కరీంనగర్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
కరీంనగర్‌లోని కళాభారతిలో ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పొంగులేటితోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శివకుమార్, నల్లా సూర్యప్రకాష్, గాదె నిరంజన్, మతిన్, గున్నం నాగిరెడ్డి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు భీష్మ రవీందర్, రాష్ట్ర నాయకులు బోయినపల్లి శ్రీనివాస్, అక్కెనపెల్లి కుమార్, ముస్తాక్, డాక్టర్ నగేష్, సెగ్గం రాజేష్, సందమళ్ల నరేష్, జగతి, సంతోష్‌రెడ్డి, ముల్కల గోవర్దన్, మందా రాజేష్‌కుమార్, ఎండీ.వాజీద్ తదితరులు హాజరయ్యారు.
సమావేశం ప్రారంభంలో దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆత్మహత్యలు చేసుకున్న 600 మంది రైతులకు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు.తర్వాత పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి ఏమన్నారంటే.. సీఎం అంటే వైఎస్సే..‘‘2004కు ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను 15 మంది, ఆ తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలుపుకొని ముగ్గురు ముఖ్యమంత్రులు పాలించారు. కానీ సీఎం అంటే వైఎస్‌లా ఉండాలి. జనం గుండెల్లో నిలిచిన వ్యక్తి వైఎస్. కాబట్టే ఆయన మరణాన్ని తట్టుకోలేక చాలామంది చనిపోయారు. కరీంనగర్ జిల్లాలోనూ 30 మంది చనిపోయారు. ఆ కుటుంబాలను పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఓదార్చాల్సి ఉన్నా కొన్ని కారణాలవల్ల ఖమ్మంలో మినహా ఎక్కడా పర్యటించలేకపోయారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక షర్మిల రెండు జిల్లాల్లో పర్యటించారు. త్వరలోనే కరీంనగర్లోనూ పర్యటించి ఆయా కుటుంబాలను పరామర్శిస్తారు. ఎన్నికలకు ముందు సీమాంధ్రలో రుణమాఫీ పేరుతో ఎడాపెడా హామీలిస్తుంటే... మనం కూడా కనీసం రూ.50 వేల వరకైనా రుణమాఫీ చేద్దామని జగన్ వద్ద ప్రతిపాదించాను. అప్పుడాయన ‘టీడీపీ వాళ్లు లక్ష కాదు కదా.. రూ.5 వేలు కూడా మాఫీ చేయలేరు’ అని చెప్పారు. ఆనాడు జగన్ చెప్పిందే నేడు జరుగుతోంది. ఆర్భాటమే తప్ప ఆచరణ ఏది?వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలపై ఆర్భాటపు మాటలతో పత్రికలు, టీవీల ప్రకటనలకే పరిమితమవుతున్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ప్రకటించినా ఏ జిల్లాలోనూ 20 కుటుంబాలకు మించి భూ పంపిణీ జరగలేదు. పింఛన్లలోనూ కోత విధిస్తున్నారు. కొత్తగూడెంలో వైఎస్ హయాంలో 6 వేల మందికి పింఛన్లు ఇస్తే... సగం ఆపేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును వైఎస్ 90 శాతం పూర్తి చేస్తే.. నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు.
ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని చెప్పిన కేసీఆర్.. మాట నిలబెట్టుకుంటే 119 అసెంబ్లీ స్థానాలకు 118 సీట్లు వస్తాయి. కానీ అది సాధ్యమేనా? రైతాంగానికి సాయమందేవరకు పోరాడతా, పార్లమెంట్ సమావేశాల్లోనూ ప్రస్తావిస్తా. ఇచ్చిన హామీలను అమలు చేయలేని టీఆర్ఎస్ పరిస్థితి 2019లో ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. భవిష్యత్తులో తెలంగాణ అసెంబ్లీలో శాసించేది వైఎస్సార్ కాంగ్రెస్సే. కాబట్టి కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలి. ప్రజల పక్షాన పోరాడాలి. మీకు అండగా జగన్, మేము ఉంటాం.’’ సమావేశం తీర్మానాలుకరీంనగర్ జిల్లాలో కురిసిన అకాలవర్షం, వల్ల పాడైన పంట నష్టంపై నేటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధాన నిర్ణయం ప్రకటించకపోవడంపై వైఎస్సార్సీపీ నిరసన వ్యక్తం చేస్తోంది. బాధితులకు పరిహారం చెల్లించాలి.ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చాలనే ప్రభుత్వ ఆలోచనపై పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలి.వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన బహుళార్థ సాధక ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి. పూర్తయిన ఎల్లంపల్లి ప్రాజెక్టును ప్రారంభించాలి.ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మిడ్‌మానేర్, ఓబులాపూర్, గౌరవెల్లి రిజర్వాయర్లను వెంటనే పూర్తి చేయాలి.అకాల వర్షాలతో నష్టపోయిన కరీంనగర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి.దళితులకు, ఆదివాసీల కుటుంబాలకు మూడెకరాల భూమి పంపిణీ చేయూలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలి.తక్షణమే చేనేత కార్మికులను ఆదుకోవాలి.వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులందరికీ ప్రభుత్వం ప్రకటించిన పింఛన్లు ఇవ్వాలి.మైనార్టీలకు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానన్న కేసీఆర్ వాగ్దానాన్ని అమలు చేయాలి.డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ రుణాల్ని ఇచ్చి, పాత రుణాలను మాఫీ చేయాలి.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా తక్షణమే ఉద్యోగాల భర్తీని చేపట్టాలి.తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ కింద నిధులు విడుదల చేయాలి.