ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి

హైదరాబాద్ 22 ఫిబ్రవరి 2013:

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ళ ఘటనలో ముఖ్యమంత్రి అవగాహన లోపం, కేంద్ర హోంమంత్రి అనుభవరాహిత్యం వెల్లడయ్యాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి తన వైఫల్యానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశం పూర్తి పాఠం...
పేలుళ్ళ సంఘటనను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని  మైసూరారెడ్డి చెప్పారు. ఇదొక ఘోర కలి, ఘాతుక చర్యని పేర్కొన్నారు. బలహీన వ్యక్తులు, బలహీన సంస్థలు ప్రభుత్వాన్ని దొంగచాటుగా దెబ్బతీయాలనే లక్ష్యంతో ఈ చర్యకు పాల్పడ్డాయన్నారు. కానీ ఇలాంటి సంఘటనల వల్ల పోతున్నది అమాయకుల ప్రాణాలేనని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.   ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఎంత కఠిన చర్యలు చేపట్టినా తమ పార్టీ సమర్థిస్తుందని చెప్పారు. దర్యాప్తు వేగంగా పూర్తిచేసి నిందితులను పట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

     ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత.. సందర్శన, పరామర్శలు తప్ప.. గుణపాఠం నేర్చుకోవడమో, తగిన చర్యలు తీసుకోవడమో చేయడం లేదన్నారు. ముంబయిలో పేలుళ్ళ తర్వాత అలాంటివి పునరావృతం కాకుండా ఉండడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అనే సంస్థను కేంద్రం నెలకొల్పిందనీ, అది ఇంతవరకూ సమర్థంగా పనిచేసిన దాఖలాలు కనిపించడంలేదనీ విమర్శించారు. టెర్రరిస్టు గ్రూపుల కార్యకలాపాలను పరిశీలించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి సునిశితంగా వ్యవహరించి ఉంటే ఇలాంటి చర్యలకు ఆస్కారం ఉండి ఉండేది కాదన్నారు.  సంస్థ ఏర్పాటైన తర్వాత 25వేల కేసులను అప్పగించారనీ, ఇందులో ఉగ్రవాద సంబంధిత కేసులు మూడు మాత్రమేననీ, వాటిలో కూడా ఏమాత్రం పురోగతి సాధించలేదనీ మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు.

     మన రాష్ట్రంలో ఉగ్రవాద చర్యల నిరోధానికి 2011 ఆగస్టులో ప్రారంభించిన ఆక్టోపస్ సంస్థ అంతంతమాత్రంగానే పనిచేస్తోందని పేర్కొన్నారు. 2012లో కార్యాలయాన్ని ప్రారంభించారనీ, కానీ పదిశాతం కూడా సిబ్బందిని కూడా నియమించలేదని తెలిపారు.

సీఎం అవగాహన రాహిత్యానికి పరాకాష్ఠ


     నిన్నటి పేలుళ్ళ అనంతరం, దీనివెనుక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ విడిచిపెట్టమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి పరాకాష్టని డాక్టర్ మైసూరా రెడ్డి చెప్పారు. ఇలాంటి పనులు చేసేవారు పెద్ద వ్యక్తులు కాదు.. చాలా చిన్నవారుంటారన్నారు. ఈ సమాచారం తనకు రెండు రోజుల క్రితమే తెలుసునని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. సమాచారం తెలిసుంటే ముఖ్యమంత్రి తన ఆధ్వర్యంలో ఉన్న అక్టోపస్‌ను సమావేశపరిచారా లేదా అని ప్రశ్నించారా, పరిస్థితుల్ని సమీక్షించారా, వారికేమైనా ఆదేశాలు జారీచేశారా  అని నిలదీశారు. కసబ్, అఫ్జల్ గురులను ఉరితీసిన అనంతరం అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయని సామాన్య ప్రజానీకం కూడా ఊహించిందన్నారు. కేంద్రం నుంచి మీకు ఓ సమాచారం ఉన్నప్పుడు దాని నివారణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారని ముఖ్యమంత్రిని ఆయన ప్రశ్నించారు. చర్యలు తీసుకుని ఉంటే అవేంటి ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అక్టోపస్ అనే సంస్థ ఉందనీ, అది ఇలాంటి సంఘటనలకు ఉద్దేశించిందేనన్న అవగాహన లేదనే విషయం ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో స్పష్టమైందన్నారు.


రెండ్రోజుల ముందే సమాచారముంటే ఏంచేశారు

     దాడులు చోటుచేసుకునే సమాచారం ఉందని రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపామని కేంద్ర హోం మంత్రి షిండే చెప్పారనీ, ఎన్ఐఏ మీ ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడు ఈ సమాచారంపై ఎటువంటి చర్యలు చేపట్టారని ఆయనను నిలదీశారు. ఈ తరహా సమాచార సేకరణకు నటా గ్రిడ్‌ను నెలకొల్పారన్నారు. అది పూర్తిగా ఏర్పాటు కాలేదు. కానీ 2011 నాటికి చట్టాన్ని రూపుదిద్దారు. ఇప్పటివరకూ దీనిపై చట్టం ఎందుకు చేయలేదనీ ప్రశ్నించారు. రా, ఇంటిలిజెన్సు సంస్థలు అందించిన సమాచారాన్ని రాష్ట్రాలకు పంపేటప్పుడు అది నిర్దిష్టంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అలాకాకుండా మొక్కుబడి పనుల వల్ల పరిస్థితులు దారుణంగా మారతాయనడానికి హైదరాబాద్ పేలుళ్ళే తార్కాణమన్నారు. బాధ్యతలనుంచి తప్పించుకోవడానికే ఇటువంటి ప్రకటనలు పనికొస్తాయని పేర్కొన్నారు. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కిందికే వస్తుందని ఆయన స్పష్టంచేశారు. హోంమంత్రిగా షిండ్ తగరని స్పష్టంచేశారు. ఆయన అవగాహనరాహిత్యానికీ ఇది నిదర్శనమన్నారు. ఐబీ రాజకీయ నాయకులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు మాత్రమే ఉపయోగిస్తోందన్నారు.

     పేలుళ్ళకు కొద్ది నిముషాల ముందే నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ అక్కడికి సమీపంలోని సాయిబాబా ఆలయం నుంచి వెళ్ళడం ఆయన అదృష్టాన్ని సూచిస్తోందన్నారు. జంట నగరాల ప్రజలను కాపాడాల్సిన బాధ్యత కమిషనరుదే. అలాంటాయనే అక్కడికొచ్చినప్పుడు ఆ ప్రాంతంలో పోలీసులు భద్రతా చర్యలు తీసుకుని ఉంటే ఈ సంఘటన జరిగేదే కాదన్నారు. ఆటోలకు జరిమానాలు, మద్యం తాగిన వారినుంచి మామూళ్ళు వసూలు వంటివి చేపడుతున్నారనే తప్ప  ప్రధానమైన సంఘటనలపై దృష్టి సారించడం లేదని చెప్పారు. అలాంటప్పుడు ఈ పోలీసు యంత్రాంగం ఎందుకని అడిగారు. సహకార సంఘాల ఎన్నికల్లో ప్రభుత్వం చెప్పిన వారికి అనుకూలంగా వ్యవహరించడానికే పోలీసులు ఉన్నారా అని కూడా ప్రశ్నించారు. రాజకీయులకు అడుగులకుమడుగులొత్తేందుకేనా పోలీసులున్నదన్నారు. సామాన్య ప్రజలను ఆదుకోవడం అందరూ చేస్తారన్నారు. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా చూడాల్సిన పని లేదా అని అడిగారు. ఈ సంఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసి చర్యలు చేపట్టాలని డాక్టర్ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు.

తాజా ఫోటోలు

Back to Top