ప్రజలకు ప్రభుత్వం‌ మాయహస్తం

హైదరాబాద్, 1 మే 2013: అమ్మహస్తం పేరుతో కిరణ్‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మాయ హస్తం చూపిస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నిప్పులు చెరిగారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆమె దుయ్యబట్టారు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్నారు. అందుకే ఆయన వేటి మీదా చార్జీలు, పన్నులు పెంచకుండా రాష్ట్రాన్ని పాలించారన్నారు. జగన్‌బాబు నేతృత్వంలో త్వరలోనే సువర్ణయుగాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. జగన్‌బాబు అధికారంలోకి వస్తే మనందరికీ మంచిరోజులు వస్తాయని శ్రీమతి విజయమ్మ భరోసా ఇచ్చారు. సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట కమ్యూనిటీ హాలు వద్ద బుధవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె స్థానికుల నుంచి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీమతి విజయమ్మ ప్రశ్నలు వేసి, స్థానికుల నుంచి సమాధానాలు తెలుసుకున్నారు. ప్రశ్న - సమాధానం విధానంలో ఈ రచ్చబండ కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు.

ప్రజల సంక్షేమం పట్టని ప్రభుత్వ విధానాల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సంక్షేమ పథకాలు అర్హుల దరి చేరడంలేదని, తాగునీరు, పారిశుధ్యం, కరెంటు కోత వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న జనానికి బాసటగా నిలిచేందుకు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తరఫున శ్రీమతి విజయమ్మ ఈ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు ఎలా కొనసాగుతున్నాయో స్వయంగా తెలుసుకునేందుకే మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని శ్రీమతి విజయమ్మ తెలిపారు. రచ్చబండ కార్యక్రమంలో ప్రజలు చెప్పిన సమస్యలను జగన్‌బాబుకు చెప్పి ఆయన అధికారంలోకి రాగానే పరిష్కరించేలా చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

అమ్మహస్తం పథకంలో ఇచ్చే 100 గ్రాముల ఉప్పు, కారం, పసుపు కుటుంబానికి ఎన్నిరోజులు వస్తాయని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. కిలో ఇవ్వాల్సిన చక్కెర, కందిపప్పును అరకిలో ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. నాలుగు లీటర్లు ఇచ్చే కిరోసిన్‌ రెండు లీటర్లే ఇస్తే ఎలా సరిపోతుందని అన్నారు. పింఛన్లు సరిగా ఇవ్వడంలేదని, వికలాంగులకు రాష్ట్రమంతటా తీసేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరోగ్యశ్రీ సరిగా అందడంలేదని, కార్డులు పక్కన వేస్తున్నారని ప్రజలంతా చెబుతున్నారన్నారు. 108 వాహనాల సేవలు సరిగా అందడంలేదన్నారు. వడ్డీ లేని రుణాలిస్తున్నామని సిఎం కిరణ్‌ గొప్పగా చెబుతున్నప్పటికీ లక్షకు రూ. 30 వేలు వడ్డీగా వసూలు చేస్తున్నాకని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారన్నారు.

ఈ ప్రభుత్వం విద్యుత్‌ వినియోగదారులపై రూ. 32 వేల కోట్ల ఆర్థిక భారాన్ని వేస్తోందని శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తంచేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయన్నారు. మహానేత వైయస్‌ ఉంటే ఇప్పుడు కుటుంబానికి 30 కిలోల బియ్యం ఇచ్చేవారన్నారు. ఒక్క కోత్త రేషన్‌కార్డు కానీ, ఇల్లు కాని ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. పింఛన్లు కూడా సరిగా అందడంలేదని అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ మంచి జరిగేలా చూస్తానని శ్రీమతి విజయమ్మ హామీ ఇచ్చారు. మహానేత వైయస్‌ చేసిన పథకాలన్నింటినీ జగన్‌బాబు అమలు చేస్తారని భరోసా ఇచ్చారు. అమ్మ ఒడి పేరుతో జగన్‌బాబు కేజీ నుంచి పీజీ వరకూ ఉచితంగా విద్యను అందిస్తారని, పిల్లలను పాఠశాలకు పంపించే తల్లులకు ప్రోత్సాహకంగా ఖాతాలో డబ్బులు వేస్తారని చెప్పారు. వృద్ధులు, వితంతువులకు రూ.700 పింఛన్‌ ఇస్తారని, వికలాంగులకు వెయ్యి రూపాయలు ఇస్తారని చెప్పారు. జగన్‌బాబు అధికారంలోకి వస్తే ముస్లిం మైనార్టీల రిజర్వేషన్లు అమలు చేస్తారన్నారు.

అంతకు ముందు రచ్చబండకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అడ్డగుట్ట మురికివాడల ప్రజలు తమ సమస్యలను శ్రీమతి విజయమ్మ ముందు ఏకరువు పెట్టారు. వడ్డీలేని రుణాలు రావడంలేదని, రుణాల గురించి తాము నిలదీస్తామని సమావేశాలకు తమను రానివ్వడంలేదని కొందరు తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రికి వెళితే తమను బయటికి గెంటేస్తున్నారని, కరెంటు ఇవ్వకుండానే భారీగా బిల్లులు మాత్రం వసూలు చేస్తున్నారని ఆరోపించారు. స్కాలర్‌షిప్‌లు, మంచినీళ్ళు రావడంలేదన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో తాము ఎలా బతకాలని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్‌ అందడంలేదని కొందరు చెబుతూ.. నాలుగేళ్ళుగా కార్యాలయా చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని ఓ వృద్ధురాలు విలపించింది. అమ్మ హస్తంలో సరుకులు సక్రమంగా ఇవ్వడంలేదని కొందరు ఫిర్యాదు చేశారు.

కిలో రూపాయికి ఇచ్చే బియ్యం మనుషులెవరైనా తినగలరా అని కొందరు మహిళలు ముక్కిపోయిన, పురుగులు పట్టిన బియ్యాన్ని తీసుకువచ్చి చూపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు వేయించుకున్నవారు తరువాత తమను పట్టించుకోవడంలేదని మరికొందరు ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయాల కారణంగా రాజీవ్‌ యువకిరణాల పథకంలోని ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీలకు రావడంలేదని ఒక విద్యార్థిని ఆవేదన వ్యక్తంచేయగా, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని, జగనన్న సిఎం కావాలని పిహెచ్‌డి విద్యార్థిని ఆకాంక్షించింది.

రచ్చబండ కార్యక్రమంలో శ్రీమతి విజయమ్మతో పాటు పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి, పార్టీ నాయకులు ఆదం విజయ్‌కుమార్‌, బి. జనార్ధన్‌రెడ్డి, విజయారెడ్డి, ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌, పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్‌, చల్లా మధుసూదన్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Back to Top