గుంటూరు జిల్లాలో 11 నుంచి ప్రజాసంకల్పయాత్ర

 
 
-  బాపట్ల నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న వైయ‌స్‌ జగన్‌
- అదే రోజు 1500 కిలో మీటర్లు పూర్తిచేసుకోనున్న యాత్ర
- 12న బాపట్లలో వైయ‌స్ఆర్‌సీపీ  ఆవిర్భావ దినోత్సవం
- బాపట్ల పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ

గుంటూరు: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 11వ తేదీన గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తుందని బాపట్ల పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అధ్యక్షతన పట్టణంలోని కోన చాంబర్‌లో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం  జరిగింది. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ జననేత వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అన్ని జిల్లాల్లో పాదయాత్రకు అనూహ్యస్పందన కనిపిస్తోందన్నారు. స్థానిక నాయకుల అంచనాలకు మించి ప్రజలు, అభిమానులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు తరలివస్తున్నారని వివరించారు. ప్రత్యేక హోదాకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ కట్టుబడి ఉందని గుర్తుచేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన విషయంలో మిగిలిన రాజకీయ పార్టీలు కూడా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అనుసరించాల్సిందేనని పేర్కొన్నారు.

 1500 కిలో మీటర్లు పూర్తిచేసుకోనున్న పాదయాత్ర
వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 11వ తేదీన 1500 కిలోమీటర్లు పూర్తిచేసుకుంటుందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. ఆ రోజు ఉదయం 8.30 గంటల సమయంలో ప్రకాశం జిల్లా ఈపూరుపాలెం నుంచి గుంటరు జిల్లా, బాపట్ల నియోజకవర్గంలోని స్టువర్టుపురంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందని వివరించారు. అక్కడి నుంచి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రగా వెదుళ్లపల్లి, కుక్కలవారిపాలెం, దరివాదకొత్తపాలెం మీదుగా సాయంత్రం 4 గంటలకు బాపట్ల చేరుకుంటారని తెలిపారు. జిల్లాలో మొదటి సారిగా బాపట్లలోనే పెద్దనందిపాడు ఫ్లై ఓవర్‌బ్రిడ్జి వద్ద భారీ బహిరంగ సభ జరుగుతుందని వెల్లడించారు. పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచే పలుప్రసంగాలు ఉంటాయని, కచ్చితంగా 4 గంటలకు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభకు చేరుకుని ప్రసంగిస్తారని కోన తెలిపారు. ఆ రోజు రాత్రి స్థానిక ఏబీఎం హైస్కూలు ప్రాంగణంలో బసచేసి, 12వ తేదీ ఉదయం 8.30 గంటలకు చిన్నగొల్లపాలెం వద్ద జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారు. ఆ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారని వివరించారు. అనంతరం మూర్తిరక్షణనగర్‌ మీదుగా ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతుందని తెలిపారు. మధ్యాహ్నం అప్పికట్లలో భోజనం పూర్తిచేసుకుని ఈతేరు, చుండూరుపల్లి మీదుగా పొన్నూరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారని వివరించారు. ప్రజా సంకల్ప యాత్రను కర్యకర్తలు సమష్టిగా విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోన రఘుపతి కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్‌రెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు, కోకి రాఘవరెడ్డి, మున్సిపల్‌ ప్రతిపక్షనేత షేక్‌ సయ్యద్‌ పీర్, కౌన్సిలర్‌ గొర్రు పుష్పరాజ్యం, గేరా యేషయ్య, నాయకులు వేల్పుల మీరాబీ, ఇట్టా జ్యోతి, లక్ష్మీరాఘవ, మారం రామకోటి, కూనపురెడ్డి అవినాష్‌నాయుడు, ఆట్ల ప్రసాద్‌రెడ్డి, సోము రాజశేఖర్‌రెడ్డి, గొర్రుముచ్చు వెంకటేశ్వర్లు, జోగి రాజా, కటికల యోహోషువా తదితరులు పాల్గొన్నారు.

 
Back to Top