'ప్రతిపక్ష నేత బాధ్యతలు మరచిన చంద్రబాబు'

తిరుపతి, 3 ఫిబ్రవరి 2013: మైనార్టీలో పడిపోయిన కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని పరోక్షంగా మద్దతు ఇస్తూ కాపాడుతున్నది ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే అని వైయస్‌ఆర్‌సిపి సీఈసీ సభ్యురాలు ఆర్‌.కె. రోజా సెల్వమణి విమర్శించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటనతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిందని స్పష్టమైందన్నారు. అయినప్పటికీ చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ఆమె నిలదీశారు.

ఒక పక్కన కిరణ్ ‌ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే అర్హత లేదని విమర్శలు గుప్పిస్తూనే మరో పక్క అవిశ్వాసం పెట్టడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని రోజా అన్నారు. మైనార్టీలో పడిన ప్రభుత్వంపై ప్రజల పక్షాన అవిశ్వాసం పెట్టడం ప్రధాన ప్రతిపక్షం బాధ్యత అని, అయితే, ఆ బాధ్యతను చంద్రబాబు, ఆయన పార్టీ టిడిపి విస్మరించడంపై రోజా నిప్పులు చెరిగారు. ఈ ప్రజా కంటక ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా ఉండటానికి టిడిపి - కాంగ్రెస్‌ పార్టీలు ముమ్మాటికీ మ్యాచ్ ఫిక్సింగ్‌ చేసుకోవడమే కారణం అని రోజా ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని రోజా జోస్యం చెప్పారు. జననేత‌ శ్రీ జగన్‌కు ప్రజలు నీరాజనాలు పట్టి, అధికారం అప్పగించడమూ తథ్యమని ఆమె అన్నారు.
Back to Top