ప్రజాసమస్యలను గాలికొదిలేశారు

తూర్పుగోదావరి(మండపేట): పేదలకు రేషన్ సరుకుల పంపిణీలో సబ్సిడీని ఎత్తివేసేందుకే  ప్రభుత్వం రేషన్‌షాపుల్లో చౌకబారు విధానాలను అమల్లోకి తెస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆరోపించారు. రేషన్ తెచ్చుకునేందుకు కార్డులోని కుటుంబ సభ్యులందరూ షాపు వద్దకు వెళ్లి వేలిముద్రలు వేసే విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెస్తోందన్నారు. పార్టీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి తల్లి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు కన్నబాబు మండపేట వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ...  రూ. 140 సబ్సిడీ సరుకులు తెచ్చుకునేందుకు పనులు మానుకుని కుటుంబ సభ్యులందరూ రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు.  క్షేత్రస్థాయిలో పేదల సమస్యలను గాలికొదిలేసి చంద్రబాబు సర్కారు కాలక్షేప రాజకీయం చేస్తోందని విమర్శించారు.

అధికారంలోకి వచ్చి రెండేళ్లు పైబడినా ఇంత వరకు హౌసింగ్ బిల్లులు విడుదల చేయపోవడంతో పేదవర్గాల వారు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. అర్హత ఉన్న లబ్ధిదారులందరికి వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కన్నబాబు డిమాండ్ చేశారు. వైయస్సార్ సీపీ కార్యకర్తలపై వేధింపులు ఆపకుంటే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. కార్యకర్తలందరూ మనోధైర్యంతో ఉండాలని, ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.
Back to Top