద్వారా మేము ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తున్నామ‌ని వివ‌రించారు. ప్ర‌జ‌ల‌కు మీడియా ద్వారా తామొక్క‌టే విజ్ఞ‌ప్తి చేస్తున్నామ‌ని ...టీడీపీ దుర్మార్గ‌పు పాల‌న‌, దుశ్చ‌ర్య పాల‌న‌, దుశ్సాసన పాల‌న‌ను గ‌మ‌నించాల‌ని కోరారు. 

ఆఫ్ఘనిస్తాన్ లా ఆంధ్రప్రదేశ్..
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఆఫ్ఘానిస్తాన్‌గా, ప్ర‌జాస్వామ్య దేశాన్ని పాకిస్తాన్ దేశంలాగా మారుస్తున్నార‌ని మండిప‌డ్డారు. కోర్టు ఇచ్చిన ప్ర‌తి తీర్పును దేశంలోని ప్ర‌తి శాస‌న‌స‌భ అమ‌లు చేసింద‌ని ...అనంత‌రం ఆ తీర్పుపై పైకోర్టుల‌కు వెళ్లాయని చెప్పారు. చ‌ట్టాల‌ను త‌యారు చేసే వారే చ‌ట్టాల‌ను గౌర‌వించ‌క‌పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. మావైపు ప్ర‌జ‌లున్నార‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వం అన్యాయాలను ఎండ‌గ‌డ‌తామ‌న్నారు. 

ముఖ్య‌మంత్రి రేయ్ అంటారా..?
అసెంబ్లీలో స్వ‌యంగా ముఖ్య‌మంత్రి ఒక శాస‌న‌స‌భ్యుడిని రేయ్, నీ అంతుచూస్తాన‌ని మాట్లాడడం. ఒకాయన కొవ్వు ఎక్కువైంద‌ని,  ఇంకొక‌రు ఖ‌బ‌డ్దార్ అని, ఇంకొకాయన బుర‌ద‌లో పందులని, మ‌రొక‌రు సైకోల‌ని, ఒక‌రైతే ఏకంగా అసెంబ్లీలోనే పాతేస్తాన‌ని వ్యాఖ్య‌నించ‌డం చెవుల‌కు విన్న‌సోంపుగా ఉందా అని స్పీకర్ ను ప్ర‌శ్నించారు. న్యాయం అన్న‌ది అంద‌రికీ స‌మానంగా ఉండాల్నారు. రాష్ట్రంలో కొన్ని వంద‌ల స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని ..వాటికి ఎందుకు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌ర‌ని నిల‌దీశారు. చంద్ర‌బాబు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే ప్ర‌జ‌లు ఓటు అనే ఆయుధంతో ఈ చెంప‌, ఆ చెంప వాయిస్తార‌ని తెలిపారు. తాము ఏ త‌ప్పు చేయ‌లేద‌ని, చేశామని  చూపిస్తే దానిపై స‌మాధానం చెప్ప‌డానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంద‌న్నారు. 

ప్రాథ‌మిక హ‌క్కులు, మౌళిక సూత్రాల‌కు భంగం కలగకుండా స‌భ‌లో స‌భ‌వ్య‌వ‌హారాలు జ‌రిగిన‌ప్పుడే 212 అధికర‌ణ ప‌ని చేస్తుందని చెవిరెడ్డి తెలిపారు. రాజ్యాంగానికి విఘాతం ఏర్ప‌డిన‌ప్పుడు, ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాదం ఏర్ప‌డిన‌ప్పుడు, ప్రాథ‌మిక హ‌క్కుల‌కు భంగం క‌లిగిన‌ప్పుడు మౌళిక సూత్రాల‌ను తుంగ‌లో తొక్కిన‌ప్పుడు కోర్టు జోక్యం చేసుకోవ‌చ్చ‌ని సుప్రీం కోర్టు చెబుతుంద‌ని వివ‌రించారు.  ఏ రాష్ట్రంలో చూసిన కోర్టు తీర్పే వేద‌మ‌ని అన్నారు. 

1964లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఒక శాస‌న‌స‌భ్యుడిని ఏడు రోజుల పాటు అరెస్ట్ చేయాల‌ని సభ తీర్మానిస్తే... ల‌క్నో కోర్టు దానికి వ్య‌తిరేకంగా తీర్పునిచ్చిందని చెప్పారు.  దానిపై తిరిగి స్పీక‌ర్ డివిజ‌న్ బెంచ్ కు వెళ్లార‌ని, డివిజ‌న్ బెంచ్ సైతం సింగిల్‌ బెంచ్ ఇచ్చిన తీర్పునే వెలువ‌రించింద‌ని చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వివ‌రించారు. కాగా అధికార ప్ర‌భుత్వం తిరిగి రాష్ట్ర‌ప‌తి స‌ల‌హా కోసం ఆశ్ర‌యిస్తే రాష్ట్ర‌ప‌తి ఆ కేసును సుప్రీంకోర్టుకు పంపించార‌ని తిరిగి సుప్రీం కోర్టు సైతం ఒక శాస‌న‌స‌భ్యుడిని ఇష్టానుసారం స‌స్పెండ్ చేసే హ‌క్కు స్పీక‌ర్‌కు లేద‌ని స్ప‌ష్టం చేసింద‌ని చెప్పారు. 

త‌మిళ‌నాడులో ఆరుగురు శాస‌న‌స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేస్తే వారు హైకోర్టును ఆశ్ర‌యించార‌ని, దీంతో వారి సస్పెన్ష‌న్ చెల్ల‌ద‌ని కోర్టు తీర్పునివ్వ‌డంతో  ప్ర‌భుత్వం తిరిగి వారిని శాస‌న‌స‌భలో కొన‌సాగించార‌ని గుర్తు చేశారు. ఎక్కడైనా కోర్టు తీర్పునిచ్చిన త‌ర్వాత దానిని అమ‌లు చేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌పై ఉంద‌న్నారు. తీర్పు ప్ర‌భుత్వానికి న‌చ్చ‌క‌పోతే ముందు తీర్పును అమ‌లు చేసిన అనంత‌రం డివిజ‌న్ బెంచ్ కి వెళ్లాలని, అంతేకానీ తీర్పును అమ‌లు చేయ‌కుండా వ్య‌వ‌హారించ‌డం చ‌ట్ట‌వ్య‌తిరేక‌మ‌న్నారు.

Back to Top