అధికారం ఎవరికీ శాశ్వతం కాదు

నెల్లూరు: అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పార్టీలు మారుతుంటాయని, అధికారులు వారి విధులు నిజాయితీగా నిర్వర్తించి ప్రజలకు మేలు చేయాలని వైయస్‌ఆర్‌సీపీ నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ సూచించారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్‌ నుంచి వీఆర్‌సీ వరకు జరుగుతున్న డివైడర్‌ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎక్కడైనా అత్యవసరంగా మంచినీటి కోసం జనం బోరు వేయమని కార్పొరేషన్‌ అధికారులను అడిగితే దానికి టెండర్‌ పిలిచేందుకు సాకులు చెబుతున్నారని ఫైర్‌అయ్యారు. అదే డివైడర్‌లో మట్టి తీసేందుకు మాత్రం అత్యుత్సాహం చూపుతున్నారని, ఈ అధికారులు ప్రజలకు మేలు చేయకుండా కాంట్రాక్టర్లకు, అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. వీఆర్‌సీ నుంచి దాదాపు వంద మీటర్ల వరకు టెండర్లు పిలువకుండా నామినేషన్‌ పద్దతితో పనులు కట్టబెట్టడం వెనుక ఉన్న రహస్యం ఏంటని ప్రశ్నించారు. నెల్లూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్‌ దేవరకొండ అశోక్, నాయకులు దార్ల వెంకటేశ్వర్లు, వేలూరు మహేష్, రంగ, రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top