'ప్రజాదరణ చూసి ఆ పార్టీల అసత్య ఆరోపణలు'

నెల్లూరు : శ్రీమతి షర్మిల మరో ప్రస్థానం పాదయాత్రకు ప్రజల నుంచి ఆదరణ రోజురోజుకూ పెరుగుతున్నదని నెల్లూరు ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆమెకు వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్, ‌టిడిపి, బిజెపి నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రధానంగా  శ్రీమతి షర్మిల కాలికి దెబ్బ తగలలేదని  టిడిసి, బిజెపి నాయకులు మాట్లడడం నీచాతినీచమన్నారు. ఆమె మోకాలికి గాయం కాకపోతే పాదయాత్ర ఆపాల్సిన అవసరం లేదన్నారు. మోకాలికి గాయం కాకపోతే శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం కోస్తా ప్రాంతంలో జరుగుతూ ఉండేదన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీలు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని మేకపాటి హితవు పలికారు.

మోకాలి దెబ్బకు శస్త్ర చికిత్స చేసిన తరువాత ఆరు వారాలు విశ్రాంతి కావాలని వైద్యులు చెప్పారని రాజమోహన్‌రెడ్డి అన్నారు. వైద్యులు పరీక్షించిన అనంతరం పాదయాత్ర చేసుకోవచ్చని తెలిపారన్నారు. ఇవన్నీ అబద్ధమని కొందరు నాయకులు దిగజారి మాట్లాడడం దారుణమన్నారు. రెండో విడత పాదయాత్రలోనూ జనం నుంచి విశేష స్పందన లభిస్తుండడంతో కాంగ్రెస్, ‌టిడిపి, బిజెపి నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఒకప్పుడు ఎన్‌ఆర్‌కు ఉన్న జనాదరణ ఇప్పుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి, శ్రీమతి షర్మిలకు ఉన్నదని రాజమోహన్‌రెడ్డి చెప్పారు.

మహానేత వైయస్‌ఆర్ లేని లోటు‌ను శ్రీ జగన్మోహన్‌రెడ్డి తీరుస్తారని ప్రజలు భావిస్తున్నారన్నారు. జననేత జగన్‌పై ఎవరెన్ని ఆరోపణలు చేసినా జనం నమ్మరన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా శ్రీ జగన్మోహన్‌రెడ్డి సిఎం కావడం తథ్యం అన్నారు. చంద్రబాబో, ఇంకొక బాబో దీనిని ఆపలేరన్నారు. సిబిఐ విచారణ అనంతరం ఎవరు దోషులో ఎవరు కాదో తేలుతుందన్నారు.
Back to Top