ఫిరాయింపులపై ప్రైవేటు బిల్లు

  • ఫిరాయింపులపై రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లు
  • పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదు
  • అనర్హత వేటు వేసే అధికారం రాష్ట్రపతికి ఇవ్వాలి

న్యూఢిల్లీః పార్టీ ఫిరాయింపుల నిరోధంపై రాజ్యసభలో వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. రాజ్యాంగ సవరణ బిల్లుగా పేర్కొంటూ ఆర్టికల్ 361( బి) స్థానంలో కొత్త ఆర్టికల్ చేర్చాలని, పదవ షెడ్యూల్ సవరణను బిల్లులో ప్రతిపాదించారు. ఈ బిల్లును నాటి రాజ్యసభ ప్రైవేట్ మెంబర్ కార్యకలాపాలలో చేర్చారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ లోని 6 వ పేరాను సవరించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఫిరాయింపులపై పిటిషన్లపై నిర్దిష్ట కాలపరిమితిలో చైర్మన్ లేదా స్పీకర్  చర్యలు తీసుకొనే విధంగా సవరణ ఉండాలని కోరారు.

రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోళ్లు చేసిన బాబు అనైతిక చర్యలను విజయసాయిరెడ్డి రాజ్యసభలో కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు పచ్చకండువాలు కప్పుకున్న దానిపై స్పీకర్ కు  ఫిర్యాదుచేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సభలో ప్రస్తావించారు. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఏర్పడిన సంక్షోభంపై గురువారం జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు.

అనర్హత వేసే అధికారం రాష్ట్రపతికి ఇవ్వాలి
‘‘అధికార పార్టీ, ప్రతిపక్షాల పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో సాగిన వాగ్యుద్దం మనం ఇప్పటివరకు సభలో చూశాం. ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో కూర్చొనే పరిస్థితి వస్తే ఆ పార్టీ సభ్యులు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతారు. వారే అధికారంలోకి వస్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతారు. ఉభయ సభలు కలిసి ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని తెచ్చాయి. అది సక్రమంగా అమలుకాని పరిస్థితుల్లో 2002లో సవరణ చేసుకున్నాం. కానీ వాస్తవానికి ఏం జరుగుతోంది? ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఫిరాయిస్తే.. అనర్హత వేటు వేయాలని దరఖాస్తు చేసినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధికార పార్టీపక్షానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోనే కాదు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇలాగే జరిగింది. టీడీపీలోకి ఫిరాయించిన మా పార్టీ ఎమ్మెల్యేలు 20 మందిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు..’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అనర్హత వేటు వేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలని, ఈ ప్రక్రియలో రాష్ట్రపతి ఎన్నికల సంఘం సలహా తీసుకోవచ్చని లా కమిషన్ సిఫారసు చేసిందని గుర్తుచేశారు.
 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top