ప్రజాదరణను ఓర్వలేకే ఆరోపణలు

విజయవాడ, 29 మార్చి 2013:

రాజన్న రాజ్యం కోసం దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుమార్తె శ్రీమతి వైయస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్రకు వస్తున్న ప్రజాస్పందనను చూసి ఓర్వలేని టీడీపీ నాయకులకు మతి భ్రమించిందనీ, ఆ నిరాశలో  ఆరోపణలు చేస్తున్నారనీ వైయస్ఆర్ కాంగ్రెస్ కేంద్రపాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు.  అనవసర, అసందర్భ, అసత్య ఆరోపణలు మాని, ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాలని టీడీపీ నాయకులకు హితవు పలికారు. అసెంబ్లీలో అవిశ్వాసానికి మద్దతు తెలపని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, విద్యుత్తుపై హైదరాబాద్‌లో ఆందోళనకు దిగడం పెద్ద నాటకమని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో 8 సార్లు విద్యుత్తు చార్జీలు పెంచారని గుర్తుచేశారు. ప్రస్తుత కిరణ్‌ సర్కార్ మూడేళ్లపాలనలో మూడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి రూ.32 వేల కోట్ల భారం ప్రజలపై మోపిందని వివరిం చారు. ఏప్రిల్ నుంచి మరో రూ.12 వేల కోట్ల భారం మోపేందుకు సిద్ధంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌ను కట్టకట్టి బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

వర్ల ఆరోపణలు అవివేకం: ప్రజల బాధలు తెలుసుకునేందుకు శ్రీమతి వైయస్ షర్మిల చేస్తున్న పాదయాత్రను వక్రీకరించడం టీడీపీ నాయకుడు వర్ల రామయ్య అవివేకానికి నిదర్శనమని కల్పన అన్నారు. ప్రభుత్వానికి సహకరిస్తున్నందుకు ముఖ్యమంత్రి కిరణ్ నుంచి చంద్రబాబుకు ముడుపులు ఎన్ని ముట్టాయో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా అనవసర ప్రేలాపనలుమాని ప్రజాసేవ చేయ్యాలని హితవు పలికారు. వైయస్ఆర్ కాంగ్రెస్  నాయకుడు, మాజీ ఎంపీపీ దాసరి అశోక్ కుమార్, పామర్రు మండల ప్రచార కమిటీ కన్వీనర్ బి.ఎ.ఎం.లాజరస్, దాసరి శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు నందిపు నాంచారయ్య, కొలుసు కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Back to Top