ప్రతి మాతృమూర్తికీ పాదాభివందనం

13–05–2018, ఆదివారం 
మహేశ్వరపురం, పశ్చిమగోదావరి జిల్లా


‘నా బిడ్డ మాట తప్పడు.. ప్రజలకు మంచి చేయాలని తను ఎంచుకున్న మార్గం నుంచి వెనక్కి తిరిగి చూడడు.. వాళ్ల నాన్నలానే పట్టుదల ఉన్న మనిషి.. ప్రజల కోసం పరితపించే మనసున్నవాడు’ అంటూ అమ్మ తరచూ నా గురించి చెప్పే మాటలు ఈ రోజు బాగా గుర్తొచ్చాయి. ఈ వేళ నేనిలా వేస్తున్న అడుగుల వెనుక అమ్మ ఆశీర్వాదబలం ఎంతో.

పాదయాత్ర 2,000 కిలోమీటర్ల మైలురాయికి చేరువవుతున్న సందర్భంగా.. నన్ను దారి వెంబడి కలిసి తమ కష్టసుఖాలు చెప్పుకొన్న అమ్మలందరూ గుర్తొచ్చారు. నన్ను కన్నబిడ్డలా ఆదరిస్తూ.. అడుగడుగునా ఆప్యాయతలు పంచుతూ.. మరిచిపోలేని అమ్మతనపు జ్ఞాపకాలనిచ్చిన ప్రతి మాతృమూర్తికీ పాదాభివందనం. ఆ అమ్మలందరికీ మనసులో మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుని.. ఈ రోజు పాదయాత్రను ప్రారంభించాను.

తాగునీరు లేని కన్నీటి కథలు, ఉపాధి కోల్పోయిన మత్స్యకారుల వెతల మధ్య ఈ రోజు పాదయాత్ర సాగింది. కంపుకొడుతున్న, రంగుమారిన నీళ్లను బాటిళ్లలో పట్టుకొచ్చి ‘సార్‌.. ఈ నీళ్లను ఎలా తాగమంటారు? ఇదీ.. మా దారిద్య్రం’ అంటూ దెయ్యంపాడు దగ్గర కలిసిన మహిళలు బాధపడ్డారు. ‘కాలువల ద్వారా మంచినీళ్లు రావు.. బోర్లు వేస్తేనేమో ఉప్పునీరు. గొంతెండిపోతున్నా గుక్కెడు నీళ్లు నోట్లో పోసుకోలేని పరిస్థితి. మంచినీళ్లు దొరికిన రోజు మాకు పండగ రోజే.

ఈ కలుషిత నీళ్లు తాగి బీపీలు, కిడ్నీ జబ్బులు, చర్మవ్యాధుల బారినపడుతున్నాం’ అంటూ అక్కడి బతుకుచిత్రాన్ని పట్టిచూపారు. మరికాస్త దూరం పోగానే చంటి బిడ్డలను చంకనేసుకొచ్చిన నలుగురైదుగురు అక్కచెల్లెమ్మలు నన్ను చూడగానే భోరుమని విలపించారు. ‘అన్నా.. కొల్లేరు దుస్థితితో పాటే మా జీవితాలూ నాశనమైపోయాయి. మా బిడ్డల బతుకులు మాలాగ కాకూడదు’ అంటూ కన్నీటి కష్టాలు చెప్పుకొచ్చారు. వారిలో ఓ చెల్లెమ్మ ‘అన్నా.. నేను బాగా చదువుకునేదాన్ని. కొల్లేటి సమస్యలతో అన్ని కష్టాలూ నెత్తినపడ్డాయి. ఈ పాలకుల నిర్లక్ష్యంతో మా జీవితాలు దెబ్బతిన్నాయి. నన్ను చదివించలేక చిన్న వయసులోనే పెళ్లి చేసేశారు. చదువుకోవాలనే ఆశ కూడా కొల్లేరులానే ఎండిపోయింది’ అంటూ కన్నీటి బతుకును కళ్లకు కట్టింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంచినీటి సరస్సు ప్రాంతంలో జీవిస్తున్నా.. గుక్కెడు మంచినీరందని వారి పరిస్థితి ఎంతో దయనీయం. వారికి తాగునీరు అందించని ఈ పాలకుల నిర్లక్ష్యం క్షమార్హం కాని నేరం. 

దారిలో కలిసిన మత్స్యకారులు.. ‘ఒకప్పు డు కొల్లేరంటే మమ్మల్ని బతికించే తల్లిలా ఉం డేది. ఆ గంగమ్మ ఒడిలో చేపలు పట్టుకుని హాయి గా జీవించేవాళ్లం. వేలాది మైళ్ల నుంచి విదేశీ పక్షులు ఇక్కడికి వలస వస్తాయి. కానీ ఈ రోజు బతుకుదెరువు కోసం ఇక్కడి మత్స్యకారులు సుదూర ప్రాంతాలకు వలసపోయే దుస్థితి దాపురించింది’ అని ఆవేదన వ్యక్తంచేశారు. మా బతుకులబాగు.. మీ లాంటి పట్టుదల గల పాలకుడితోనే సాధ్యం. అందుకే ఆ రోజుల కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చా రు. వారి దయనీయ పరిస్థితిని చూశాక వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న నా సంకల్పం మరింత దృఢపడింది.  

రాష్ట్రానికే తలమానికమైన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబుగారు భ్రష్టుపట్టించి, అవినీతి కూపంగా మార్చి, పోలవరాన్ని తమ పాలిట శాపంగా మార్చాడంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు నన్ను కలిసిన నిర్వాసితులు, గిరిజనులు. ఈ ప్రాజెక్టు కోసం కన్నతల్లి లాంటి గ్రామాలను సైతం వదులుకుని సర్వం త్యాగం చేసిన నిర్వాసితులను, అమాయక గిరిజనులను సైతం నేటి పాలకులు తమ అవినీతి కాష్టంలో సమిథల్ని చేయడం అమానుషం. గత నెల 14వ తేదీన కృష్ణమ్మ వారధిపై జనప్రకంపనలతో కృష్ణా జిల్లాలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర.. నేడు అదే జనప్రభంజనంతో కొల్లేరు వంతెన మీదుగా పశ్చిమగోదావరిలోకి ప్రవేశించింది. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. పట్టిసీమతో రాయలసీమకు నీళ్లిస్తున్నామనడం ప్రగల్భాలు కాదా? పక్కనే ఉన్న కొల్లేటి ప్రాంత ప్రజలకు తాగునీరు ఇవ్వలేకపోవడం మీ అసమర్థత కాదా? పట్టిసీమ నీళ్లు స్టోరేజ్‌లేక.. ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదలడం వాస్తవం కాదా? దీనికి కారణం మీరు కాదా?
- వైఎస్‌ జగన్‌


తాజా ఫోటోలు

Back to Top