అద్భుతం వైపు జననేత అడుగులు

 

- రెండు రోజుల్లో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ 3వేల కి.మీ.  
-  అరుదైన క్షణాల కోసం కళ్లలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్న జ‌నం
- విజ‌య‌న‌గ‌రం జిల్లాలో భారీగా ఏర్పాట్లు 

విశాఖ‌: ఒక మహోన్నతాశయం.. ఒక మహా సంకల్పం కలిసి.. ఒక మహోజ్వల ఘట్టం వైపు అడుగులు వేస్తున్నాయి.. మరో రెండు రోజుల్లో ఆవిష్కృతం కానున్న ఆ అద్భుతం వైపు జననేత వైయ‌స్‌ జగన్‌ అడుగులు వడివడిగా సాగనున్నాయి. భారీ వర్షాల కారణంగా రద్దయిన ప్రజాసంకల్పయాత్ర శనివారం నుంచి యథాతథంగా ప్రారంభ‌మైంది. విశాఖ జిల్లాలో జననేత పాదయాత్ర చివరి అంకానికి చేరినప్పటికీ.. అత్యంత అరుదైన 3వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకునే అరుదైన ఘటన పేరుకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంటున్నప్పటికీ.. ఆ ప్రాంతం విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోదే కావడం.. జిల్లా ప్రజలకు గర్వకారణం. అందుకనే ఆ అరుదైన క్షణాల కోసం కళ్లలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. 

వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్ర మరో చారిత్రక ఘట్టం వైపు వడివడిగా దూసుకెళ్తోంది. జిల్లాలోని 11 నియోజకవర్గాలు దాటిన పాదయాత్ర.. గత వారం రోజులుగా భీమిలి నియోజకవర్గంలో అప్రతిహతంగా సాగుతోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో 40 కిలోమీటర్ల మేర పూర్తయిన పాదయాత్ర జిల్లా దాటే సమయానికి 50 కిలోమీటర్ల మార్కు అధిగమించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మండుటెండలోనూ.. జోరువానలోనూ ప్రజలు సంకల్పధీరుడికి బ్రహ్మరథం పడుతున్నారు. అభిమాన వర్షం కురిపిస్తూ పూలదారులు పరిచి నడిపిస్తున్నారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలిలో జననేతకు లభిస్తున్న ప్రజాదరణ అధికార టీడీపీలో వణుకు పుట్టిస్తోంది.

పప్పలవానిపాలెం క్రాస్‌ నుంచి పాద‌యాత్ర‌ ప్రారంభం 
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శనివారం ఉదయం వైయ‌స్‌ జగన్‌.. భీమిలి నియోజకవర్గంలోని పప్పలవానిపాలెం క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కొలవానిపాలెం క్రాస్‌, భీమేంద్రపాలెం, ఎర్రవానిపాలెం క్రాస్‌, రామవరం మీదుగా గండిగుండం క్రాస్‌ వరకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది. జ‌న‌నేత‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు.   కొండ ప్రాంతాలు.. ఇరుకుదారులను సైతం పట్టిం చుకోకుండా పల్లెల్లో గుండా సాగుతున్న ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 

మ‌రో రెండు రోజుల్లో విజ‌య‌న‌గ‌రం జిల్లాలోకి..
విశాఖ జిల్లాలో అడుగుపెట్టినప్పటి నుంచి అప్రతిహతంగా సాగుతున్న పాదయాత్ర మరో రెండు రోజుల్లో విజయనగరం జిల్లాలో అడుగుపెట్టనుంది. విశాఖ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గంలో చారిత్రక అడుగులు పడబోతున్నాయి. కొత్తవలస సమీపంలో బహుశా చరిత్రలోనే మొదటిసారి 3వేల కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించడం ద్వారా అరుదైన ఘట్టాన్ని ఆవిష్కరించనున్నారు. సోమవారం విశాఖ జిల్లా దాటి విజయనగరంలో అడుగుపెట్టబోతున్న జననేత వెంట జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులు, ప్రజలు వేలాదిగా కదంతొక్కేందుకు, 3వేల కిలోమీటర్ల చారిత్రక ఘట్టంలో భాగస్వాములయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. జిల్లాలోనే మూడువేల కిలోమీటర్ల మైలురాయిని దాటుతుండటంతో ఆ ఘట్టాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు ఇప్పటికే పైలాన్‌ నిర్మాణాన్ని ప్రారంభించి శరవేగంగా పనులు జరిపిస్తున్నారు. భారీ ద్వారాలు, కటౌట్లు, బ్యానర్ల ఏర్పాటుతో పాటు ప్రత్యేక కళా బృందాలను రప్పించి ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా స్వాగతం పలకడానికి జిల్లా ఎదురుచూస్తోంది. 

 

Back to Top