ప్రజలకు ఆనం క్షమాపణ చెప్పాలి: ఉమ్మారెడ్డి

హైదరాబాద్, 13 ఏప్రిల్ 2013:

దివంగత మహానేత కుటుంబంపై అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ మాట్లాడటం రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిజస్వరూపాన్ని వెల్లడిచేస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. శుక్రవారం మంత్రి ఆనం చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. రాజకీయంగా ఆయన ఏ విధంగా పైకొచ్చారో అందరికీ తెలుసన్నారు. తోటి పార్లమెంటు సభ్యుడిని, రాజకీయనాయకుడిని ఎలా వ్యవహరించాలో తెలియని మంత్రి సంస్కృతి బయటపడిందన్నారు. వెలివేయాలి అనేది సామాజికంగా అభ్యంతరకమైనదన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి న్యాయవ్యవస్థతో సమానమనుకుంటున్నట్లుగా ఉందనీ, అందుకే జగన్ను ఉరి తీయాలనీ, వైయస్ఆర్ కుటుంబాన్ని వెలివేయాలనీ చేస్తున్న వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయనీ ఉమ్మారెడ్డి చెప్పారు. తన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రిని ఆయన డిమాండు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పెల్లుబికిన ఆందోళనలు

ఇలా ఉండగా మహానేత డాక్టర్ వైయస్ఆర్ పైనా, ఆయన కుటుంబంపైనా మంత్రి ఆనం చేసిన వ్యాఖ్యలపై అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలను వ్యక్తంచేస్తున్నారు. ఆనం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజమండ్రిలో.. మంత్రి పదవిని కాపాడుకునేందుకు మహానేత కుటుంబంపై విమర్శలకు దిగడం దారుణమని నేతలు చెప్పారు. వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు. హైదరాబాద్ పాతబస్తీలో మంత్రి ఆనం దిష్టి బొమ్మను వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు. పార్టీ నేత అబ్దుల్ హమీద్ ఆందోళనకు నేతృత్వం వహించారు. జీడిమెట్ల ఏపీఐఐసీ వద్ద కూడా మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. రంగారెడ్డి యూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. షాపూర్‌నగర్ చౌరస్తాలో పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్ అనుచరులు ఆనం దిష్టిబొమ్మను దహనం చేసి,  రాస్తారోకో చేశారు. ఆనం తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఆయన దిష్టిబొమ్మను ఊరేగించి, దహనం చేశారు. అధిష్టానం మెప్పుపొందేందుకే ఆనం పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారని జిల్లా పార్టీ కన్వీనర్ గౌతంరెడ్డి ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోనూ కార్యకర్తలు నిరసన తెలిపి, ఆనం తక్షణం శ్రీ జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలో కూడా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.  కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్, చెల్లుబోయిన వేణుగోపాల్ ఇందులో పాల్గొన్నారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో పుత్తా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆనం దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఆనం క్షమాపణ చెప్పకుంటే మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. వరంగల్ ఎంజీఎం సెంటర్లో మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. మంత్రి క్షమాపణ చెప్పాలని కోరారు. వ్యాఖ్యలు ఉపసంహరించుకోకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Back to Top