ప్రజల హృదయాల్లో మహానేత

పుత్తూరు: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మూడేళ్ల క్రితం మృతి చెందినా నేటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కె.నారాయణస్వామి పేర్కొన్నారు. గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్‌లో భాగంగా సోమవారం కార్వేటినగరం మండలం సురేంద్రనగరంలో జరిగిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నవీన్‌బాబు, విశ్రాంత వీఏవో సుబ్బులురాజు ఆధ్వర్యంలో సుమారు 100 కుటుం బాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ జిల్లా కన్వీనర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడిన వైఎస్ పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదలకు ఎంతో దగ్గరయ్యారన్నారు. ప్రజల హృదయాల నుంచి వైఎస్సార్‌ను తొలగించడం ఎవ్వరికీ సాధ్యం కాదన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో దుర్మార్గులు, స్వార్థపరులను మినహాయిస్తే మిగిలిన వారంతా మహానేత వైఎస్సార్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డికే మద్దతు ఇస్తారన్నారు. అలాంటి నేతను కాంగ్రెస్ ప్రభుత్వం చక్రబంధంలోకి నెట్టి లబ్ధిపొందేందుకు చేస్తున్న ప్రయత్నం ఎప్పటికీ ఫలించదన్నారు. వైఎస్సార్ సీపీలో చేరిన మాజీ సర్పంచ్ నవీన్ మాట్లాడుతూ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి ప్రోత్సాహం, తన బావ హిమజ విద్యా సంస్థల చైర్మన్ ఎం.సురేంద్రరాజు చొరవతో పార్టీలోకి వచ్చినట్లు తెలిపారు. సురేంద్రరాజు మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ ఆశయ సాధనలో భాగంగా చేపట్టే ప్రతి కార్యక్రమంలో తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.

పార్టీలో చేరిన ముఖ్యులలో తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీనివాసరాజు, ఆనందయాదవ్, రాఘవులు, కాంగ్రెస్‌కు చెందిన వేలురెడ్డి, గంగిరెడ్డి, మాజీ సర్పంచ్ ధర్మయ్య, మోహన్, నట్రాజు,కుమార్, వెంకటరమణ, పెరిస్వామిరెడ్డి, రమేష్‌బాబు, చమర్తి సుజాతమ్మ, రాజేశ్వరి ఉన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఉదయ్‌కుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యులు చక్రపాణిరెడ్డి, బీరేంద్రవర్మ, ఆదిమూలం, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సి.జగదీశ్వర్‌రెడ్డి, కార్వేటినగరం మండల కన్వీనర్ శ్రీరాములనాయుడు, వెదురుకుప్పం మండల కన్వీనర్ ధనంజేయరెడ్డి, పాలసముద్రం మండల కన్వీనర్ సుందరరాజు, జిల్లా ఎస్సీ సెల్ నేతలు కేశవులు, శ్రీరాములు, హిమజ విద్యాసంస్థల కరెస్పాండెంట్ ఎ.నిషిద, పుత్తూరు నాయకులు పి.జె.నారాయణరెడ్డి, జనార్దన్‌యాదవ్, వై.రామూర్తి పాల్గొన్నారు.

కాంగ్రెస్, టీడీపీలకు కాలం చెల్లు..

సత్తెనపల్లి: అధికార కాంగ్రెస్, విపక్ష తెలుగుదేశం పార్టీలు ప్రజా సమస్యలను గాలికొదిలేశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ విమర్శించారు. కుమ్మక్కయిన ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ‘గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ కార్యక్రమం ప్రారంభ సందర్భంగా సోమవారం ఎన్‌టీఆర్ కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. సభలో మర్రి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలు ప్రజావిశ్వాసం కోల్పోయాయన్నారు. మహానేత వైఎస్ సంక్షేమ పథకాలకు ప్రభుత్వం తిలోదకాలు ఇస్తోందని ధ్వజమెత్తారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కిస్తోందన్నారు.

సభలో వేమూరు నియోజకవర్గ పార్టీ నేత మేరుగ నాగార్జున, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఐదు జిల్లా కో ఆర్డినేటర్ వజ్రాల డైమండ్‌బాబు, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ దేవళ్ళ రేవతి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు, చాంబర్ ఆఫ్ కామర్సు జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, మైనార్టీ విభాగం జిల్లా కన్వీనర్ సయ్యద్ మహబూబ్, జిల్లా నాయకులు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, మామిడి రాము, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, లోయ తాండవకృష్ణ, కిక్కురు వెంకటేశ్వరరెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ పార్టీ నాయకులు పులివర్తి రత్నబాబు, మైనార్టీ విభాగం రాష్ట్ర అడహాక్ కమిటీ సభ్యుడు బిలాల్ కరీం మాట్లాడారు. సభకు పార్టీ పట్టణ నాయకుడు గార్లపాటి ప్రభాకర్ అధ్యక్షత వహించారు.

వైఎస్ ఆశయ సాధనకు పాటుపడాలి.. అంబటి

వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ వైఎస్ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ పాటు పడాలన్నారు. జగన్ జైలు నుంచి ఎప్పుడు వస్తారని మీరంతా అడుగుతున్నారని, జగనన్న జైలులో లేడని, జనం గుండెల్లో గూడుకట్టుకున్నారని చెప్పారు. అధికారపార్టీ కక్షగట్టి, నేరారోపణలు మోపి వైఎస్ జగన్‌ను జైలులో పెట్టించిందని ఆరోపించారు. వైఎస్ జగన్ ఆదేశానుసారం సత్తెనపల్లిలో చేపట్టిన గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్‌ను పూర్తిస్థాయిలో కొనసాగిస్తానని, ప్రతి గడప ఎక్కుతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మకు ప్రజలంతా అండగా ఉండాలని కోరతానన్నారు. ప్రజాశీస్సులతో వచ్చే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారని ఆయన అన్నారు.

పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం.. ఆర్కే

వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) మాట్లాడుతూ అవసాన దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఒంటి చేత్తో 2004, 2009 ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చారని చెప్పారు. వైఎస్ పాలనలో అనేక సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేశారని వివరించారు. పేదల జీవితాల్లో మళ్లీ వెలుగులు రావాలంటే జననేత జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. మహానేత అకాలమరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ కుటుంబానికి ఎంత అన్యాయం చేసిందో ప్రజలు గమనించాలని కోరారు. వైఎస్ జగన్ నల్లకాల్వలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం వల్లే అధికారపార్టీ వేధింపులకు గురిచేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, అప్పుడే వైఎస్ ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు.

తాజా వీడియోలు

Back to Top