<strong>పెనమలూరు (కృష్ణా జిల్లా)</strong>, 31 మార్చి 2013: అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను వేధించుకు తిన్నారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి కూడా బాబు బాటలోనే నడుస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల పట్ల ఈ ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తుంటే నిలదీయాల్సిన చంద్రబాబు చూసీ చూడనట్లుగా డ్రామాలాడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్ సమస్యలు, ధరల పెరుగుదల, పంటలకు గిట్టుబాటు ధర లేక అనేక కష్టాలతో ప్రజలు అల్లాడుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై శ్రీమతి షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. మరో ప్రజా ప్రస్థానం 107వ రోజు పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పరిధిలోని మంటాడలో ఆదివారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో శ్రీమతి షర్మిల స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుని అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు.<br/>ప్రజలను అష్టకష్టాలు పెడుతున్న ఈ ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాసం పెడితే దీన్ని కూలిపోనివ్వకుండా నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు కాపాడారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. ప్రజల బాగోగుల గురించి చంద్రబాబు ఏ రోజునా ఆలోచన చేయలేదని అన్నారు. ఇప్పటి కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం కరెంటు సరఫరా చేయడంలేదు గాని బిల్లులు మాత్రం రెట్లకు రెట్టు వేసి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు రూ.32 వేల కోట్ల బిల్లులు వేశారని, మళ్ళీ రేపటి నుంచి మరో రూ. 6,500 కోట్లు అదనంగా బిల్లులు వేస్తారట అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. జగనన్న వస్తే కష్టాలన్నీ తీరతాయని భరోసా ఇచ్చారు.<br/>అంతకు ముందు స్థానికులు శ్రీమతి షర్మిల ముందు సమస్యలు చెప్పుకున్నారు. రాష్ట్రానికి మంచి రోజులు లేకే మహానేత వైయస్‌ఆర్ మరణించారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. జగనన్న వస్తేనే అన్నదాతల ఇంట పండుగ అని వారు అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రెండు గంటలు ఉండడంలేదని, దీనితో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. రెండు గంటలే విద్యుత్ ఇస్తే ఇక పొలం ఏ విధంగా తడుస్తుందని, పంట ఎలా పండుతుందని వారు ప్రశ్నించారు. కాల్వల్లో నీళ్ళు లేవని, తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి నెలకొన్నదని విచారం వ్యక్తం చేశారు. బోర్లు రోజుకు రెండు గంటలకు మించి నడవడంలేదని, చెరకు పంట రోజుకు ఐదు, పది సెంట్లకు మించి తడవడంలేదని చెప్పారు. వడ్డీ మాఫీ అమలు కావడంలేదన్నారు. సరైన విత్తనాలు దొరకక అనేక కష్టాలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు నాయుడి హయాంలో ఉన్నట్లుగానే ఇప్పటి ప్రభుత్వ హయాంలోనూ రాష్ట్రంలో దురవస్థ ఉందని విలపించారు.