ప్రణబ్ జీ! జోక్యం చేసుకోండి!!

న్యూఢిల్లీ, జనవరి 15, 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీలో రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీని కలిశారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన 'జగన్ కోసం జనం సంతకం' కార్యక్రమంలో సేకరించిన సుమారు రెండు కోట్ల సంతకాలను ఆమె రాష్ట్రపతికి అందజేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి అరెస్టు తదుపరి పరిణామాలపై ఆమె నాలుగు పేజీల లేఖను కూడా ఆయనకు అందించారు. శ్రీమతి విజయమ్మ రాష్ట్రపతికి సమర్పించిన లేఖ పూర్తిపాఠం.


మాన్యులు శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి,

 
     ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రెండు కోట్ల మంది ప్రజలు చేసిన విన్నపాన్ని మీముందు ఉంచేందుకు అవకాశమిచ్చినందుకు మొదటగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

     మా పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏడున్నర నెలల క్రితం అరెస్టుచేసిన నాటినుంచి సీబీఐ విచారణ పేరిట ఏవిధంగా మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నదనే దానికి ఆంధ్ర ప్రదేశ్ మొత్తం  సాక్షీభూతంగా నిలుస్తోంది. శ్రీ జగన్మోహన్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ సుమారు రెండు కోట్ల మంది ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు.  సీబీఐ సాగిస్తున్న ఈ అక్రమ నిర్బంధ వ్యవహారంలో తమరు దయతో జోక్యం చేసుకుని న్యాయం చేకూరేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం.

     దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కొన్ని కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించారనీ, ఇందుకు ప్రతిగా ఆయా సంస్థలు శ్రీ జగన్మోహన్ రెడ్డి సంస్థలలో పెట్టుబడులు పెట్టాయనీ సీబీఐ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో శ్రీ జగన్మోహన్ రెడ్డి కొనసాగినంతకాలం ఆయననూ, తండ్రి డాక్టర్ రాజశేఖరరెడ్డినీ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో గౌరవనీయులుగా పరిగణించారు. డాక్టర్ రాజశేఖరరెడ్డి దుర్మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలను ఓదారుస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు  శ్రీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. తక్షణమే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావు  రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని వేశారు.  టీడీపీ కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తదుపరి ఈ పిటిషనును శంకరరావు వేసిన పిల్‌కు జతచేశారు. పిల్ వేసిన వెనువెంటనే శంకరరావును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు.


     ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న శ్రీ జగన్మోహన్ రెడ్డిని విచారింపజేయడానికీ, బలి చేయడానికీ రాష్ట్రంలో పాలక, ప్రతిపక్షాలు కుమ్మక్కయ్యాయి.


     వివిధ మంత్రిత్వ శాఖలు విడుదల చేసిన జీఓల అంశంలో కొందరికి ప్రయోజనం చేకూర్చడానికి నిబంధనల అతిక్రమించారా అనేది విచారించడం మాని, సీబీఐ శ్రీ జగన్మోహన్ రెడ్డిని వేటాడింది. ఆయన కంపెనీలలోకి వచ్చిన పెట్టుబడులపై విచారణ చేపట్టింది. ఊహకు కూడా అందని విధంగా 28 బృందాలతో సీబీఐ జగన్మోహన్ రెడ్డి కంపెనీలపైనా.. పెట్టుబడులు పెట్టిన వారిపైనా దాడులు నిర్వహించింది. తక్షణం శ్రీ జగన్మోహన్ రెడ్డిపై ప్రాథమిక సమాచార పత్రాన్ని(ఎఫ్ఐఆర్)ను కూడా నమోదు చేసింది.


     గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న మీకు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంవత్సరాలుగా తెలుసు. ఆయన పార్టీకి స్తంభంలా నిలిచి దశాబ్దాల తరబడి బలోపేతానికి కృషి చేశారు. అంతిమ శ్వాస విడిచేంతవరకూ దేశానికి సేవచేశారు. డాక్టర్ వైయస్ఆర్‌ది చిత్తశుద్ధి గల వ్యక్తిత్వం. నిరంతరం పేదల సంక్షేమానికీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికీ కృషిచేశారు. ఇచ్చిన మాటమీద నిలబడ్డారు. మడమ తిప్పని నైజం డాక్టర్ వైయస్ఆర్ సొంతం.


     దివంగత మహానేత ఏనాడు పరిపాలనపరమైన విధానాలూ, ప్రభుత్వ సిద్ధాంతాలను ఏనాడూ తోసిరాజన లేదు. మన మధ్యలేని డాక్టర్ వైయస్ఆర్‌పై సీబీఐ బురదజల్లడం తగదు. వైయస్ఆర్ క్యాబినెట్ జారీ చేసిన జీఓలు అన్నీ సక్రమమైనవైనపుడు ఆయనపై కక్షపూరితంగా వ్యవహరించడం సీబీఐకి తగదు. 26 జీవోలపై స్పందించాలని సుప్రీం కోర్టు కోరినపుడు వాటి జారీ సక్రమమేనని ప్రభుత్వం నిర్థారించిన విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నాను. ఇదే అంశాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంగీకరించారు. డాక్టర్ వైయస్ఆర్ క్యాబినెట్ 26 జీఓల విషయంలో సక్రమంగానే వ్యవహరించిందని చెప్పారు. మరి అలాంటపుడు క్విడ్ ప్రోకోకు తావెక్కడిది.? శ్రీ జగన్మోహన్ రెడ్డిని కస్టడీలో ఎందుకు ఉంచారు.?
 

     వైయస్ఆర్ హయాంలో లబ్ధిపొందిన వారెవరో తెలుసుకోవాలని సీబీఐ తన విచారణలో ప్రయత్నించింది. శ్రీ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారు వారివారి షేర్ సర్టిఫికెట్లను అందుకున్నారు. అంతేకాకుండా తమ ఇష్టానుసారం వాటిని అమ్ముకునే అవకాశమూ వారికుంది. షేర్లను అందరికీ ఒకే ధరకు అందుబాటులో ఉంచారు. షేర్ల ద్వారా మొత్తం సొమ్ము ఒకేసారి శ్రీ జగన్ కంపెనీలలోకి రాలేదు. నాలుగైదు సంవత్సరాలలో ఆ సొమ్ము అందింది. డాక్టర్ వైయస్ఆర్ మరణించిన ఏడాది అనంతరం కూడా అదే రేటుకు పెట్టుబడులు పెట్టారు.   

     వాస్తవానికి జగతి పబ్లికేషన్సు, జనని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీల విలువ పోటీ సంస్థల కంటే చాలా తక్కువ. సాక్షి దినపత్రికను నడుపుతున్న జగతి పబ్లికేషన్సు విలువ ఈనాడు, మరో ప్రాంతీయ పత్రిక కంటే సగం తక్కువ.

     పెట్టుబడిదారులెవరూ ఫిర్యాదు చేయకుండా ఒక వ్యక్తి నడుపుతున్న వ్యాపారంలోకి చొచ్చుకురావడానికి ప్రభుత్వానికి ఏం హక్కుంది. ప్రైవేటు వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలపై దర్యాప్తు చేయలేమని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఇటీవలే చెప్పిన విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌పై చేపట్టిన దర్యాప్తును సుప్రీం కోర్టు ఇటీవలే అడ్డుకుంది. ప్రభుత్వ సంబంధిత సంస్థల్లో ఆమె ఉద్యోగి కానీ, బాధ్యతగానీ లేకపోవడమే దీనికి కారణమని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ కారణంగా సీబీఐ డింపుల్ యాదవ్ అంశంలో విచారణ చేపట్టలేకపోయింది.


    సీబీఐ విచారణ చేపట్టిన కాలంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో భాగస్వామి కారు. ఆయన ప్రైవేటు వ్యక్తి. ఆయన ఆ సమయంలో బెంగళూరులో నివసిస్తున్నారు. ఒక మంత్రితో కానీ, ఐఏఎస్ అధికారితో కానీ మాట్లాడలేదు. ఒక్కసారికూడా సెక్రటేరియట్‌లోకి కానీ, ముఖ్యమంత్రి కార్యాలయంలో గానీ కాలు పెట్టలేదు. శ్రీ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన సొమ్ము ఆయన చేతుల్లోకి రాలేదు. ప్రాజెక్టుల్లోకి వెళ్ళాయి. శ్రీ జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులతో పాటు అవి ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. ఆ కంపెనీలు... ఆర్థిక రంగానికి ఊతమియ్యడమే కాక, ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 30వేలకు పైగా కుటుంబాలకు ఉపాధిని కల్పించాయి. భారతి సిమెంట్సు కంపెనీనిలో మెజార్టీ షేర్లను ఫ్రెంచ్ సిమెంట్సుకు అమ్మిన సమయంలో పెట్టుబడిదారులు మిగిలిన కంపెనీలలో పెట్టుబడికంటే రెట్టింపు మొత్తాన్ని అందుకున్నారు.  


    ఇండియన్ రీడర్‌షిప్, ఏబీసీ సర్వేల ప్రకారం జగతి పబ్లికేషన్సు కింద నడుస్తున్న సాక్షి దినపత్రిక దేశంలోనే ఎనిమిదో స్థానంలో ఉందని తేలింది. సాక్షి దినపత్రిక ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 20వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది.

     న్యాయ వ్యవస్థ ముందు అందరు సమానులుగా పరిగణించే భారత్ లాంటి దేశంలో వ్యక్తిగత స్వేచ్ఛ, రక్షణ, స్వాతంత్యాన్ని కల్పించిన చట్టం ఉన్న చోట ఓ వ్యక్తి దగ్గరదగ్గరగా ఎనిమిదినెలల పాటు ఎటువంటి అభియోగాలు, ఆధారాలూ  లేకుండా, జైలులో గడపాల్సిరావడం తీవ్రంగా గర్హించాల్సిన అంశం. అరెస్టు చేసిన 90 రోజులలోగా విచారణ పూర్తికాకపోయినా బెయిలు ఇవ్వాలని చట్టం స్పష్టంగా పేర్కొంటోంది.


     బెయిలు కోసం ఎప్పుడు కోర్టుకు వెళ్ళినా శ్రీ జగన్మోహన్ రెడ్డి ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడు, లోక్ సభ సభ్యుడూ అయినందున సాక్ష్యాలను తారుమారు చేస్తారనీ, సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ చెబుతోంది. ఇదే కేసులో మంత్రులకు  బెయిలు అంశంలో సీబీఐ వ్యతిరేకించలేదు. అధికారంలో లేని శ్రీ జగన్మోహన్ రెడ్డి కంటే వారు అన్ని రకాలుగానూ బలవంతులు. వారు సాక్ష్యాలను తారుమారుచేయలేరా? 26 జీఓల అంశం మూడు నుంచి అయిదేళ్ళ కాలం నాటిది. ఇలాంటి అంశంలో సాక్ష్యాలను తారుమారు చేసే ప్రశ్న  ఎక్కడ తలెత్తుతుంది.

     ఈ అన్యాయాన్ని మీరు మీ అధికారాలను ఉపయోగించి సరిదిద్దుతారనే ఆశతో ఆంధ్రప్రదేశ్ లోని రెండు కోట్లమంది ప్రజలు 'జగన్ కోసం' సంతకాలు చేశారు. శక్తిమంతమైన మీ జోక్యాన్ని వారు కోరుతున్నారు. ప్రసిద్ధికెక్కిన మన దేశంలో ఇలాంటి అన్యాయం ఇకపై ఒక్కరోజుకూడా చోటుచేసుకోవడానికి వీల్లేదని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం.

మీ విశ్వసనీయులు

శ్రీమతి వైయస్ విజయమ్మ

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే

Back to Top