అన్నపూర్ణాంధ్రను స్మశానవాటికగా మారుస్తున్నారు

  • వ్యవసాయ మంత్రి ప్రోద్బలంతో నకిలీ విత్తనాలు
  • అన్నంపెట్టే రైతు గొంతు కోస్తున్న టీడీపీ ప్రభుత్వం
  • సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకోవడంలో ప్రభుత్వ నేతలు దిట్ట
  • ఇసుకపై ఒక విధానాన్ని రూపొందించకపోవడం సిగ్గుచేటు
  • రైతులను ఆదుకోకపోతే ప్రజాఉద్యమానికి శ్రీకారం
  • వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
గుంటూరు: అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రభుత్వం స్మశానవాటికగా మారుస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అవినీతి సొమ్ముకోసం టీడీపీ నేతలే నకిలీ విత్తనాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు మ్రరి రాజశేఖర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గత రెండు నెలల నుంచి నకిలీ విత్తనాల ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల చుట్టూ ఈ నకిలీ దందా సాగుతుందన్నారు. రాష్ట్రానికి చెందిన వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్భలంతోనే నకిలీ దందా జరుగుతుందని ధ్వజమెత్తారు. అవినీతి సొమ్ముకు లాలూచీ పడి అన్నంపెట్టే రైతుకు ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాల తయారీ డీలర్‌లపై చర్యలు తీసుకోవాలని బాబు చెప్పారంటూ మంత్రులు డబ్బా కొడుతున్నారు కానీ ఇప్పటి వరకు ఒక్కరిపైనైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఒక్క రైతుకన్నా నష్ట పరిహారం చెల్లించారా అని నిలదీశారు. కరువు కాటకాలతో సరిగ్గా పంటలు పండక రైతులు అల్లాడుతుంటే నకిలీ విత్తనాలు రైతులను మరింత పీడిస్తున్నాయన్నారు. సీఎంకు కోపం, బాధ వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటికీ ఎవరిపై చర్యలు తీసుకోకపోవడమేనా బాధ అంటే అని ఎద్దేవా చేశారు. 

రెయిన్‌గన్‌లు అభూత కల్పన
అనంత జిల్లాలో రెయిన్‌ గన్‌లతో నాలుగు రోజుల్లో 4 లక్షల ఎకరాలను కాపాడామని చెప్పుకున్న మంత్రి 63 కరువు మండలాలను ఎలా ప్రకటించారని బొత్స ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెయిన్‌గన్‌లు అభూత కల్పన కాబట్టే కరువు మండలాలను ప్రకటించారని స్పష్టం చేశారు. కర్నూలులో ఉల్లి రైతు మద్దతు ధర లేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. ఏపంటకైనా ఇబ్బందులు వస్తే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మ్యానిఫెస్టోలో పెట్టినట్లుగా ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో టామాటాకు ఇదే పరిస్థితి వస్తే మొత్తం టామాటాను ప్రభుత్వమే కొనుగోలు చేసి హాస్టల్స్‌కు ఉచితంగా పంపిణీ చేయించారన్నారు. రైతులను ఆదుకునే ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఏమైంది మీ తాలూకు ఆలోచన అని బాబును నిలదీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వైయస్‌ఆర్‌ సీపీ అభివృద్ధికి వ్యతిరేకం అని బురదజల్లుతున్నారని ఫైరయ్యారు. 

రైతు ఆత్మహత్యలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
సంక్షోభాన్ని అవకాశంగా తీసుకోవాలన్న చంద్రబాబు మాటలను టీడీపీ అధిష్టానం నుంచి కార్యకర్తల వరకూ తూచా తప్పకుండా పాటిస్తున్నారని బొత్స ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతి విషయాన్ని అవకాశంగా తీసుకొని దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. కరువు, పుష్కరాలు, తుఫాన్, వరదలు ఇలా అన్నింటిని అవకాశంగా మల్చుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే రెయిన్‌గన్స్‌ నుంచి నకిలీ విత్తనాల వరకు తెలంగాణ గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో విధంగా సిట్‌ అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నయీం ఇద్దరు ముగ్గురిని దోచుకుతింటే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని మొత్తం సజీవంగానే పీక్కు తింటుందని దుయ్యబట్టారు. ఏపీలో రైతాంగం ఆత్మహత్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. గత సంవత్సరం పత్తి కొనుగోలులో అనేక అవకతవకలు జరిగాయని, మంత్రులు మధ్యవర్తిత్వం వహించి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని విరుచుకుపడ్డారు. పత్తి రైతులకు అన్యాయం జరిగిందని ప్రతిపక్షం గొంతు చించుకునేలా అరిచినా ఒక్క ఎంక్వైరీ కూడా వేయలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయినా ఇసుక మీద ఒక విధానాన్ని రూపిందించకపోవడం సిగ్గుచేటైన అంశమన్నారు. ఇసుకను ఆదాయ వనరుగా చూపి ఎమ్మెల్యేలను ప్రోత్సహించి ఇప్పుడు శ్రీరంగనీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్టేట్‌మెంట్లకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయి విచారణ జరిపించి నకిలీ విత్తనాలను అరికట్టాలని సూచించారు. వరదల్లో వేలాది ఎకరాల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించాలని, రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న బాబు
ఏపీ సీఎం చంద్రబాబు సమాజాన్ని రెండుగా చీల్చారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసులను, పత్రికలను, అధికారులను బాబు రెండుగా చీల్చారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా మాట్లాడితే కొన్ని పత్రికల్లో వార్తలే రావడం లేదన్నారు. ఆ పత్రికలు బాబు ఆదేశాల ప్రకారమే పని చేస్తున్నాయని విమర్శించారు. జా శ్రేయస్సు కోసం ప్రతిపక్షం చేస్తున్న పోరాటాలను చిన్నవిగా చేసి చూపిస్తున్నాయన్నారు. అధికార పార్టీ వార్తలనే ప్రసారం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. మొత్తం వ్యవస్థను చంద్రబాబు భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతి ఆగడాలను చూపిస్తే లోకేష్‌ ఆ మీడియాకు తన జులుం చూపిస్తున్నారని, ఎంఎస్‌ఓలకు ఫోన్‌ చేసి ప్రసారాలను నిలిపివేస్తున్నారని ధ్వజమెత్తారు. 
 

తాజా వీడియోలు

Back to Top