ప్రశ్నోత్తరాల్లో ప్రజా సమస్యలు

హైదరాబాద్ః ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా...ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యపు పాలనను ఎత్తిచూపారు. 

జ్యోతుల నెహ్రూ(జగ్గంపేట ఎమ్మెల్యే)
ఏలేరు రిజ‌ర్వ‌ాయ‌ర్ నుంచి సాగునీటికి నీరిస్తున్నామ‌ని చెబుతున్న అధికార ప్ర‌భుత్వం.... అక్క‌డ 35వేల ఎక‌రాలు గ‌ట్టెక్కే ప‌రిస్థితి లేద‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు అన్నారు. 35వేల ఎక‌రాల‌కు సంబంధించిన అన్ని గ్రామాలు ఏలేరు ప్రాజెక్టుపైనే త్రాగునీటికి సైతం ఆధార‌ప‌డ్డార‌ని ఆయ‌న తెలిపారు. ఏలేరు నుంచి విశాఖ‌ప‌ట్నంకు నీరు త‌ర‌లిస్తే ఎటువంటి ఇబ్బంది లేద‌ని.... కానీ ఏలేరు ఆయ‌కట్టుపై ఆధార‌ప‌డి ఉన్న 50 గ్రామాల‌కు త్రాగు, సాగునీరు అందించాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఉంద‌న్నారు. 

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు ఎమ్మెల్యే)
బోర్లు వేసి అప్పుల పాలై రైతులు కూలీలుగా వలసలు పోతున్నారని ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి శాసనసభ దృష్టికి తీసుకొచ్చారు. అనంత‌పురం, చిత్తూరు, క‌డ‌ప జిల్లాలో వెయ్యి నుంచి 1500 అడుగుల మేర బోరు వేస్తున్నా ఫ‌లితం లేద‌ని,  ప్ర‌భుత్వం క‌మైండ్ ఏరియాలో రూ.24వేలు, నాన్ క‌మైండ్ ఏరియాలో రూ.32వేలు, ట్రాన్స్‌కో వారు రూ.50 వేలు, స్పెష‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ నుంచి రూ.40 వేలు ఇస్తున్నారని..కానీ ఒక బోరుకు సుమారు 4 నుంచి 5 ల‌క్ష‌లు ఖ‌ర్చువుత‌ున్నాయ‌ని పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. బోర్లు ఫెయిలయిన రైతులకు ఇన్సూరెన్స్ కల్పిస్తారా లేదా... ? రైతులకు నష్టం జరగకుండా ఆర్థికంగా ఆదుకుంటారా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

ఎస్వీ మోహన్ రెడ్డి(కర్నూలు)
కర్నూలులో పందుల సమస్య ఎక్కువైందని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశోత్తరాల సమయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇది పెద్ద మాఫియాగా మారిందన్నారు . చిన్నపిల్లలను పందులు చంపుతున్న పరిస్థితులున్నాయన్నారు. స్థానికంగా వ్యాక్సిన్ కూడా లేదని చెప్పారు.  గతంలో  షూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇచ్చినా అది సరిగా అమలుపర్చడం లేదన్నారు. పందుల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

సంజీవయ్య (సుళ్లూరుపేట ఎమ్మెల్యే)
నాయుడుపేట మున్సిపాలిటీ చేసిన తర్వాత, దానికి సంబంధించి రోడ్ వైడ్ చేస్తూ సుమారు 200మంది పేదల ఇళ్లు పడగొట్టిన విషయాన్ని ఎమ్మెల్యే సంజీవయ్య సభలో ప్రస్తావించారు. ఆరునెలల నుంచి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. అక్కడ ఉన్న ప్రభుత్వ స్థలాలను వారికి కేటాయించి ఇళ్లు కట్టించాలన్నారు. అదేవిధంగా అక్కడ మెకానిక్  షాపులను కూడా తీసేశారు. వారికి కూడా ఆటోనగర్ ఏర్పాటు చేసి స్థలాలు ఇవ్వాలన్నారు. ఇక ఈరోజుకు కూడా  మున్సిపాలిటీకి స్టాఫ్ ను అనుమతించలేదని, అక్కడ డిప్యూటేషన్ మీద పనిచేస్తున్న వారికి జీతాలు కూడా ఇవ్వడం లేదన్నారు.  తక్షణమే స్థానిక సమస్యలన్నీ పరిష్కరించాలని సంబంధింత మంత్రి, ప్రభుత్వాన్ని నిలదీశారు. 

ప్రతాప్ అప్పారావు (నూజివీడు ఎమ్మెల్యే)
నూజివీడు నియోజకవర్గానికి సాగర్ జలాలు రావడం లేదని ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు అన్నారు.  ఎక్కడ కూడా చుక్కనీరు లేక స్థానిక ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తాగేందుకు కూడా నీళ్లు లేని పరిస్థితి నెలకొందని చెప్పారు.  నూజివీడు టౌన్ కి కృష్ణా బ్యారేజ్ నీరొచ్చేదని...ఇప్పుడు అది కూడా రావడం లేదని వాపోయారు. ప్రభుత్వం జిల్లాలో నెలకొన్న నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలన్నారు. 

ఐజయ్య( నందికొట్కూరు ఎమ్మెల్యే)
కర్నూలులో వీధికుక్కల దాడి ఎక్కువగా ఉందని ఐజయ్య సభలో ప్రస్తావించారు. కుక్కులు పిల్లలను చంపిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయన్నారు. ఇలాంటివి కర్నూలుతో పాటు ప్రతిచోట జరుగుతున్నాయని చెప్పారు. అదికారులకు చెప్పినా ఏం చేయలేమని చేతులెత్తేశారన్నారు. ఇదే కొనసాగితే,  నరమాంసానికి కుక్కలు అలవాటు పడి మనుషులు వీధుల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడం వల్లే ఈసమస్య ఉత్పన్నమవుతోందన్నారు. 

తాజా వీడియోలు

Back to Top