ప్రజలను హింసిస్తున్న పాపం ఈ ప్రభుత్వానిదే!


పెన్నా అహోబిలం

1 నవంబర్ 2012 : రైతులను హింసించిన చంద్రబాబు బాటలోనే కిరణ్ ప్రభుత్వం కూడా నడుస్తోందని షర్మిల విమర్శించారు. ప్రజలను ఇంతగా కష్టపెడుతున్న ఈ పాపం ప్రభుత్వానిదేనని ఆమె నిందించారు. శుక్రవారం 16వ రోజు పాదయాత్రలో భాగంగా ఉరవకొండ నియోజకవర్గంలోని పెన్నా అహోబిలం, రాకెట్ల గ్రామాల్లో మహిళలతో షర్మిల మాట్లాడారు
వైయస్ఆర్ మంచి పనులను చూసి కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆయన పోయిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని షర్మిల విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వైయస్ఆర్‌ను గౌరవించే పని ఒక్కటి కూడా చేయలేదని ఆమె అన్నారు. వైయస్ఆర్ ఉచిత విద్యుత్తు తొమ్మిదిగంటలు ఇస్తామని ప్రకటిస్తే, ఈ ప్రభుత్వం కనీసం రెండుమూడు గంటలు కూడా ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు.
"రాజశేఖర్ రెడ్డిగారు కరెంటుకు బిల్లులే వేయనన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం గడచిపోయిన మూడేళ్లకి సర్‌చార్జ్‌లని కొత్త బిల్లులు వేస్తోందంట. ఉపాధి హామీ పథకం రాజశేఖర్ రెడ్డిగారున్నప్పుడు ఎంత బాగా జరుగుతుండిందో! వందా నూటిరవై వస్తుండేది. కానీ ఇప్పుడు పనికి పనికి రెట్టింపైంది. వేతనాలకు వేతనాలు సగమైనాయి. అంటే మీరు పని ఎక్కువ చేయాల. యాభై రూపాయలకే చెయ్యాల. ఇది చాలా అన్యాయం. రాజశేఖర్ రెడ్డిగారున్నప్పుడు మీకు రుణాలు బ్రహ్మాండంగా వస్తుండేవి. ఇప్పుడు రావడంలే. రాజశేఖర్ రెడ్డిగారున్నప్పుడు పెన్నాబ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు తప్పకుండా పది టిఎంసిలు నీళ్లివ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అలా ఇవ్వకపోతే ఇక్కడ సాగునీరు కాదు కదా, తాగునీరు కూడా ఉండదనీ, మీ బోర్లన్నీ ఎండిపోతాయని రాజశేఖర్ రెడ్డిగారు ప్రతి ఏడాదీ నీళ్లివ్వాలని ఉత్తర్వులు కూడా ఇచ్చినారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఆ ఉత్తర్వులను పట్టించుకోవడం లేదు. నీళ్లివ్వకపోవడం వల్ల మీ చెరువులన్నీ ఎండిపోతున్నాయి. మీ బోర్లు, పొలాలు ఎండిపోతున్నాయి. ఇంత కష్టం..ఇంత పాపం ఈ ప్రభుత్వానిదే. కక్ష కట్టుకుని చేస్తోంది" అని షర్మిల దుయ్యబట్టారు.
బాబు హయాంలో ఎవరైవా చనిపోతేనే కొత్త పింఛను వచ్చేదనీ, అది కూడా మూడు నెలలకొకసారేననీ ఆమె గుర్తు చేశారు. కానీ రాజశేఖర్ రెడ్డిగారు అర్హులైనవారందరికీ పింఛన్లు ఇచ్చారని ఆమె చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు వచ్చినప్పుడు కూడా కరెంటు బిల్లులు పెంచారు. అన్ని చార్జీలను పెంచారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే పని చేస్తోంది. రైతన్నను ఎంతగా హింసించగలరో అంతగా హింసిస్తున్నారు. పిల్లలకు స్కాలర్‌షిప్పులు లేవు. ఆరోగ్యశ్రీ లేదు. కుయ్..కుయ్...కుయ్ అని వస్తుండే 108 కూడా రావడం లేదు." అని షర్మిల వ్యాఖ్యానించారు. బాబు బాటలోనే కిరణ్ ప్రభుత్వం కూడా నడుస్తోందని ఆమె విమర్శించారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, టిడిపిలకు బుద్ధి చెప్పాలని ఆమె పిలుపు ఇచ్చారు.

Back to Top