మీకు పదవులే ముఖ్యమా..?

  • విభజన చట్టంలోని హామీలకు తూట్లు
  • మీకు ప్రజల ప్రయోజనాలు పట్టవా..?
  • రాజీనామా చేసి ప్రజల కోసం పోరాడలేరా..?
  • హోదా, రైల్వే జోన్ తీసుకురాలేని  చేతగాని దద్దమ్మలు
  • టీడీపీ, బీజేపీ నేతలపై రోజా ఫైర్
విశాఖపట్నంః పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్రం తప్పించుకుంటుంటే నిలదీయాల్సిన పెద్దమనుషులు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆర్కే రోజా టీడీపీ, బీజేపీ నేతలపై మండిపడ్డారు.  జిల్లాకు వచ్చినప్పుడు  మోడీ, బాబు, పవన్ కళ్యాణ్ లు  ప్రత్యేకహోదా, రైల్వేజోన్ ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో 17మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇద్దరు బీజేపీ ఎంపీలు, బాగా డబ్బున్న రాజ్యసభ ఎంపీలున్నారని.. ఇంతమంది వున్నా రైల్వే జోన్ ఎందుకు తీసుకురాలేకపోతున్నారని రోజా నిలదీశారు. రైల్వే జోన్ తీసుకురాలేని దద్దమ్మ ఎంపీలు ఇంకా ఎందుకు పదవులు పట్టుకొని వేలాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజీనామా చేసి ప్రజల కోసం పోరాడలేరా..? అని నిలదీశారు. మంత్రి పదవులు రాలేదు, బాబు గుర్తించలేదని రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డ  టీడీపీ ఎమ్మెల్యేలు...ప్రత్యేకహోదా, రైల్వే జోన్ కోసం ఏనాడైనా సిద్ధపడ్డారా..?అని రోజా నిప్పులు చెరిగారు. టీడీపీ, బీజేపీ నేతలకు పదవులు ముఖ్యం, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కాదన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గుర్తించారని రోజా పేర్కొన్నారు. విశాఖకు రైల్వే జోన్ కోసం జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన పాదయాత్ర 8వ రోజుకు చేరుకున్న సందర్భంగా రోజా తన సంఘీభావం తెలిపారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.....ఏపీనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వేమంత్రి, అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందిన మరో కేంద్రమంత్రి అశోకగజపతిరాజులు..తమ ప్రాంత ప్రజలకు  అన్యాయం జరుగుతుంటే  ఇంకా మోడీ క్యాబినెట్ లో ఎందుకు నోరుమూసుకొని కూర్చుంటున్నారని రోజా ప్రశ్నించారు.  మీ పౌరుషం ఏమైంది అశోకగజపతి రాజు అని నిలదీశారు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు కోసం కేసీఆర్ , కేంద్రంతో  లాలూచీ పడి అందరి కాళ్లు పట్టుకోవడం చేతనవుతుంది గానీ ప్రజలకిచ్చిన హామీకోసం పోరాడేందుకు చేతకాదా..? అని రోజా విరుచుకుపడ్డారు. కేంద్రంతో భాగస్వామిగా వుంటూ కేంద్రమంత్రి పదవులు పొంది రాజకీయంగా లబ్దిపొందుతున్నారేగానీ ఈ ప్రాంత ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని తూర్పారబట్టారు. బ్యాంకులకు రూ. 200 కోట్లు ఎగ్గొట్టిన ఇక ఇదే ప్రాంతానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఏనాడు కూడా ప్రత్యేక రైల్వే జోన్ గురించి మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. మంత్రులు గంటా, నారాయణలకు ల్యాండ్ పూలింగ్ కుంభకోణాలపై ఉన్న శ్రద్ధ ఈ ప్రాంత ప్రయోజనాలపై లేకపోవడం దురదృష్టకరమన్నారు. వీరి ఆలోచనంతా నారాయణ కాలేజీలో పేపర్లు ఎలా లీక్ చేయాలి, ర్యాంకులు ఎలా కట్టబెట్టాలన్నదేనని ఎద్దేవా చేశారు. పేపర్ లీకవుతుంటే అసెంబ్లీని కూడ పట్టించుకోకుండా ఢిల్లీ వెళ్లి కేంద్రం కాళ్లు పట్టుకోవడం చేతవుతుంది గానీ జోన్ కోసం మాట్లాడడం వీళ్లకు చేతకావడం లేదని దుయ్యబట్టారు.
 
లోకేష్ కన్నాఇంకా వేస్ట్ అని చంద్రబాబు డిమోషన్ ఇచ్చిన మరో మంత్రి అయ్యన్నపాత్రుడుకి గిరిజన ప్రాంతంలో బాక్సైట్, గంజాయి సాగుపై ఉన్న ఇంట్రస్ట్ రైల్వే జోన్ పై లేకపోవడం బాధాకరమన్నారు.  ఎప్పుడు చూసినా వైయస్ జగన్ ను తిడుతూ అనవసర విషయాల్లో నోరుపారేసుకునే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు లాంటి ఎమ్మెల్యే విశాఖ ప్రాంతంలో పుట్టడం సిగ్గుచేటన్నారు. కేంద్రం విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా మోసం చేస్తుంటే అడగడు గానీ, టీడీపీ వాళ్లు తిట్టమన్నప్పుడల్లా తమపై బురజల్లడం మాత్రం బాగా చేతనవుతుందని మండిపడ్డారు. యువకుడు, వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ ఈ ప్రాంత ప్రయోజనాల కోసం  వైయ జగన్ ఆశీస్సులతో  రైల్వే జోన్ కోసం సీరియస్ గా పోరాడుతుంటే....టీడీపీ, బీజేపీ నేతలు పదవులు అనుభవిస్తూ, వైయస్ జగన్ ను తిడుతూ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీలు రాష్ట్ర ప్రజలను వదిలేసినా,  రాష్ట్రానికి రావల్సిన ప్రత్యేక హోదా, ర్వైల్వే జోన్ సహా అన్ని హామీలపై వైయస్ జగన్ గల్లీ నుంచి ఢిల్లీదాక తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటారని రోజా తెలిపారు. ప్రజల ఆకాంక్ష, తండ్రి ఆశయాలే ఆయనకు ముఖ్యమని... అలాంటి నాయకత్వం కింద పనిచేస్తూ అమర్నాథ్ పాదయాత్ర మొదలుపెట్టడం అభినందనీయమన్నారు. 

టీడీపీ, బేజేపీలు ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో వీధుల్లో తిరిగే పరిస్థితి ఉండదని రోజా హెచ్చరించారు. వైజాగ్ కు అన్ని అర్హతలున్నా రైల్వే జోన్ ఇవ్వకుండా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలన్నారు. ఇక ఫిరాయింపులపై రోజా మాట్లాడుతూ బాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  బాబు నీవు గెలిపించుకున్న వందమందిలో నీతివంతులు, సమర్థులు లేరని తీసుకెళ్లారా...? అంటూ మండిపడ్డారు.  ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పీతలను ఇంటికి పంపించి లాస్ట్ ర్యాంకు వచ్చిన నారాయణకు అదనపు శాఖ ఇవ్వడమేంటని నిలదీశారు. అయ్యన్నపాత్రుడు వేస్ట్ అని చెప్పారు. దొడ్డిదారిన వచ్చిన లోకేష్ కు బరువైన శాఖలు అప్పగించారు. పార్టీలు మారేవాళ్లు, సిన్సియారిటీ, ఎక్స్ పీరియన్స్ లేనివాళ్లు,  విలువలు లేని వాళ్లకు మంత్రి పదవులిస్తే ప్రజలకు ఏవిధంగా న్యాయం చేస్తారని బాబును కడిగిపారేశారు. మంత్రి పదవుల్లో కూడ బాబు మహిళలపై వివక్ష చూపుతున్నారని ఆగ్రహించారు. మైనారిటీలు, ఎస్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం బాబు కుటిల వైఖరికి అద్దంపడుతోందన్నారు. 

Back to Top