విశాఖలో వచ్చేనెల 6న బహిరంగసభ

  • ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతాం
  • ప్రత్యేకహోదా ఆవశ్యకతను వివరిస్తాం 
  • టీడీపీ సర్కార్ అవినీతిలో కూరుకుపోయింది
  • పాలనలో పూర్తిగా వైఫల్యం చెందింది
  • బహిరంగసభల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తాం
  • పార్టీ కేంద్ర కార్యాలయంలో బహిరంగసభ పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్ః ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని వైయస్సార్సీపీ ఎమ్మెల్సీ, శాసనమండలిలో పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఎన్నికల ముందు హోదా పదేళ్లు కాదు పదిహేనేళ్లు కావాలన్న చంద్రబాబు ఇప్పుడు హోదాను నీరుగార్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పేందుకు రాష్ట్రంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొట్టమొదటగా వచ్చేనెల ఆరున విశాఖపట్నంలో సాయంత్రం 3 గంటలకు బహిరంగసభ ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన  జై ఆంధ్రప్రదేశ్ పోస్టర్ ను పార్టీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. 

ప్రత్యేకహాదాను విడిచిపెట్టేది లేదని, హోదా వచ్చేవరకు వైయస్సార్సీపీ పోరాడుతుందని ఉమ్మారెడ్డి తేల్చిచెప్పారు. ప్రత్యేకహోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఇప్పటికే యువభేరి సహా అనేక కార్యక్రమాల ద్వారా అధ్యక్షులు వైయస్ జగన్ ప్రత్యేకహోదా ఆకాంక్షను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరిని ఎండగట్టారని చెప్పారు. ప్రభుత్వం ఏవిధంగా ప్రజలను దగా చేస్తుందో బహిరంగసభల ద్వారా ప్రజలకు తెలియజెప్పుతామన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉమ్మారెడ్డి చెప్పారు. 

ప్రభుత్వం అన్ని రంగాల్లో బహుముఖ వైఫల్యం చెందిందని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను, అవినీతిని ప్రజల్లో ఎండగట్టేందుకు  రాష్ట్రవ్యాప్తంగా కనీసం ఐదుచోట్లైనా బహిరంగసభలు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు ఉమ్మారెడ్డి తెలిపారు. త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు.  రెండున్నరేళ్ల ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకే ఈసభలని అన్నారు. ప్రభుత్వ నయవంచక పాలన గురించి రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నాయకులు తరలివచ్చి వివరణ ఇస్తారని పేర్కొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగసభను విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఉమ్మారెడ్డితో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి. విజయసాయిరెడ్డి, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top