సర్కారు దవాఖానాల ప్రై‘వేటు’!

బాబు జమానాలో వైద్యం హరీ

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాసుపత్రులన్నీ
ప్రైవేటు చేతికి వెళ్లబోతున్నాయి. ఇప్పటికే చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని అపోలో యాజమాన్యానికి
క్లినికల్ అటాచ్‌మెంట్ పేరుతో మూడేళ్లపాటు లీజుకివ్వాలని నిర్ణయించిన చంద్రబాబు ప్రభుత్వం
మరిన్ని ప్రభుత్వాసుపత్రులను కార్పొరేట్ వైద్యసంస్థలకు లీజుకిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది.
నంద్యాల, విజయనగరం జిల్లా ఆసుపత్రులను లీజుకివ్వాలని నిర్ణయించినట్లు
సమాచారం. ఇప్పటికే ప్రభుత్వంతో రెండు కార్పొరేట్ సంస్థలు సంప్రదింపులు జరుపుతున్నాయని,
ఈ రెండు ఆసుపత్రుల తర్వాత కడపజిల్లాలోని ప్రొద్దుటూరు ఆస్పత్రిని కూడా
ప్రవేటీకరించబోతున్నారని వినిపిస్తోంది. చెన్నైకి చెందిన మూడు సంస్థలు ఈ విషయమై ముఖ్యమంత్రి
చంద్రబాబును కలుసుకుని చర్చలు జరిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలంటున్నాయి. మరోవైపు
రాష్ర్టంలోని కార్పొరేట్ వైద్య సంస్థలు కూడా జిల్లా ఆసుపత్రులను లీజుకు తీసుకునే విషయమై
కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం నంద్యాల, విజయనగరం జిల్లా ఆసుపత్రులు
వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ ఆసుపత్రులను క్లినికల్ అటాచ్‌మెంట్
పేరుతో మూడేళ్లపాటు లీజుకిచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రులతో
లీజుకుదిరితే ఆ సంస్థలకు 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున వైద్య కళాశాల
అనుమతి వస్తుంది. ప్రభుత్వం ఆ ప్రైవేటు సంస్థలతో చేసుకున్న అవగాహన ఒప్పందాన్ని భారతీయ
వైద్య మండలి (ఎంసీఐ)కి పంపిస్తారు. పేషెంట్ల సంఖ్యను బట్టి ఎంసీఐ అనుమతినిస్తుంది.
తర్వాత ఆ ఆసుపత్రులు ప్రైవేటు సంస్థల అధీనంలోకి వెళతాయి. ప్రభుత్వాసుపత్రులను ప్రైవేటు
సంస్థలకు ధారాదత్తం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అదే
జరిగితే పేదలకు వైద్యం దూరమవుతుందని, ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని
ప్రతిపక్షాలు కోరుతున్నాయి.

Back to Top