<strong>హైదరాబాద్, 14 మార్చి 2013:</strong> ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి అన్నారు. ఇలాంటి ప్రజావ్యతిరేక ప్రభుత్వం మెడలు వంచాల్సిన ప్రధాన ప్రతిపక్షం టిడిపి ముందుకు రాలేదు కాబట్టే తమ పార్టీ తరపున అవిశ్వాసం తీర్మానం నోటీసును స్పీకర్‌కు అందజేశామని శోభా నాగిరెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలపై అవిశ్వాసం ఎవరు పెట్టినా తమ పార్టీ మద్దతిస్తుందని ఆమె తెలిపారు. తీవ్ర గందరగోళం మధ్య శాసనసభ వాయిదా పడిన అనంతరం శోభా నాగిరెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.<br/>ప్రధాన ప్రతిపక్షంగా టిడిపి ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని శోభా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదనే ఏకవాక్య తీర్మానాన్ని సభ నిబంధన 75 కింద వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌కు అందజేసింది. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్మానంపై శుక్రవారంనాడు అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది.